వాటిని అడ్డుపెట్టుకుని కేంద్రం గుండాగిరి చేస్తుందా?

by Ravi |   ( Updated:2022-09-03 13:25:21.0  )
వాటిని అడ్డుపెట్టుకుని కేంద్రం గుండాగిరి చేస్తుందా?
X

బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే బీజేపియేతర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో ముందుండటం ఓర్వలేకపోతున్నారు. అరాచకంతో ఒక్కొక్కటిగా నేల మట్టం చేస్తూ వస్తున్నారు. అనారోగ్య రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. అదే తరహాలో తెలంగాణలో ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టించాలనే ఉద్ధ్యేశ్యంతో దూకుడు పెంచారు. ఈడీ, సిబీఐలను జేబు సంస్థలుగా వాడుకుంటున్న బీజేపీ సుప్రీంకోర్టు జడ్జిలను సైతం లక్ష్మణ రేఖ దాటారని బెదిరింపులకు దిగుతున్నారు. తమకు అనుకూలంగా రాయని జర్నలిస్టులపై నక్సలైటు ముద్ర వేయడం, ప్రజామోదం పొందిన ప్రభుత్వాలను పడగొడతామని బెదిరించడం చూస్తే దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందేమోనన్న అనుమానం కలుగుతోంది. బీజేపీ దుర్మార్గ పాలన దేశంలో ఇంకా కొనసాగితే దశాబ్దకాలం నష్టపోతామని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట దేశమంతటా 75 యేండ్ల స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రం 'హర్‌ ఘర్‌ తిరంగా' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. దేశంలో ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగిరేలా చర్యలు చేపట్టింది. ఇంత వరకు బాగానే ఉన్నా, జాతిని చీల్చే కుట్రలను ఛేదించకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడకుండా 'కరోనా వస్తే చప్పట్లు కొట్టండి, ఆగస్ట్ 15 వస్తే ప్రొఫైల్ పిక్ మార్చండి' అంటూ అసంబద్ధ కార్యక్రమాలకు పిలుపునివ్వడం దేనికి నిదర్శనం? రాష్ట్రాల హక్కులను హరించి, అధికార దాహంతో 'సబ్ కా సాత్ సబ్ కా వికాస్' నినాదాన్ని తుంగలో తొక్కి 'సబ్ కో హాత్- విపక్ష్ కా వినాశ్' అన్నట్టుగా ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇకముందు విపక్షాలు అధికారంలో ఉండాలంటే ప్రధాని మోడీ ప్రొఫైల్ పెట్టుకునే పరిస్థితి తెస్తుందేమో? వేచి చూడాలి.

తన మాట వినని తొమ్మిది రాష్ట్రాలలో దొడ్డి దారిన అధికారం చేపట్టింది. ఇప్పుడు ఏకంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ సొంతానికి ఒక కంకర గని లీజును కేటాయించుకున్నారనే కారణం చూపి శాసన సభ్యత్వాన్ని రద్దు చేయించింది. భారత రాజ్యాంగం 102(1) (ఎ). 191(1) (ఎ) అధికరణల ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే ఎలాంటి లాభదాయక పదవులను చేపట్టరాదు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం 9వ సెక్షన్ ఈ విషయం చెబుతున్నది. రాజ్యాంగం కల్పించిన 192 అధికరణ ప్రకారం శాసనసభ్యుల అనర్హత కేసులలో గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలి. అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకొని గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. ప్రగతిపథంలో నడిచే రాష్ట్రాల కండ్లలో కేంద్రం వత్తులు కాల్చి పెడుతోంది. బీజేపీ కండువా కప్పుకోవడంతో ఈడీ నోటీసులు, సీబీఐ దాడులు 'వాషింగ్ ఫౌడర్ నిర్మా' అవుతోందని 'మేక్‌ ఇన్‌ ఇండియా' నినాదానికి తిలోదకాలు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కావాలనే గొడవలు

దక్షిణాది రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణలో శాంతియుత వాతావరణం సహించలేక నిత్యం ఏదో ఒక గొడవకు బీజేపీ కాలు దువ్వుతోంది. నిజంగానే బీజేపీకి ప్రజా క్షేత్రంలో ఉన్న బలం కూడా శూన్యం. బీజేపీకి ఉన్న బలం రాజ్యాంగబద్ధమైన సీబీఐ, ఈడీల దాడులే. ఆ బూచీ చూపి ప్రత్యర్థులను వేధించడంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాను మించినవారు వజ్రోత్సవ కాలంలో అగుపడలేదంటే అతిశయోక్తి కాదు. అధికారంలో ఉన్న విపక్ష ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తొమ్మిది ప్రభుత్వాల ఉసురు బోసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భావించే మన‌దేశంలో అప్రజాస్వామిక పద్ధతులతో, అనైతిక పొత్తులతో, బూటకపు వాగ్దానాలతో వాస్తవ దూరాలతో, నిత్యం రాజకీయ వక్రీకరణలతో 75 యేండ్ల అమృత మహోత్సవం పరిఢవిల్లుతోంది.

