- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నవరత్నాలు కాదు... నవమోసాలు!
వంద తప్పులు చేసిన వాడినైనా నమ్ముతారేమో. కానీ 'ఒక్క చాన్సు' అని మోసం చేసినవాడిని ప్రజలు నమ్మరు. మోసం చేసే బుద్ధి వున్నవారు మోసం చేస్తూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అంటూ ఆవిష్కరించిన సుందర స్వప్నం ఆవిరైంది. ఎనలేని మేళ్లు చేస్తాయి అంటూ తెరకెక్కించిన నవరత్నాలు నవమోసాలుగా మిగిలిపోయాయి. ఇది సీఎం చెబుతున్నట్లు చరిత్ర ఎరుగని సంక్షేమం కాదు. చరిత్ర ఎరుగని మోసం. ప్రజలు తమ పరిపాలన ప్రజలు గుర్తు పెట్టుకోవాలి అంటే ప్రజలకు మేలుచేసే సుపరిపాలన అందించాలి. కానీ జగన్ ప్రభుత్వం నాలుగేళ్లుగా చేసిన నాలుగు మంచి పనులు ప్రజలకు చెప్పుకోవడానికి ఏమి లేక ఊరు, వాడా రంగులు, పోస్టర్లు, పొలాల్లో సర్వే రాళ్ళపైనా, సెల్ ఫోన్లు పైనా స్టిక్కర్లు అంటిస్తూ, పార్టీ రంగులు పులిమి ఇదే మా నాలుగేళ్ల అభివృద్ధి అని ఊదరగొడుతున్నారు. తన ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధపడ్డారన్న విషయం జగన్ ప్రభుత్వానికి అర్ధమై మరోసారి మోసం చేసేందుకు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ ఈ సారి జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు.
అర్థమైన సంక్షేమ పథకాల లోగుట్టు
నిజానికి పాలన నచ్చి ప్రజలు మెచ్చి మా నమ్మకం నువ్వే అనాలి కానీ, జగన్ రెడ్డే నన్ను నమ్మండంటూ ప్రజలను ప్రాధేయపడటంతో ఆయన డొల్లతనం బయటపడింది. ఆ మధ్య రంగుల పిచ్చితో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఫోటోల, స్టిక్కర్ల పిచ్చి పతాక స్థాయికి చేరి. పాసు పుస్తకాలపై, యాడ్స్, బ్యానర్లు, పోస్టర్లు, మరుగుదొడ్లు. చెత్తబండ్లు, ఇండ్లు ఇలా దేనిని వదలకుండా జగన్ బొమ్మలు అతికిస్తున్నారు. ఇలా ఇళ్లపై స్టిక్కర్లు వేస్తూ తమ వికారాన్ని ప్రజలకు చూపిస్తున్నా ప్రభుత్వంపై లబ్దిదారులు అగౌరవంగా భావిస్తున్నారు. లబ్ధిదారుల నిస్సహాయత, అసక్తత, ఆర్థిక అవసరాలు లాంటి బలహీనతలను బహిర్గతం చేసి వారిని బజారుకీడిస్తున్నారని వాపోతున్నారు. గతంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల సొమ్మును పార్టీ ప్రచారానికి ఇంతలా వృధాచేయలేదు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వంచనాత్మకమైనవే. గత ప్రభుత్వాలు అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలను రద్దుచేసి తన పేరు, తన తండ్రి పేరు మీద కొత్త పథకాలను అమలుచేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
ఇన్నాళ్లు ప్రజలకు ఈ విషయం అర్థం కాక జగన్ మాయలో పడ్డారు. కానీ జగన్ సంక్షేమ పధకాల లోగుట్టు ప్రజలకు ఇప్పుడు అర్ధమయింది. సంక్షేమం పేరిట జగన్ రెడ్డి చేస్తున్న మోసం ఏమిటో పరిశీలిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి స్వయం ఉపాధి కింద ఆర్థిక సహాయం అందించడం కోసం రాజ్యాంగబద్ధంగా వివిధ కార్పొరేషన్లు ఏర్పాటు అయ్యాయి. ఆ కార్పొరేషన్లకు బడ్జెట్‌లో నిధులు కేటాయించబడతాయి. కేంద్రప్రభుత్వం నుంచి సబ్సిడీ కింద సహాయం వస్తుంది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్పొరేషన్లకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల నుంచి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. పైగా కార్పొరేషన్ల కింద వున్న మొత్తం నిధులను నవరత్నాల అమలుకు బదిలీ చేసారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు రుణసహాయం నిలిచిపోయింది. చట్టబద్ధంగా ఏర్పాటైన కార్పొరేషన్లు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం అరకోరే తప్ప ఏ పథకం కడుపు నింపేదికాదు. అవసరం తీర్చేది కాదు. ప్రజలకు వెండిగిన్నే చూపించి అధికారంలోకి వచ్చాక ప్రజల ముందు వెలితి గిన్నెపెట్టారు.
