సమస్యలు ఇలా.. చదివేది ఎలా?

by Anukaran |   ( Updated:2021-01-30 13:22:14.0  )
సమస్యలు ఇలా.. చదివేది ఎలా?
X

విద్యార్థులకు భౌతిక తరగతులు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది, పదో తరగతుల కోసం పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం కళాశాలలు సోమవారం నుంచి తెరుచుకుంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇందుకు ఇక ఒక్క రోజే సమయముండగా, ఇప్పటికీ పలు విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కొవిడ్ నివారణ చర్యలతో విద్యాసంస్థలు సిద్ధమయ్యాయని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు విద్యాసంస్థలను ‘దిశ’ శనివారం సందర్శించింది. చాలాచోట్ల పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు మరో వారం రోజులు పట్టేలా ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా 12,488 వేల స్కూళ్లు, 3,047 జూనియర్ కళాశాలలు, 1,046 డిగ్రీ కళాశాలలు తెరుచుకోనున్నాయి. స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు 45-60 శాతం మంది భౌతిక తరగతులకు అంగీకరిస్తున్నారు. క్లాసులు మొదలైతే స్కూల్‌కు వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని లెక్చరర్లు భావిస్తున్నారు. పర్యవేక్షణ లేకుండా ఇప్పటివరకూ నిర్వహించిన ఆన్‌లైన్ క్లాసులతో విద్యార్థులు నేర్చుకున్నదేమీ లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్కూల్స్, కాలేజీలలో ఇప్పటి వరకూ పూర్తిస్థాయిలో పారిశుధ్య పనులు పూర్తి కాలేదు. విద్యాసంస్థలను శుభ్రపరిచేందుకు మనుషులను వెతుక్కునే పనిలో ఉపాధ్యాయులున్నారు. జీపీ, మున్సిపల్ కార్మికులు పని చేస్తారని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ వాస్తవికంగా సాధ్యం కాదని నాలుగు నెలల నుంచి నిరూపితమవుతోంది. సర్వీస్ పర్సన్స్ జీతాల కోసం ఉపాధ్యాయులు దాతలను వెతుక్కుంటున్నారు. పలు స్కూళ్లకు దాతలే శానిటైజర్లు, ఇతర కొవిడ్ నివారణ సామగ్రి సమకూరుస్తున్నారు. ఇక యూనివర్సిటీలు, కాలేజీలలోనూ మౌలిక వసతులను పునరుద్ధరణ, శానిటైజేషన్ పనులు కొనసాగుతున్నాయి.

ఇదీ పరిస్థితి

హైద‌రాబాద్ జిల్లాలో 1,307 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠ‌శాల‌లు ఉన్నాయి. 9, 10 త‌ర‌గ‌తులలో 1.38 ల‌క్షల విద్యార్థులున్నారు. వీరిలో 18 వేల మంది ప్రభుత్వ, 9 వేల మంది ఎయిడెడ్ పాఠ‌శాల‌లకు చెందిన విద్యార్థులు కాగా, మిగిలిన వారు ప్రైవేట్ పాఠ‌శాల‌ల విద్యార్థులు. ప్రభుత్వ పాఠ‌శాల‌లో చ‌దివే విద్యార్థుల త‌ల్లిదండ్రులు 42 శాతం త‌మ పిల్లలు త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌య్యేందుకు లిఖిత పూర్వకంగా అంగీకారం తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని స్కూల్స్, ఇంటర్ కాలేజీ విద్యార్థులు కలిపి 2,60,609 మంది తరగతులకు హాజరు కానున్నారు. వికారాబాద్ జిల్లాలో అన్ని యాజమాన్యాలు కలిపి 278 స్కూల్స్ 22,022 మంది, 50 కాలేజీల్లో 18,512 మంది విద్యార్థులున్నారు. స్కూల్ విద్యార్థులకు తరగతులకు వచ్చిన తర్వాత మాస్కులు ఇవ్వనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటికే వాష్ రూమ్స్ శుభ్రం చేయడం, రన్నింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ ఏర్పాట్లకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతి గదులను, స్కూల్ ఆవరణలను శానిటైజ్ చేశారు. విద్యార్థులు తరగతి గదులకు వెళ్లేటప్పడు, ఇంటికి తిరిగి వెళ్లేముందు శానిటైజర్లు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా 1075 పాఠశాలలు ఉండగా, అందులో 9వ, 10వ తరగతి చదివే విద్యార్థులు 80,993 మంది ఉన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో సగానికి పైగా కనీస వసతులు లేకుండానే ఫిజికల్ క్లాసులకు సిద్ధమయ్యాయి. చాలాచోట్ల ఇప్పటివరకు పాఠశాలలను శుభ్రపర్చిన దాఖాలాల్లేవు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో 1,001 పాఠశాలలు ఉన్నాయి. 9వ తరగతిలో 50,946 మంది, పదో తరగతికి సంబంధించి 50,048 మంది విద్యార్థులు కలిసి మొత్తం 1,00,994 మంది ఉన్నారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో అన్నింటిని సన్నద్ధం చేశారు. మధ్యాహ్న భోజనానికి అవసరమైన పాత స్టాక్ స్థానంలో కొత్త స్టాక్‌ను తెప్పించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60 శాతానికి పైగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఫిజికల్ క్లాసులకు పంపించేందుకు అనుమతి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 850 ఉన్నత పాఠశాలలు ఉండగా.. ఇందులో 9, 10వ తరగతి చదివే విద్యార్థులు 73,840 మంది ఉన్నారు.

గ్రాంటు నుంచి ఖర్చు చేయండి

పాఠశాలల గ్రాంటు నుంచి శానిటైజర్లు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం ఖర్చు చేసుకోవచ్చని డీఈవోలు ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాలో 398 ఉన్నత పాఠశాలలు ఉండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హైస్కూళ్లలో శానిటైజేషన్ ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ స్కూళ్లలో సరిపడినన్నీ వాష్ రూమ్స్ లేవు. తాగునీరు సహా ఇతర మౌలిక వసతుల్లోనూ విద్యార్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు తరగతి గదిలో 20 మందికి మించకుండా విద్యార్థులను అనుమతిస్తున్నారు. ఉస్మానియా వర్సిటీలోనూ శనివారం పారిశుధ్య పనులు ప్రారంభించారు. బాత్రూంలు, టాయిలెట్లు క్లీనింగ్ చేసే పనులను చేపడుతున్నారు. లాక్‌డౌన్ నాటి నుంచి నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో హాస్టల్, టాయిలెట్ గదులు అపరిశుభ్రంగా తయారయ్యాయి. వీటిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడానికి మరో రెండు, మూడు రోజుల సమయం పడుతుందని సిబ్బంది చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed