- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ మేలుకుంటారా?
1857 ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో మత ప్రాతిపాదికన జరిగిన సైనిక విభజన తిరుగుబాటుకు దారి తీసింది. కాంట్రాక్ట్ రక్షణ సిబ్బంది, ఉద్యోగ భద్రత ఉన్న రక్షణ సిబ్బంది అనే తేడాలు ఉండడం వలన రక్షణ వ్యవస్థలో తలెత్తే అవాంఛనీయ ధోరణులు దేశ రక్షణకు, అంతర్గత భద్రతకు పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. వ్యయం తగ్గించుకోవడం కోసం ప్రభుత్వ సంస్థలను వదిలించుకుంటున్నారు. జాతి సంపదను, వనరులను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబెట్టారు. విధానాల రూపకల్పనలో ప్రతిపక్ష పార్టీలు వివిధ రంగాల నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. 'రాజ్యాంగ సభ ఎంతగానో శ్రమించి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతలతో, వివక్షతలతో, నిరుద్యోగంతో బాధ పడుతున్న ప్రజలు విధ్వంసం చేస్తారు' అన్నారు అంబేద్కర్. ఇప్పుడది ఆరంభమైందా?
ప్రపంచవ్యాప్తంగా సహజ వనరులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. వనరుల కొరత సమాజంలో అశాంతి సృష్టించి హింసను ప్రేరేపిస్తుంది. ఆయా దేశాలు తమ మనుగడ కోసం సహజ వనరులను పొరుగు దేశాల నుంచి కుట్రపూరితంగా లేదా బలవంతంగానైనా తీసుకునే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలోనే దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయి. నేడు అమెరికా జరుపుతున్న ప్రత్యక్ష యుద్ధాలు, చైనా, రష్యా నిర్వహిస్తున్న పరోక్ష యుద్ధాలు ఈ కోవకు చెందినవే. అలాగే మతోన్మాద ఛాందసంతో రాజ్యాలను విస్తరించుకునే శక్తులు కూడా యుద్ధాలను చేస్తున్నాయి.అయితే, మన దేశం చుట్టూ ఉన్న దక్షిణాసియా దేశాలలో చైనా, అమెరికా వివిధ ఒప్పందాలతో పాగా వేస్తున్నాయి.
ఇప్పటికే ఇవి చైనా, బర్మా, శ్రీలంకతో సహజ వాయువు వెలికితీత, రవాణా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ చర్యలు దేశ ప్రయోజనాలకు విపత్తుగా మారి ఒక అనివార్య యుద్ధానికి దారితీసే పరిస్థితులు ఏర్పడనున్నాయి. భారత్‌తో సఖ్యత లేని సరిహద్దు దేశాలు, సరిహద్దు జల వివాదాలు, ఆసియా దేశాల మధ్య చెలరేగుతున్న మతోన్మాద శక్తులు, అగ్రరాజ్యాలతోపాటు చిన్న చిన్న దేశాలు సముద్ర జలాల మీద, అంతరిక్షంలోనూ, సైబర్ సెక్యూరిటీ మీదా విపరీత పట్టును సాధించుకున్న సందర్భంలో భారతదేశం తన రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అనివార్యత ఉంది.
వాటితోనే త్రివిధ దళాలు
'సేవా పరమో ధర్మ' అని సైన్యం, 'నభా స్పర్షం దీప్తం' అనగా 'వాయుదేవుడా గగనతలంలో శత్రువులను ఓడించే శక్తినివ్వు' అని వైమానిక దళం 'శాన్‌నో వరుణ' అనగా 'సముద్ర దేవుడా, మాకు శుభమును ప్రసాదించు' అని నౌకాదళం 26 జనవరి, 1950 నుండి భారత రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గౌరవం, విధేయత, అస్తిత్వ పతాకాలు, త్రివిధ దళాలను నడిపిస్తున్నాయి. బ్రిటిష్ ఇండియాలో ప్రాథమికంగా రూపుదిద్దుకున్న త్రివిధ దళాలను స్వతంత్ర భారత పరిపాలకులు నెహ్రూ నాయకత్వంలో భారత్‌లో విలీనం చేయించారు. రక్షణ వ్యవస్థకు సొంత ప్రతిపత్తి ఉండాలని స్వయం సమృద్ధిగా ఎదగాలని దాని కోసం వందలాది శిక్షణ సంస్థలను, రక్షణ రంగ BEL, BDL, HAL, BEML, ISRO, BARC, GRSE, DRDO పరిశ్రమలను నెహ్రూ స్థాపించారు.
