హోమియో వైద్యాన్ని ఆదరిద్దాం!

by Ravi |   ( Updated:2024-04-10 00:16:14.0  )
హోమియో వైద్యాన్ని ఆదరిద్దాం!
X

ప్రపంచవ్యాప్తంగా అలోపతి, ఆయుర్వేద, యునానీ, యోగా, నేచురోపతి, సిద్ధ, హోమియోపతి లాంటి పలురకాలైన వైద్యవిధానాలు ప్రజారోగ్య పరిరక్షణలో బహుళ ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం అలోపతి వైద్య విధానానికి అధిక శాతం ప్రజలు మొగ్గు చూపుతున్నప్పటికీ అనాదిగా ఆచరణలో ఉన్న ఇతర వైద్య విధానాలను కూడా ప్రజలు నమ్మడం చూస్తున్నాం.

గ్రీక్‌ భాషలో ‘హోమియోపత్‌’ అనగా ‘వ్యాధులు లేదా బాధలు’ అని అర్థం. ‘లైక్‌ క్యూర్స్‌ లైక్‌’ అనబడే సూత్రాన్ని పునాదిగా చేసుకొని హోమియో చికిత్స పద్ధతులను రూపొందించిన వ్యవస్థాపకుడిగా ‘డా. క్రిస్టియన్‌ సామ్యుయేల్‌ హన్నెమన్’ కు మంచి పేరుంది. అందుకే ఆయన పుట్టిన రోజు సందర్భంగా 2005 నుంచి ప్రతి ఏట ఏప్రిల్‌ 10న ప్రపంచ దేశాలు ‘ప్రపంచ హోమియోపతి దినోత్సవం’ పాటిస్తున్నారు. ప్రపంచ హోమియోపతి దినం వేదికగా హోమియోపతి వైద్య విధాన ప్రాధాన్యాన్ని ప్రచారం చేయడం, భవిష్యత్తు హోమియోపతి సవాళ్లను ఎదుర్కోవడం, యువతను హోమియోపతి వైద్యశాస్త్రం వైపు ఆకర్షించడం, హోమియోపతి పరిశోధనలను ప్రోత్సహించడం, హోమియోపతి వైద్య విధానాలను మెరుగు పరచడం, హోమియో వైద్యుల సేవలను గుర్తించడం, హోమియో వైద్యంతో నయం అయిన రోగులను పరావర్శించడం లాంటి అంశాలను విస్తృతంగా వివరించడం చర్చించడం జరుగుతుంది.

విషానికి విషమే విరుగుడు నినాదంతో..

‘ప్రపంచ హోమియోపతి దినోత్సవం- 2024 నినాదంగా ‘హోమియో పరివార్‌ వన్‌ హెల్త్‌, వన్‌ ఫ్యామిలీ అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలిసారి ‘ఆయుష్‌ (ఆయుర్వేద, యోగా, యునానీ, సిద్ధి, హోమియోపతి)’ వైద్య మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి దాని ద్వారా హోమియోపతి విధానానికి అధిక ప్రాధాన్యాన్ని ఇవ్వడం హర్షదాయకం. హోమియో వైద్యంలో వృక్ష, జంతు, ఖనిజ సంబంధ పదార్థాలను ఎంపిక చేసుకొని అతి తక్కువ గాఢతలో (హై పొటెన్సీ) నీరు లేదా ఆల్కహాల్‌ లాంటి ద్రావణిలో కరిగించి హోమియో మందులుగా ఇవ్వడం జరుగుతుంది. ఏ పదార్థం ఎక్కువ గాఢతలో తీసుకున్నపుడు రోగ లక్షణాలు కనిపిస్తాయో అదే రకమైన పదార్థాలను అతి విలీన గాఢతల్లో ఔషధాలుగా ప్రయోగించి రోగాన్ని నయం చేయడమనే సూత్రం ఆధారంగా హోమియో వైద్య విధానం ఆచరణలోకి వచ్చింది. ‘విషానికి విషమే విరుగుడు’, ‘వేడిని తగ్గించడానికి వేడి పదార్థాలే విరుగుడు’ అనబడే విధానాన్ని ‘లైక్‌ క్యూర్స్‌ లైక్‌’ అనే నినాదంతో హోమియో చికిత్సను ఉపయోగిస్తారు.

బహుళ ప్రయోజనాలు..

రెండు శతాబ్దాలకు పైగా బహుళ ప్రచారం, ప్రజాధరణ పొందిన హోమియో చికిత్సలో ఔషధాల వాడకం ద్వారా ఎలాంటి ‘దుష్ప్రభావాలు లేదా సైడ్‌ ఎఫెక్ట్స్‌’ ఉండవు. శరీర సహజ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వైద్యం చేయబడుతుంది. రోగాన్ని నయం చేయడానికి అతి విలీన లేదా హైలీ డైల్యూటెడ్ స్థితుల్లో‌ మందులు వాడతారు. హోమియో మందులు ద్రవ బిందువులు, క్రీమ్స్‌‌, చక్కెర పూత మాత్రలు, జిగురు, సాధారణ మాత్రలు వాడతారు. దీర్ఘ కాలిక రోగాల నుంచి తీవ్ర అంటువ్యాధుల వరకు నయం చేయగల హోమియోపతి వైద్య విధానం అనాదిగా సామాన్య ప్రజల ఆదరణను పొందుతూ వస్తున్నది. అనాదిగా కొనసాగుతున్న హోమియోపతితో ఆధునిక పరిశోధన ఫలితాలను అనుసంధానం చేసి నూతన హోమియో వైద్య విధానాన్ని కనుగొన్న డా వీరేంద్ర సింగ్‌ కృషి కూడా మరువలేనిది. హోమియో విధానం ద్వారా కీళ్ళనొప్పులు, ఎలర్జీ, మైగ్రేయిన్‌, నిరాశ, రుతుస్రావ లోపాలు, దీర్ఘకాలిక రోగాలు, మందబుద్ది, ఆందోళన, తీవ్ర అంటువ్యాధులు లాంటి పలు వ్యాధుల చికిత్సలు సునాయాసంగా చేస్తారు. ప్రపంచ హోమియోపతి దినం సందర్భంగా ప్రజలందరూ అలోపతి వైద్యంలో దుష్ప్రభావాలు అధికంగా ఉండడం గమనించి హోమియో వైద్యాన్ని ఆదరించాలని కోరుకుందాం, హోమియో వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.

(నేడు ‘ప్రపంచ హోమియోపతి దినోత్సవం’ )

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

99497 00037

Advertisement

Next Story

Most Viewed