కాలినడకన ఆరు టైం జోన్లు, అన్ని బుతువులను ఆస్వాదించే ప్రపంచ రూట్ గురించి తెలుసా?

by Ravi |   ( Updated:2022-12-02 19:01:08.0  )
కాలినడకన ఆరు టైం జోన్లు, అన్ని బుతువులను ఆస్వాదించే ప్రపంచ రూట్ గురించి తెలుసా?
X

సువిశాల ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయన్నది నిర్వివాదాంశం. కొన్ని తెలియని విషయాల గురించి తెలుసుకున్నప్పుడు మనం విస్తుపోవడం సర్వసాధారణం. విదేశీ ప్రయాణం అనగానే మనకు చటుక్కున గుర్తుకు వచ్చేది విమాన ప్రయాణమే. అయితే, ప్రపంచంలోని 17 దేశాలను కాలినడకన చుట్టిరావచ్చన్న విషయం మనలో ఎందరికి తెలుసు ! అవును, బ్రిలియంట్ మ్యాప్స్ అంచనా ప్రకారం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ నుంచి రష్యాలోని మగడన్ వరకు 22,387 కిలోమీటర్లు లేదా 13,911 మైళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని నిరవధికంగా కాలినడకన ప్రారంభిస్తే 4,492 గంటలు లేదా 187 రోజులు పడుతుంది. అలాకాక వారాంతపు సెలవు లేకుండా రోజూ ఎనిమిది గంటలు మాత్రమే నడిస్తే 562 రోజులలో 17 దేశాల మీదుగా ఆరు టైం జోన్లు, అన్ని ఋతువులను ఆస్వాదిస్తూ కాలినడకన చుట్టి రావచ్చు.

ఈ దారిలో ప్రయాణించడానికి బస్సు, రైలు లేదా విమానం కానీ అవసరం లేదు. అందుకు కావాల్సిందల్లా పిక్క బలం. ఈ ప్రయాణం చేయాలన్న సంకల్పంతో కూడిన మొక్కవోని ఆత్మవిశ్వాసం. ఒకవేళ మీరు ఆఫ్రికా అడవులు, సూయజ్ కెనాల్, టర్కీ, మధ్య ఆసియా, సైబీరియా మీదుగా మగడన్ వరకు 562 రోజుల సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకునే ఔత్సాహికులైతే, ఈ ప్రయాణంలో మీరు వీక్షించగలిగే వివిధ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఈ అద్భుత ప్రయాణాన్ని మీరు ఉత్సాహంతో సన్నాహక షికారుగా మొదట దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లోని టేబుల్ మౌంటెన్ నేషనల్ పార్క్ నుండి ప్రారంభించవచ్చు.

టేబుల్ మౌంటెన్ నేషనల్ పార్క్

కేప్‌టౌన్‌లోని సుందర మనోహర దృశ్యాలతో పాటు దక్షిణ తీరప్రాంతపు అందాలను తిలకిస్తూ ఈ కొండపైకి దాదాపు రెండు నుంచి మూడు గంటలలో చేరుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే 'కేబుల్ కార్' (cable car) పర్యాటకులు తమ అనుభూతులను ఫొటోల రూపంలో బంధించేలా చేస్తుంది. దక్షిణాఫ్రికాలోనే అత్యధికంగా దేశ, విదేశీ పర్యాటకుల తాకిడి గల ప్రదేశం ఇది(Table Mountain National Park). ఈ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన విభిన్న జాతులకు చెందిన 2,200 మొక్కలతో పాటు దాదాపు 1,470 పుష్పజాతులు పర్యాటకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. 1913లో కనుమ తూర్పు దిగువ ప్రాంతంలో 1300 ఎకరాలలో ప్రారంభించబడిన క్రిస్టెన్ బోష్ బొటానికల్ గార్డెన్స్‌లో(Kristen Bosch Botanical Gardens) ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మొక్కలు సందర్శకుల మది దోచుకుంటాయి. ఈ ప్రాంతంలోని జీవ వైవిధ్యం (biodiversity) ప్రపంచంలో మరెక్కడా లేకపోవడం ఇక్కడి విశిష్టత. ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నందున ఇది కొత్తగా ప్రకటించిన ప్రపంచంలోని ఏడు వింతలలో స్థానం దక్కించుకుంది.