మెజారిటీ పేరుతో బలవంతంగా మనువాదపు విధానాలను అమలు చేస్తూ, అప్రజాస్వామిక పద్దతులను పాటిస్తూ రాజ్యాంగ బద్ధ విధానాలను అనుసరించకుండా బీజేపీ తన ఫాసిస్టు దాడులకు దిగుతోంది. భాగ‌స్వాములపట్ల విధేయత ప్రకటించకుండా సమాఖ్య స్ఫూర్తిని భంగం కల్గించి, నయానా, భయానా ఆర్ఎస్ఎస్ అజ్ఞాత ఎజెండాను బలవంతంగా అమలు చేస్తున్నది. 75 సంవత్సరాలుగా దేశం సాధించిన ప్రగతి స్ఫూర్తితో సాధించాల్సిన అభివృద్ధిని అందుకోవడానికి రాష్ట్రాలను ఇంధనంగా వాడుకోకుండా ఈర్ష్యతో తరుచూ రాష్ట్రాలతో విభేదించినంత కాలం సమానత్వం, సిరి సంపదలతో తులతూగే నవ భారతాన్ని నిర్మించలేం. బీజేపీ చేసిన బూటకపు వాగ్దానాలు కప్పి పుచ్చుకోవడానికి, విద్వేషాలను రెచ్చగొట్టి, అజ్ఞానంతో బీజేపీ నేతలు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

ప్రగతిని సహించలేక

బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే బీజేపియేతర రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధిలో ముందుండటం ఓర్వలేకపోతున్నారు. అరాచకంతో ఒక్కొక్కటిగా నేల మట్టం చేస్తూ వస్తున్నారు. అనారోగ్య రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. అదే తరహాలో తెలంగాణలో ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టించాలనే ఉద్ధ్యేశ్యంతో దూకుడు పెంచారు. ఈడీ, సిబీఐలను జేబు సంస్థలుగా వాడుకుంటున్న బీజేపీ సుప్రీంకోర్టు జడ్జిలను సైతం లక్ష్మణ రేఖ దాటారని బెదిరింపులకు దిగుతున్నారు. తమకు అనుకూలంగా రాయని జర్నలిస్టులపై నక్సలైటు ముద్ర వేయడం, ప్రజామోదం పొందిన ప్రభుత్వాలను పడగొడతామని బెదిరించడం చూస్తే దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందేమోనన్న అనుమానం కలుగుతోంది. బీజేపీ దుర్మార్గ పాలన దేశంలో ఇంకా కొనసాగితే దశాబ్దకాలం నష్టపోతామని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేసి నిన్న షిండేను తెచ్చి, నేడు జేఎంఎం శాసనసభ్యులను అంగడిలో సరుకులను కొన్నట్లు కొనే ప్రయత్నం శరవేగంగా జరుగుతోంది. ప్రతి దసరా పండుగకు రావణ‌ వధ చూసినం కానీ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విపక్ష వినాశనాన్ని కోరుకొని, ప్రజాస్వామ్యాన్ని వధ చేస్తుందనే విమర్శ వ్యాపించింది. ప్రపంచంలో ఏ జాతి కూడా తన చరిత్రను తానే మలినం చేసుకోదు. జాతిని విచ్ఛిన్నం చేసే వెకిలి, మకిలి, చిల్లర ప్రయత్నాలు ఎక్కడ వచ్చినా ఏకీకృతంగా, ఏకోన్ముఖంగా, ఏకకంఠంతో ఖండించి, వజ్రోత్సవాలు జరుపుకున్న మన దేశం సింహలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? రాజ్యాంగ సంస్థలను అడ్డు పెట్టుకొని గూండాగిరి చేస్తున్నారా? అంటూ బీజేపీపై జాతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.

డా. సంగని మల్లేశ్వర్

జర్నలిజం విభాగాధిపతి

కేయూ, వరంగల్

98662 55355

Advertisement

Next Story