ఫారిన్ చదువులకు పెరుగుతున్న క్రేజ్.. పేరెంట్స్ ప్రెస్టేజీగా ఫీలవుతున్నారా?

by Gantepaka Srikanth |
ఫారిన్ చదువులకు పెరుగుతున్న క్రేజ్.. పేరెంట్స్ ప్రెస్టేజీగా ఫీలవుతున్నారా?
X

ఏ తల్లిదండ్రులకు అయినా తమ కొడుకు లేదా కూతురు ఫారిన్‌కు వెళ్లి చదువుకోవాలని కలల కంటారు. వారిని అక్కడికి పంపించేందుకు ఎంతటి కష్టాన్నైనా భరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ ఇంటా చూసినా తమ పిల్లలు విదేశాల్లో ఉన్నాడని చెప్పుకునేందుకు ప్రేస్టేజీగా ఫీలవుతున్నారు. అందుకే రోజురోజుకూ ఫారిన్ చదువులకు క్రేజ్ పెరుగుతున్నది. ఏటా రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య వేలల్లో కనిపిస్తున్నది. విద్యార్థులు తొలి ప్రాధాన్యంగా అమెరికానే ఎంచుకుంటున్నారు. ఆ తరువాత కెనడా, చైనా, రష్యాలకు పయనం అవుతున్నారు. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 13 లక్షలు దాటిందంటే డిమాండ్ ఏ స్థాయిలో పెరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. 2023లో 13,18,955గా ఉన్న సంఖ్య.. 2024 నాటికి 13,35,878కి చేరింది. ఈ గణాంకాలను ఇటీవల కేంద్రమే రాజ్యసభలో వెల్లడించింది. - శ్రీనివాస్, బొల్లబత్తిని

రష్యా, ఉక్రెయిన్‌కు తగ్గిన ప్రయాణాలు

ఈ ఏడాది రష్యా, కెనడా వంటి కొన్ని దేశాలకు వెళ్లేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం విద్యార్థుల రాకపై పడింది. రష్యాలో 2023లో 25,278 మంది ఉండగా.. ఇప్పుడు అక్కడి విద్యార్థుల సంఖ్య 24,949గా ఉంది. అక్కడికి విద్యార్థులు వెళ్లక పోగా.. ఉన్న వారిలో నుంచి కూడా కొంత మంది ఇతర దేశాలకు షిఫ్ట్ అయ్యారు. ఇక ఉక్రెయిన్‌లో 2023లో 11,987 ఉండగా.. 2024కు వచ్చేసరికి ఆ సంఖ్య 2,510కి పడిపోయింది.

కరోనా టైములో తగ్గిన సంఖ్య

వైద్య విద్యకు ప్రసిద్ధి చైనా. భారతీయ విద్యార్థులు ఎక్కువగా అక్కడ వైద్య విద్యను చదివేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే.. కరోనా అక్కడే పుట్టడంతో ఆ సమయంలో ఆ దేశం నుంచి చాలా మంది విద్యార్థులు వలస వెళ్లారు. ఇప్పటికి కూడా వెళ్లేందుకు చాలా మంది సాహసించడం లేదు. మహమ్మారి ముందు సంవత్సరాలతో పోల్చినప్పుడు సంఖ్య గణనీయంగా తగ్గింది. 2019లో చైనాలో మొత్తం 15,207 విద్యార్థులు ఉన్నారు. కోవిడ్ -19 వైరస్ ప్రపంచాన్ని శాసిస్తున్న సమయంలో ఆ సంఖ్య అకస్మాత్తుగా 2,950కి పడిపోయింది. 2021లో 11,636కి పెరిగి, 2022లో మరోసారి 3,213కి తగ్గింది. మహమ్మారి బాధ ముగిసినప్పటి నుండి, భారతీయ విద్యార్థుల మార్కెట్ ఇప్పుడిప్పుడు పెరుగుతున్నది. 2023లో 7,858, 2024లో 8,580గా నమోదైంది.

కొవిడ్‌ తర్వాత పెరుగుతున్న విద్యార్థులు

విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య కరోనాకు తరువాత సంవత్సరం నుంచి పెరుగుతూ వస్తోంది. ఈ సంఖ్య 2019లో 6,75,541 ఉండగా, 2020లో 6,85,097కి పెరిగింది, ఆ తర్వాత 2021లో 11,58,702కి చేరింది. 2022లో 9,07,404కి తగ్గింది. అయితే.. ఈ సంఖ్య 2023లో 13,18,955కి పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 8,73,955కి పెరిగారు. ఇక దేశాల వారీగా చూస్తే కెనడాలో 4,27,000, అమెరికాలో 3,37,630, ఆస్ట్రేలియాలో 1,22,202, యూకేలో 1,85,000 డిగ్రీ, ఆపై చదువులు చదువుతున్నారు. ఎక్కువ మంది ఈ దేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సహకారం

విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక చేయూతనిస్తున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విదేశీ పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నది. ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ పథకం వెన్నుదన్నుగా ఇలాంటి వారికి అండగా నిలుస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బ్రాహ్మణ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు అవకాశం కల్పిస్తున్నది. బీసీల కోసం జ్యోతిబాఫూలే, ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్‌, మైనార్టీలకు సీఎం ఓవర్సీస్‌, బ్రాహ్మణ విద్యార్థులకు వివేకానంద విదేశీ విద్యానిధి పథకాలను అమలు చేస్తున్నది. అన్ని కేటగిరీల్లో కలుపుకొని ఈ పథకం ద్వారా గతేడాది వరకు 6,701 మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువు పూర్తి చేసుకోగా, ప్రభుత్వం రూ.947.8 కోట్లు వెచ్చించింది. విదేశాల్లో మాస్టర్స్‌, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల అభ్యాసానికి ప్రభుత్వం ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తుండగా.. జనవరిలో (స్ప్రింగ్‌ సీజన్‌) 150 మంది, ఆగస్టులో (ఫాల్‌ సీజన్‌) 150 మందికి మొత్తంగా రెండు సెషన్లకు కలిపి ఒక్కో కేటగిరీకి 300 మంది నిరుపేద విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌, జర్మనీ, న్యూజిలాండ్‌, జపాన్‌, ఫ్రాన్స్‌, దక్షిణ కొరియా దేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.20 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నది. వీసా చార్జీలు, ఇతర ఖర్చుల కోసం రూ.50 వేలు ఇస్తున్నారు.

ఇవీ అర్హతలు

- తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించరాదు.

- 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి ఉండాలి.

- జీమ్యాట్‌ 500, టోఫెల్‌ 60, ఐలెట్స్‌ 6.0, జీఆర్‌ఈ 260, పీటీఈ 50 కనీస మార్కులు సాధించాలి.

- విద్యార్థి వయస్సు 35 ఏండ్లు దాటరాదు.

- నిర్దేశిత దేశంలోని యూనివర్సిటీ లేదా విద్యాసంస్థలో అడ్మిషన్‌ పొంది ఉండాలి.

- ఒక కుటుంబం నుంచి ఒకరికే అవకాశం.

ఎంపిక ఇలా

అకడమిక్‌ మార్కులకు 60 శాతం, జీమ్యాట్‌/జీఆర్‌ఈ 20 శాతం, టోఫెల్‌, ఐలెట్స్‌, పీటీఈ పరీక్షల్లో వచ్చిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. తొలుత వచ్చిన దరఖాస్తుల్లో నుంచి మెరిట్‌ జాబితాను రూపొందిస్తారు. అనంతరం ఆ జాబితాను సంబంధిత విభాగం అధికారులతోపాటు, హయ్యర్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, జేఎన్టీయూకు చెందిన సభ్యులతో ఏర్పాటైన స్టేట్‌ లెవల్‌ స్క్రీనింగ్‌ కమిటీకి పంపుతారు.

కమిటీ మెరిట్‌ జాబితాపై చర్చించి అర్హులను నిర్ణయిస్తుంది.

ఎస్సీ విద్యార్థుల దరఖాస్తులకు షెడ్యూల్ రిలీజ్

అయితే.. ఈ విదేశీ విద్యానిధి కోసం ఆగస్టు 14 నుంచి దరఖాస్తుల స్వీకరణ సైతం ప్రారంభమైంది. 14వ తేదీ నుంచి ఎస్సీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అక్టోబరు 13వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్‌ విదేశీ విద్యానిధి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చని వివరించింది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధులకు గరిష్టంగా 20లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తారు.

కావాల్సిన పత్రాలివే..

కుల ధ్రువీకరణ పత్రం

ఆదాయపత్రం(ఇన్ కామ్ సర్టిఫికెట్)

పుట్టిన తేదీ ధ్రువపత్రం

ఆధార్ కార్డు

ఈ- పాస్ ఐడీ నెంబర్

ఇంటి నెంబర్ వివరాలు

పాస్ పోర్టు కాపీ

పది, ఇంటర్, డిగ్రీ, పీజీ మార్కుల మెమోలు

GRE /GMAT స్కోర్ కార్డు

TOFEL / IELTS స్కోర్ కార్డు

అడ్మిషన్ ఆఫర్ లెటర్ (ఫారెన్ యూనివర్సిటీ నుంచి)

బ్యాంక్ వివరాలు అండ్ ఫొటో

వివిధ దేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థుల వివరాలు




Advertisement

Next Story

Most Viewed