వరల్డ్ వాక్:మనకెందుకు యుద్ధాల మూల్యం?

by Ravi |   ( Updated:2022-09-03 18:35:33.0  )
వరల్డ్ వాక్:మనకెందుకు యుద్ధాల మూల్యం?
X

పెట్రోల్ ధరలు పెంచకపోతే కంపెనీలకు, భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమంటూ ఓ వర్గం మీడియాలో జోరుగా ప్రచారానికి దిగింది. అదే క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు జెట్ స్పీడును మించి పరుగులు పెడుతున్నాయి. ఇండియా ఉపయోగించే చమురులో 85 శాతం దిగుమతి చేసుకుంటున్నదే. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల ప్రజలకు భారం కాకుండా తమ పన్నులు తగ్గించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సిద్ధంగా కనిపించడం లేదు. పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ ఎప్పటికీ నెరవేరేలా కనిపించడం లేదు.

సుమారు నాలుగు వారాలుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. దీని ప్రభావం భారత ప్రజల మీద కూడా పడుతోంది. ఇప్పటికే వంట నూనెల ధరలు ఆకాశాన్నంటగా, బంగారం, పెట్రో ధరలు తారల సరసన చేరాయి. చికెన్ ధరలు పెరగడానికీ ఈ యుద్ధమే కారణమైంది. గతంలోనూ అప్ఘానిస్తాన్‌లో యుద్ధం జరిగినప్పుడు డ్రై ఫ్రూట్స్ ధరలు విపరీతంగా పెరిగాయి. గల్ఫ్ దేశాలలో యుద్ధాలు జరిగినప్పుడు క్రూడాయిల్ ధరలు పెరిగి, ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. తద్వారా రవాణా ఖర్చులు పెరిగి అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి.

ప్రస్తుత ప్రపంచీకరణ పరిస్థితులలో కేవలం యుద్ధాలే ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయా? అంటే కాదు, అనే సమాధానమే వస్తుంది. దీంట్లో ప్రభుత్వాల బాధ్యత కూడా అంతే ఉంటుంది. పాలకులకు ముందు చూపు లేకపోవడం, నిర్లక్ష్యంగా ఉండడం, పరిస్థితులను అంచనా వేయలేకపోవడంతో ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ధరలను అదుపులో ఉంచడంలో సర్కారు ప్రతిసారీ విఫలమవుతోంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంతో ముఖ్యంగా వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. లీటరు సన్ ఫ్లవర్ ఏకంగా రూ. 50 నుంచి రూ. 80 వరకు ధర పెరిగింది. దీనికి ముఖ్య కారణం దేశ అవసరాలలో ఎక్కువ భాగం సన్ ఫ్లవర్ ఆయిల్‌ను ఉక్రెయిన్, రష్యాల నుంచి దిగుమతి చేసుకోవడమే. ఈ రెండు దేశాల నుంచి నుంచి నెలకు 2 నుంచి 3 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్‌ను భారత్ దిగుమతి చేసుకుంటుంది. అంతేకాకుండా, పెట్రోల్, డీజిల్, బంగారం, వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి.

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి.సెమీ కండక్టర్‌ చిప్స్‌ తయారీలో కీలక ముడి వస్తువులుగా ఉన్న పల్లాడియం, నియాన్‌‌లను ఉక్రెయిన్‌- రష్యాలే ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. ప్రపంచ దేశాలకు ఎగుమతవుతున్న పల్లాడియంలో 44 శాతం ఒక్క రష్యా నుంచే సరఫరా అవుతుంది. ఇటు ఉక్రెయిన్‌ సైతం 70 శాతం మేర నియాన్‌ను ప్రపంచ దేశాలకు అందిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు దేశాలు యుద్ధంలో నిమగ్నం కావడం కారణంగా పల్లాడియం, నియాన్‌ ఎగుమతిపై తీవ్ర ప్రభావం పడింది. దీని వల్ల రానున్న రోజులలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు కూడా మరింతగా పెరిగే ప్రమాదముంది.

గతంలో ఆప్ఘాన్, గల్ఫ్ యుద్ధాలతో

ఆప్ఘానిస్తాన్‌లో తాలిబాన్ల యుద్ధం, గల్ఫ్ దేశాలలో వివిధ యుద్ధాల సమయంలో కూడా భారత్ లో వివిధ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. ఆఫ్ఘానిస్తాన్ లో యుద్ధం సమయంలో ఆ ప్రభావం భారత్ లోని డ్రైఫ్రూట్స్ రంగంపై పడింది. ఎండు ద్రాక్ష ఆప్ఘాన్ నుంచే భారత్‌ కు భారీ స్థాయిలో దిగుమతి అవుతుంది. వాల్‌ నట్స్, బాదం, పిస్తా, కుంకుమపువ్వు, జీలకర్ర కూడా కూడా అక్కడి నుంచి ఎక్కువ స్థాయిలో దిగుమతి అవుతాయి. యుద్ధం సమయంలో ఈ వస్తువుల ధరలపై ప్రభావం పడింది. అంతేకాకుండా తక్కువ స్థాయిలో దిగుమతి చేసుకునే దానిమ్మ, ఆపిల్, చెర్రీ, ఖర్జూరం, పుచ్చకాయ, ఇంగువ ధరలు కూడా పెరిగాయి.

ముందు చూపులేని ప్రభుత్వాలు

పెట్రోల్ ధరలు పెంచకపోతే కంపెనీలకు, భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమంటూ ఓ వర్గం మీడియాలో జోరుగా ప్రచారానికి దిగింది. అదే క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలు జెట్ స్పీడును మించి పరుగులు పెడుతున్నాయి. ఇండియా ఉపయోగించే చమురులో 85 శాతం దిగుమతి చేసుకుంటున్నదే. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల పెరుగుదల ప్రజలకు భారం కాకుండా తమ పన్నులు తగ్గించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సిద్ధంగా కనిపించడం లేదు. పెట్రోల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ ఎప్పటికీ నెరవేరేలా కనిపించడం లేదు.

అమెరికా తన చమురు నిల్వలను లూసియానా, టెక్సాస్ రాష్ట్రాలలో ఏర్పాటు చేసింది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు డిమాండ్‌కు తగ్గట్టుగా చమురు సరఫరా చేయడానికి, ధరలను అదుపులో ఉంచడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదొడుకులు, యుద్ధాలతో తలెత్తే ఇబ్బందులను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచే చర్యలు భారత ప్రభుత్వం వద్ద కనిపించడం లేదు. ధరల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో తగిన చర్యలు తీసుకోవడం లేదనేది స్పష్టంగా తెలుస్తున్నది. యుద్ధాన్ని సాకుగా చూపి నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచినా, ఎక్కడ లోపం ఉందో గుర్తించడానికి ప్రభుత్వాలు మాత్రం సిద్ధంగా లేవు. ముందు చూపులేని ప్రభుత్వాల వలన ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆ మూల్యాన్ని ఎంతో కొంత భారత దేశ ప్రజలు చెల్లించాల్సి వస్తోంది.

మహమ్మద్ ఆరిఫ్

సీనియర్ జర్నలిస్ట్

96184 00190

Advertisement

Next Story