బోట్స్‌వానా సఫారీ టూర్

బోట్స్‌వానా సఫారీ టూర్‌(Botswana Safari Tour) లో భాగంగా ప్రఖ్యాత ఛోబే నేషనల్ పార్క్(Chobe National Park), ఒకవాంగో డెల్టాలలో అధిక సంఖ్యలో ఆఫ్రికా జాతి ఏనుగులు, సింహాలు, జిరాఫీలు, అడవి దున్నలు, కంచర గాడిదలను చూడవచ్చు. మొదటి ఆరు వారాల కాలి నడక ద్వారా ఏర్పడిన బడలిక నుంచి బోట్స్‌వానాలో ప్రత్యేకంగా విలాసవంతమైన చెక్క లాడ్జీలు, స్పా రిసార్టులను సందర్శించి సేదదీరవచ్చు.

జాంబియాలోని విక్టోరియా ఫాల్స్

జంబేజి నదిపై జాంబియా, జింబాబ్వే దేశాల సరిహద్దులో 1,708 మీటర్ల వెడల్పుతో ఉండే 'విక్టోరియా ఫాల్స్'(Victoria Falls) జలపాతం ప్రపంచంలోనే అతి పెద్దది. ఈ జలపాతం వెడల్పు లేదా ఎత్తులో పెద్దది కాకపోయినప్పటికీ, ప్రవాహం, భారీ తెరలాగా కిందికి దుమికే నీటి కొలతల ప్రామాణికత ఆధారంగా ప్రపంచంలోని అతిపెద్ద జలపాతంగా పరిగణించబడుతుంది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఇక్కడి కొలనులలో సందర్శకులు ఈత కొట్టడానికి అనువైనవైనప్పటికీ, ప్రమాదకరమే. బోట్స్‌వానాలోని గాబరోన్ నుండి విక్టోరియా ఫాల్స్ కు 22 రోజులలో చేరుకోవచ్చు.

ఈజిప్ట్ లోని ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా

ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన ఈజిప్ట్‌లోని పిరమిడ్స్ గురించి తెలియనివారు ఉండరు. విక్టోరియా ఫాల్స్ నుంచి 181 రోజులు అంటే ఆరు నెలల పాటు సుదీర్ఘ ప్రయాణం తరువాత ఈజిప్ట్ లోని పిరమిడ్స్ ను చేరుకోవచ్చు. గ్రహాంతర వాసులు నిర్మించారా లేదా అసంఖ్యాకులైన బానిస కార్మికులు నిర్మించారా అన్న విషయాన్ని పక్కనబెడితే గణిత శాస్త్రపు వింతైన ఈ పిరమిడ్స్ గురించి మాటలలో వర్ణించడం మహా దుర్లభం. ప్రపంచపు వింతలలో అరుదైన 'ది గ్రేట్ పిరమిడ్ అఫ్ గీజా'(Great Pyramid of Giza) ను ప్రతి వ్యక్తి జీవిత కాలంలో ఒక్క సారైనా చూసి తీరాల్సిందే.

పెట్రా, జోర్డాన్

'ది గ్రేట్ పిరమిడ్ అఫ్ గీజా'(Great Pyramid of Giza) నుంచి జోర్డాన్‌కు దక్షిణాన ఉన్న పెట్రాకి రెండు వారాలలో చేరుకోవచ్చు. ఇక్కడ క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దానికి చెందినదిగా భావించే అద్భుత పురావస్తు కట్టడం 'అల్ ఖజ్ని' ఆలయం ఉంది. 140 అడుగుల ఎత్తు, 90 అడుగుల వెడల్పుతో ఎరుపు రెండు అంతస్తులలో గులాబీ రంగులో ఉండే రాతిపై గ్రీకు నాగరికతకు అద్దం పడుతూ అద్వితీయమైన కళానైపుణ్యంతో తీర్చిదిద్దిన ఈ కళాఖండాన్ని 'అల్ ఖజ్ని ట్రెజర్ హౌస్' అని కూడా పిలుస్తారు. ఈ వినూత్న ధనాగారం నిర్మాణం వెనుక గల అసలు కారణం తెలియనప్పటికీ, కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు ఇది ఒక ఆలయమని అభిప్రాయపడ్డారు. దస్తావేజులు భద్రపరచడానికి ఏర్పాటు చేయబడిన భవనం అన్నది మరి కొందరి అభిప్రాయం. ఇటీవలి తవ్వకాలలో ఈ కట్టడం అడుగున ఒక స్మశానం బయట పడింది. నాబాటియన్ రాజు (ఆరేటాస్-4) సమాధిగా కూడా భావించే ఈ పురావస్తు కట్టడం జోర్డాన్ లోని ప్రఖ్యాత దర్శనీయ ప్రాంతాలలో ఒకటి.