1971 రష్యాతో గౌరవప్రద రక్షణ మైత్రి ఒప్పందం కుదుర్చుకుని త్రివిధ దళాలను పటిష్టంగా తీర్చిదిద్దారు. భారత రక్షణ వ్యవస్థ నిర్మాణంలోనూ, పురోగతిలోనూ కనీస భాగస్వామ్యం లేని భారతీయ జనతా పార్టీ 2014 లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు తీసుకున్న చర్యలు రక్షణ వ్యవస్థ ప్రాభవాన్ని క్షీణింపజేస్తున్నాయి. 'మేక్ ఇన్ ఇండియా' నినాదం ఇచ్చి కూడా రక్షణ రంగ కాంట్రాక్టులను ప్రభుత్వ సంస్థలకు కాకుండా నాటో దేశాలకు కట్టపెడుతున్నారు. ఉపగ్రహ రాకెట్లను, హెలికాప్టర్లను, విమానాలను రూపొందించడానికి ఉన్న 'హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్' వంటి అనేక దేశీయ కంపెనీలకు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అమెరికాతో ఐదు బిలియన్ డాలర్ల ఒప్పందం, ఫ్రాన్స్, రష్యా, ఇజ్రాయిల్ దేశాలతో ఆయుధ సామాగ్రి కొనుగోలు ఒప్పందాన్ని మోడీ ప్రభుత్వం చేసుకుంది. దేశీయ కార్పొరేట్ అనిల్ అంబానీకి కొన్ని రక్షణ కాంట్రాక్ట్‌లు ఇవ్వడం వంటి అనైతిక చర్యలను మోడీ ప్రభుత్వం నిర్వహించింది.
దేశ రక్షణకు ముప్పు
భారత రక్షణ వ్యవస్థ తాత్వికతను నిర్వహించిన మహత్తర పాత్ర పట్ల అవగాహన లేని మోడీ ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో కాంట్రాక్ట్ సైనిక వ్యవస్థను తీసుకొచ్చారు. నిజానికి రక్షణ రంగంలో దీర్ఘకాలం పూర్తి సమయంతో ఉద్యోగం చేయడానికి దేశభక్తి, త్యాగ గుణం, జీవన భద్రత, హోదా, గౌరవం, పెన్షన్ వంటి అంశాలు ప్రాతిపదికగా పనిచేస్తాయి. ఇప్పటికే ఉన్న 15 సంవత్సరాల సర్వీస్, పెన్షన్ సౌకర్యం ఇక ముందు రక్షణ వ్యవస్థలో ఉండబోదు. సాంకేతిక నైపుణ్యాల అధ్యయనం అత్యుత్తమ శిక్షణ, అనుభవం ఉన్నవారే పదాతి, వైమానిక, నౌకాదళాలలో అత్యుత్తమ ప్రదర్శన ఇస్తారు. అగ్నివీరులకు ఇచ్చే ఆరు నెలల శిక్షణ, మూడున్నర సంవత్సరాలు ఉద్యోగం కాలంతో తన పరిపూర్ణ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించలేడు. పని చేసిన కాలంలో కూడా అభద్రత, భయాలతో, భావోద్వేగంతో కూడిన సామర్ధ్యాలతో పని చేయలేడు. క్రాంటాక్టు సైనిక వ్యవస్థ కలిగి ఉన్న కొన్ని మధ్య ఆసియా, ఐరోపా దేశాలలో తలెత్తిన అంతర్ యుద్ధాలలో కిరాయి సైనికులుగా మారి జనహనన యుద్ధాలలో పాల్గొన్న చరిత్ర ఉంది.
దేశ చరిత్రలో కూడా 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో మత ప్రాతిపదికన జరిగిన సైనిక విభజన తిరుగుబాటుకు దారి తీసింది. కాంట్రాక్ట్ రక్షణ సిబ్బంది, ఉద్యోగ భద్రత ఉన్న రక్షణ సిబ్బంది అనే తేడాలు ఉండడం వలన రక్షణ వ్యవస్థలో తలెత్తే అవాంఛనీయ ధోరణులు దేశ రక్షణకు, అంతర్గత భద్రతకు పెను ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది. వ్యయం తగ్గించుకోవడం కోసం ప్రభుత్వ సంస్థలను వదిలించుకుంటున్నారు. జాతి సంపదను, వనరులను విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు కారుచౌకగా కట్టబెట్టారు. విధానాల రూపకల్పనలో ప్రతిపక్ష పార్టీలు వివిధ రంగాల నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. 'రాజ్యాంగ సభ ఎంతగానో శ్రమించి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతలతో, వివక్షతలతో, నిరుద్యోగంతో బాధ పడుతున్న ప్రజలు విధ్వంసం చేస్తారు' అన్నారు అంబేద్కర్. ఇప్పుడది ఆరంభమైందా?
అస్నాల శ్రీనివాస్
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం
96522 75560