ఇక పది రోజులే.. హుజురాబాద్‌లో వేడెక్కిన ప్రచారం

by Shyam |   ( Updated:2021-10-16 23:03:00.0  )
huzurabad by poll
X

దిశ, హుజురాబాద్: ప్రచారానికి పది రోజుల గడువే మిగిలింది. బతుకమ్మ, దసరా పండుగ రావడంతో 3 రోజులుగా ఎన్నికల ప్రచారానికి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు దూరంగా ఉన్నారు. 5 నెలలుగా బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై నియోజకవర్గాన్ని హీటెక్కించారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్బంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలందరూ బుధవారం తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఆదివారం తిరిగి నియోజకవర్గానికి చేరుకున్న నాయకులు ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. మండలాల వారీగా చేరుకున్న ఆయా పార్టీల ఇంచార్జీలు ప్రచార వేగాన్ని పెంచారు. పొలింగ్ కు మరో 13 రోజులే గడువు మిగిలి ఉండటం, 72 గంటల ముందే స్థానికేతరులు నియోజకవర్గం నుంచి వెళ్లిపోవాలని ఎన్నికల సంఘం సూచిస్తుండటంతో.. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

అయితే పోలింగ్ తంతు ముగిసే వరకు స్థానికులైన ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణ మోహన్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, తదితర స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ కు అండగా ఉండనున్నారు.

18 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఈటల అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ స్థానికేతరుడు కావడం, ఆ పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలో చేరిపోవడం కొంత మేరకు మైనస్ గానే చెప్పవచ్చు. 5 నెలల నుంచి నియోజకవర్గంలో మకాం వేసిన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన స్థానికేతర స్టార్ క్యాంపెయినర్లు ఈనెల 27న సాయంత్రం హుజురాబాద్ నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళక తప్పదు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాన్ని చక్క పెట్టుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Next Story