సంక్షోభంలో సంక్షేమం
ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడంలో చతికిలపడింది. సంకల్పం కొరవడి సంక్షేమం సంక్షోభంలో పడింది. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల వెనుక వున్న వ్యూహం అంతా జనాకర్షక మంత్రమే తప్పా పేదల అభ్యున్నతికి దోహదపడేవి కాదు. బడుగు బలహీన వర్గాలకు జగన్ ప్రభుత్వం చేసేది గోరంత, చెప్పేది కొండంత. పథకాలు మస్తు, పేదలు పస్తు. పాత పథకాలకు కొత్త రంగులు అద్ది మభ్యపెడుతున్నారు. ఉదాహరణకి అమ్మఒడి పథకంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్నది. కానీ దాని అమలు తీరు చూస్తే ఆ పథకంపై జగన్ సర్కారుది అంతా ఆర్భాటమేనని అర్ధం అవుతుంది. అమ్మఒడితో బడి ప్రవేశాలు నిజంగానే పెరిగితే ఏటా ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య పెరగాల్సింది పోయి ఎందుకు తగ్గిపోతోంది? ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్ల సంఖ్య పెరిగితే పథకం అందుకొనే వారి సంఖ్య కూడా పెరగాలి. అమ్మఒడికి ఆంక్షలు విధించి అంటకత్తెర వేశారు. అమ్మఒడి ద్వారా ఇవ్వాల్సింది 82 లక్షల మందికి. ఇస్తున్నది 43 లక్షలమందికి. ఇస్తానన్నది రూ.15 వేలు. ఇస్తున్నది రూ 13 వేలు. ఆంక్షల పేరుతో విద్యార్థుల హాజరు 75 శాతం ఉండాలి. 300 యూనిట్లు కన్నా తక్కువ విద్యుత్తు వాడాలి, కొత్తరేషన్ కార్డు ఉండాలి. రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్‌తో లింక్ ఉండాలి. ఆధార్ కార్డులో కొత్త జిల్లా పేరు ఉండాలి. ఇలా అడ్డమైన ఆంక్షలు విధించి అమ్మఒడి పధకానికి అంటకత్తెర వేశారు. గతంలో ఇచ్చిన లబ్ధిదారులకు భారీగా కోతపెట్టినట్లే, సుమారు 6.78 లక్షల మంది పాత వాళ్లకు ఎగ్గొట్టి కొత్తవాళ్లకు మంజూరుచేశారు. అమ్మఒడి పథకంలో ఎక్కువ మంది లబ్ధిదారులకు సాయం చేస్తున్నట్లు చూపించుకునేందుకు ప్రభుత్వం ఈ పన్నాగం పన్నింది. మరి మొదటి ఏడాదిలో అమ్మఒడి పొందిన లబ్ధిదారులు తర్వాత ఏడాది అనర్హులు ఎలా అవుతారు. ఏటా 43 లక్షల మందికి మాత్రమే అమ్మఒడి మంజూరు చేసిన ప్రభుత్వం 82 లక్షల మంది లబ్ధి పొందుతున్నారని ప్రకటించడం మోసం కాదా? అమ్మఒడి కింద ఇవ్వాల్సిన డబ్బులు ఒక ఏడాది నిలిపివేసి రూ 6 వేలకోట్లు మిగుల్చుకొన్నారు .75 శాతం హాజరు లేదని 50 వేలమందికి అమ్మఒడి ఎగ్గొట్టారనేది నిజం కాదా?
ముస్లింలకు చేసిందేంటి?
2019 ఎన్నికల ముందు ముస్లింలను చంద్రబాబు మోసం చేశారంటూ జగన్ చేసిన విమర్శలకు లెక్కలేదు. వారికి సంక్షేమ, అభివృద్ధి పథకాలకు దూరం చేశారని చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపుతానని, తన తండ్రి ముస్లింలకు కల్పించిన పథకాలను గుర్తుచేసి ముస్లిం ఓట్లను దండుకొన్నారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ నవరత్నాల్లో చూసుకోవాలంటూ మైనారిటీలకు చెందాల్సిన పలు పథకాలకు మంగళం పాడారు. ముస్లిం యువతులకు గత ప్రభుత్వం ఇచ్చిన రూ.50 వేల సాయాన్ని లక్షకు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇవ్వకుండా మోసం చేశారు. నిధుల్లేక ‘దుల్హన్’ పథకం నిలిపివేశామని హైకోర్టుకు వైసీపీ ప్రభుత్వం చెప్పడాన్ని చూస్తే ముస్లింలను జగన్ ఏ విధంగా మోసంచేశారో అర్థం అవుతుంది. తన మేనిపెష్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పుకొని జనాన్ని బులిపించి అధికారంలోకి వచ్చిన జగన్, తాను చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోకే దిక్కులేకుండా పోయింది. ముస్లిం వర్గాలకు చంద్రబాబు ప్రభుత్వం అందించిన దుల్హన్ పథకం ఎంతో ప్రయోజనం కలిగించింది. పెళ్లి ఖర్చు మొత్తంగా కుటుంబంపైనే పడకుండా తీసుకువచ్చిన పథకమిది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లకు రూ.50 వేల ఆర్థిక సాయం అందేది. చంద్రన్న పెళ్లికానుక పేరుతో అన్ని సామాజివర్గాలకు సంబంధించిన పెళ్లికానుకలు, కులాంతర వివాహాల పారితోషికంతో కలిపి సమగ్ర పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అన్ని పెళ్లికానుక పథకాలకు పంగనామాలు పెట్టింది. కులాంతర వివాహాలు చేసుకుంటున్న వర్గాలకు ఇస్తున్న పారితోషికం కూడా ఇవ్వకుండా నిలిపేసింది.