లేక్ వ్యాన్, టర్కీ

టర్కీ తూర్పు భాగాన వ్యాన్, బిట్లిస్ ఆర్మేనియన్ హైల్యాండ్స్ లో ఉండే 'లేక్ వ్యాన్' (Lake Van) టర్కీలోని అతిపెద్ద సరస్సు. అనేక పరిసర పర్వత శ్రేణుల నుండి దిగువకు వచ్చే నీరు ఈ ఉప్పునీటి సరస్సులో చేరుతుంది. ఈ అరుదైన, సహజసిద్ధ సరస్సు ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఇక్కడి హోటళ్ల లో ప్రశాంతంగా విశ్రాంతి పొందుతూ ఆర్మీనియన్ సామ్రాజ్య చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. ఈ సరస్సులో ప్లిసియోసార్ లాంటి సరీసృపం 'లేక్ వ్యాన్ మాన్‌స్టర్ (Lake Van Monster) కనిపించినట్లు పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ జీవశాస్త్రవేత్తలు మాత్రం వీటిని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని, అంతా అభూతకల్పనలు అని అంటారు. ఇది మొట్టమొదటగా 1889లో ఆ తరువాత 1995, 1997 కనిపించాయంటారు.

టిబిలీసి, జార్జియా

జార్జియా దేశపు రాజధాని అయిన టిబిలీసి(tbilisi) వెనుక పర్షియా, రష్యా పాలకుల చరిత్ర ఉంది. గుండ్రని ఆకారంలో గులక రాళ్ల కంటే పెద్దవి, గుండురాళ్ల కంటే చిన్న పరిమాణంలో సహజసిద్ధంగా లభించే రాళ్లతో నిర్మితమైన ప్రాచీన చర్చ్‌లు, ఎరుపు రంగు పైకప్పుతో ఉండే ఇళ్లు వినూత్న నిర్మాణ శైలి తో అధునాతనంగా అలంకరింపబడిన భవంతులతో సందర్శకులకు అనిర్వచనీయ అనుభూతి కలిగిస్తాయి. నాలుగవ శతాబ్దానికి చెందిన చారిత్రాత్మక కోట 'నరికల' ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ. వైవిధ్యమైన ఈ నగర పర్యటన అనంతరం ఆహ్లాదాన్ని మూటగట్టుకుని చివరి మజిలీ అయిన రష్యాకు చేరుకోవలసి ఉంటుంది.

రష్యా

పర్యటనలో రష్యా చివరి మజిలీ అయినప్పటికీ ఈ సువిశాల దేశంలో సుదీర్ఘ ప్రయాణం చేయక తప్పదు. ఈ దేశంలోని ఈశాన్య ప్రాంతానికి వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోతూ ఉండడాన్ని గమనించవచ్చు. అక్కడి శీతల వాతావరణానికి పచ్చదనం కనుమరుగవడాన్ని, పొడిబారిన నేలలను గమనించవచ్చు. నగరాలు, గ్రామాల మధ్య దూరం కూడా ఎక్కువగా ఉండి విశ్రాంతి తీసుకోవడానికి కొంత ఇబ్బంది కూడా ఏర్పడుతుంది. ఎనిమిదిన్నర నెలలు లేదా 253 రోజులు రష్యా పర్యటనలో భాగంగా అక్కడి ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, విచిత్ర, వైవిధ్యపు అలవాట్లు తదితరాలను వోడ్కా సేవనాన్ని ఆస్వాదిస్తూ అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. సాదాసీదాగా జీవితం ప్రతి ఒక్కరు గడిపేస్తారు. జీవితంలోని ప్రతి క్షణాన్ని తమకు నచ్చిన విధంగా ఆస్వాదిస్తూ బ్రతకాలని చాలా తక్కువ మంది భావిస్తారు. అలాంటి ఔత్సాహికులు మీరైతే, పిక్కబలం, ఆత్మవిశ్వాసం కలిగి జీవిత కాలపు వినూత్నమైన అనుభూతిని సొంతం చేసుకోవాలనే సంకల్పం మీదైతే మరింకెందుకు ఆలస్యం 'ధైర్యే సాహసే లక్ష్మీ' అంటూ సమాయత్తమవ్వండి మరి !

Also read: గురుత్వాకర్షణ పని చేయని ప్రదేశాలు ఇవే


యేచన్ చంద్రశేఖర్

హైదరాబాద్

88850 50822

Advertisement

Next Story

Most Viewed