కరోనాను జయించిన కేరళ వృద్ద దంపతులు

by Shyam |
కరోనాను జయించిన కేరళ వృద్ద దంపతులు
X

దిశ వెబ్ డెస్క్ :
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. 90 శాతం మంది కరోనా బాధితుల్లో ప్రాణాల ముప్పు లేదు. కానీ వృద్ధులు, గుండె, కిడ్నీ, ఆస్తమా సంబంధిత రోగాలతో సతమవుతున్న వాళ్లకు మాత్రం కరోనా వల్ల ప్రమాదం ఉంటుందని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి నుంచి కేరళలో 93 ఏళ్ల వృద్ధుడు కోలుకున్నారు. అతనితో పాటు 88 ఏళ్ల వయసు గల ఆయన భార్య కూడా వైరస్ ను జయించింది. ఈ విషయాన్ని స్వయంగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కే కే శైలజ వెల్లడించారు. బాధితులు ఇద్దరికీ డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, ఇతర వయోభార సమస్యలున్నా వైరస్‌ నుంచి కోలుకున్నారని ఆమె తెలిపారు. దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతుండగా.. బాధితుల్లో 138 మంది కోలుకున్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ వృద్ధ జంట కరోనాను జయించి ఎంతోమంది కరోనా బాధితుల్లో ఆశలు చిగురింపజేస్తున్నారు.

దేశవ్యాప్తంగా వైరస్‌ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ… అందులోనూ కేరళ, మహారాష్ర్టల్లోనే కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయి. కేరళలో పథనంతిట్ట జిల్లాలో కూడా వైరస్ సోకిన వాళ్లు ఎక్కువమందే ఉన్నారు. అదే జిల్లాకు చెందిన ఈ వృద్ధ దంపతులు కోవిడ్-19 నుంచి కోలుకోవడం శుభపరిణామం.

వారికి ఎలా వచ్చింది?

పథనంతిట్ట జిల్లాలోని ‘రాన్ని’ ప్రాంతానికి చెందిన థామస్ (93), మరియమ్ (88)ల కుమారుడు, కోడలు, వారి పిల్లలు ఫిబ్రవరి 29న ఇటలీ నుంచి తిరిగొచ్చారు.
అప్పటికే వారు వైరస్‌ బారినపడటంతో ఇతర కుటుంబ సభ్యులకు వ్యాపించింది. వీరికి వైరస్ సోకినట్టు మార్చి 8న నిర్ధారణ అయ్యింది. థామస్ దంపతుల కుటుంబంలోని ఏడుగురు వైరస్‌ బారినపడ్డారు. దీంతో వెంటనే వారందరినీ కొట్టాయం మెడికల్‌ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు.

40 మంది వైద్య బృందంతో :

థామస్, మరియమ్ లు ఇద్దరు కూడా వృద్దులు కావడంతో పాటు, వారు అప్పటికే డయాబెటిస్, బీపీలతో బాధపడుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయి. అందుకే వీరికి 40 మందితో కూడిన వైద్య బృందం చికిత్స అందించింది. వీరిద్దరూ కూడా వైద్యులకు ఎంతో సహకరించారు. వారు చెప్పినట్లు అన్నీ పాటించారు. చికిత్స సమయంలో థామస్‌కు గుండె నొప్పి రావడంతో ఐసీయూలోని వీఐపీ గదికి మార్చారు. భార్యాభర్తలను వేర్వేరు గదులలో ఉంచి చికిత్స చేశారు. నాలుగు రోజుల కిందట నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చింది. వీరితోపాటు మిగతా కుటుంబ సభ్యులు కూడా వైరస్‌ నుంచి బయటపడ్డారు. త్వరలో వీరిని డిశ్చార్జ్ చేస్తామని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.

మానసిక ధైర్యం ఉంటే చాలు :

కరోనా వైరస్ ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతోందని, కోవిడ్-19 మరణాల్లో వీరివే ఎక్కువ శాతం ఉందని గణాంకాలు చెబుతున్నాయి. వైరస్‌ బారినపడ్డా మానసిక స్థైర్యం కోల్పోకుండా చికిత్సకు సహకరించి, వైద్యుల సలహాలు పాటిస్తే కరోనా నుంచి కోలుకుంటారన్న నిపుణుల అంచనాలు నిజమవుతున్నాయి. కరోనా కరాళా నృత్యం చేస్తున్న ఇరాన్ లోనూ 102 ఏళ్ల వృద్దురాలు, 93 ఏళ్ల వృద్దుడు కరోనాతో పోరాడి ప్రాణాలు నిలుపుకున్నారు. ఇప్పుడు కేరళకు చెందిన థామస్ దంపతులు కూడా మానసిక ధైర్యంతో కరోనాను ఓడించారు. ఆత్మవిశ్వాసం, గుండె దైర్యం ఉంటే.. ఎవరైనా కరోనాపై గెలుపు సాధించవచ్చు.

కేరళలో సోమవారం కొత్తగా మరో 32 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ కరోనా బారినపడ్డవారి సంఖ్య 234కు చేరింది. వీరిలో ఇద్దరు మరణించగా.. 19 మంది కోలుకున్నారు.

Tags: corona virus, kerala, doctors, oldpeople, pandemic, negetive

Advertisement

Next Story

Most Viewed