పాదయాత్రలో 43 లక్షల మంది మైనారిటీలకు జగన్ ఎన్నో ఆశలు పెట్టి అధికారంలోకి రాగానే అన్నిటికి నీళ్ళు వదిలారు. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ వర్గాల్లో ఎక్కువ మంది పేదరికంలో మగ్గుతున్నారు. ముఖ్యంగా ముస్లిమ్‌ల్లో ఎక్కువ మంది పట్టణాల్లో, మండల కేంద్రాల్లో వెల్డింగ్ , మెకానికల్ షాపులు, పాత ఇనప సామానులు, చిన్న చిన్న స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏటా 10 వేల మంది ముస్లిం, క్రిస్టియన్ యువత ఆయా ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుచేసుకున్నారు. దుకాన్, మకాన్ పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏటా వెయ్యి మంది ముస్లిం యువతకు నివాసం, దుకాణం రెండూ. నిర్మించుకునేందుకు ఆర్థికసాయం అందింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నవరత్నాలు ఇస్తున్నందున మళ్లీ స్వయం ఉపాధి యూనిట్లు ఎందుకని అన్నింటిని నిలిపివేసింది. గత ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ పండగ రోజున రంజాన్ తోఫా అందించేది. పండగ రోజు ముస్లిం కుటుంబాలు పేద, ధనిక తేడాల్లేకుండా సంతోషంగా గడపాలనే తలంపుతో ప్రతి ఇంటికీ సరుకులను ఉచితంగా పంపిణీ చేసేవారు. ఏటా దాదాపు 10 లక్షల కుటుంబాలు రంజాన్‌తోఫాను అందుకునేవారు. కానీ జగన్ ప్రభుత్వం ఆ తోఫాకు తూట్లు పొడిచింది. తాము అధికారంలోకి వస్తే ఇస్లాం బ్యాంకు ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే లేదు. ఉన్న స్వయం ఉపాధి పథకాలకూ స్వస్తి చెప్పారు.
ఎన్నో ఏళ్లుగా ఎస్సీలకు, ఎస్టీలకు అమలవుతున్న 28 పధకాలను రద్దు చేసి వారిని దగా చేసారు. అదనంగా వారికి ఏమీ ఇవ్వకుండా అందరికి ఇస్తున్న నవరత్న పథకాలనే ఎస్సీలకు, ఎస్టీలకు వర్తింపచేస్తూ లక్షకోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపిస్తూ వారిని మోసం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎస్సీలు, 18 శాతం, ఎస్టీలు 7.5 శాతం వున్నారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద కేటాయించే నిధులు ఆ వర్గాల వారికి అభివృద్ధికి వినియోగించాలి. ఈ వర్గాలు అధికంగా వున్న కాలనీలు, తండాల్లో రహదారులు, రోడ్లు, త్రాగునీరు వంటి అభివృద్ధి పనులు చేపట్టాలి. యువతకు పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించాలి. గత ప్రభుత్వాలు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ పేరుతో 30 శాతం నిధులు వినియోగించేవారు. కానీ జగన్ ప్రభుత్వం అందుకు భిన్నంగా ఉపప్రణాళిక నిధులను నవరత్నాల్లో భాగం చేసింది. అందరికీ ఇచ్చే ఉపకారవేతనాలు, పింఛన్లు ఉపప్రణాళికగా చూపిస్తూ మోసం చేస్తున్నారు. కేంద్రం రాజ్యాంగపరంగా గిరిజనులకు కేటాయించిన నిధులను దారిమళ్లించారు. ఏది ఏమైనా జగన్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగాలేరు. ఆంధ్రులు మరోసారి జగన్ ను నమ్మరు
నీరుకొండ ప్రసాద్
98496 25610