ఇథనాల్‌ కంపెనీ దారుణాలు.. పార్టీలకూ పట్టదా?

by Ravi |   ( Updated:2023-11-24 01:00:54.0  )
ఇథనాల్‌ కంపెనీ దారుణాలు.. పార్టీలకూ పట్టదా?
X

చిత్తనూరులో జూరాల ఆర్గానిక్‌ ఫార్మ్స్‌ అండ్ ఇండస్ట్రీస్‌ వారు కొనుగోలు చేసిన భూమిలో పండ్లతోటలు పెంచుతామని, పండ్ల రసాల కంపెనీ ఏర్పాటు చేస్తామని చెబితే రైతులు, ప్రజలు నమ్మారు. అలాగే అధికార రాజకీయ ప్రతినిధులను చౌకధరకే అసైన్డ్‌ భూములు ఆక్రమిస్తుంటే ఆ కుటుంబాలే భూములను అమ్ముకుంటున్నారని అనుకున్నారు. నమ్మకం అనుమానంగా మారి రూడిపరుచుకుంటే అక్కడ ఇథనాల్‌ కంపెనీ పెడుతున్నారని తెలిసింది.

రెండేళ్లుగా ఉద్యమిస్తున్నా..

ఇథనాల్‌ ఉత్పత్తి క్రమంలో ఏం జరుగుతుందో, ఆహారధాన్యాలతో పాటు అక్కడ లిక్కర్‌ తదితర సరుకులు ఏమేమి ఉత్పత్తి చేస్తారో, ఆహారధాన్యాలతో, అందివచ్చిన కోయిల్‌సాగర్‌ నీటితో ఇథనాల్‌ ఉత్పత్తి చేస్తే ఇప్పటికే ఆహారంలో పోషక విలువలు లేక తీవ్ర అనారోగ్యాల బారినపడుతున్న పాలమూరు ప్రజలు, కృష్ణా తీర గ్రామాల ప్రజలు ఏ స్థాయిలో నష్టపోతారో చిత్తనూరు యువకమండలి రైతులు తెలుసుకున్నారు. ఆహార ధాన్యాలు సరిగా అందని దేశంలో రైతుల, కూలీల, ఇతర ప్రజల నోటికాడి ముద్ద కంపెనీకి అర్పిస్తే దేశం ఏ గతికి నెట్టపడుతుందోనని ఆందోళనపడ్డారు. ఎక్లాస్‌పూర్, జిన్నారం, పద్దీపూర్‌, కన్మనూర్‌ తదితర 54 గ్రామాల ప్రజలు నిజాలు తెలిసిన కొద్ది ఈ ఉద్యమంలో భాగమయ్యారు. కంపెనీకి వ్యతిరేకంగా రెండేండ్లుగా ఈ ఉద్యమం జరుగుతున్నది.

అయితే, శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమంపై 2023 అక్టోబర్ 22న పోలీసులు అమానుషంగా విరుచుకుపడ్డారు. నోటికి వచ్చిన దుర్భాషలాడారు. కంపెనీ చేసిన తప్పుల్లో ఏ ఒక్క తప్పు మీద కేసు నమోదు చేయని పోలీసులు తాము కంపెనీ పోలీసులుగా తేలిపోయారు. పోలీసులే కాదు... రెవెన్యూ శాఖ, వన్యప్రాణి సంరక్షణ, చెట్ల రక్షణ చూసే అటవీశాఖ కూడా, కంపెనీ భూములు ఆక్రమించినా, నెమళ్ళ వంటి జీవరాసుల ఉసురు తీసినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే చాలా సహజంగానే ప్రభుత్వం, ఎం.ఎల్‌.ఎ, అధికార పార్టీ నాయకులు కంపెనీ మనుషులుగా పనిచేశారు. ఈ కంపెనీ ఓనర్లలో ఒకడైన బండి పార్థసారథి రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ పదవి ఇచ్చింది. అలాగే మరో ఓనర్ అయిన కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రజల ప్రాణాలు బలితీసుకునే, ఆహార కొరత సృష్టించే కంపెనీలు, లిక్కర్‌ వంటి మాదక ద్రవ్యాల ఉత్పత్తికి, వ్యాపారాలకు తెగబడే వారికి రాజకీయ పదవులు అవసరమా?

కంపెనీ దుర్మార్గాలను ప్రశ్నించినందుకు..

అమాయకులుగా పడివుంటారనుకున్న రైతులు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ దుర్మార్గాలన్నింటినీ ప్రశ్నించారు. అయినా లక్ష్యపెట్టకుండా కంపెనీ నిర్మాణాన్ని ట్రయల్‌రన్‌ దాకా తెచ్చారు. ట్రయల్‌ రన్‌ సందర్భంగా మన్నెవాగులోకి వదిలిన కాలుష్యం రామన్‌పాడు దాకా చేరటం, దారిలో చెక్‌డ్యాములో చేరి దుర్వాసన వ్యాపించటం, చేపలు, బర్రెలు, జింకలు చావటం, ఆ నీటితో శరీరం శుభ్రపరచుకున్న వారికి శరీరమంతా దద్దుర్లు రావటం ప్రజలను తీవ్ర ఆందోళనకు బాధకు గురి చేసింది. దీంతో కంపెనీ యాజమాన్యం కూడా కలవరపడి ఇథనాల్‌ ఉత్పత్తి వ్యర్థాలను ట్యాంకర్లలో నింపి కొంతదూరంగా రోడ్ల వెంట పొలాల్లో పారబోయించింది. ఇందులో కొన్నింటిని రైతులు గుర్తించి పోలీసులకు అప్పగించారు. అలాగే ఇథనాల్‌ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ బృందం అక్టోబర్ 21న కలెక్టర్‌ను కలిసి కంపెనీ దురాగతాలను అరికట్టాలని ప్రాతినిధ్యం చేసింది. అయినా ఆ సాయంత్రం ఒక ట్యాంకర్‌ కంపెనీ నుండి బయటికి వచ్చింది. అప్పటి నుండి జిల్లా కలెక్టర్‌ రావాలని తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆ రాత్రంతా అక్కడే పడుకున్నారు.

కలెక్టర్‌ వచ్చి తమకు న్యాయం చేస్తాడని నమ్మారు. కానీ కలెక్టర్ రాలేదు. పోలీసులు, తహశీల్దార్‌ వచ్చారు. కొద్దిసేపు కలెక్టర్‌ రావాలని పట్టుబట్టిన రైతులు అసలు ఆ ట్యాంకర్‌లో ఏమున్నదో తేల్చమని అడిగారు. ఉదయం పదకొండు దాకా ఒక సామరస్య వాతావరణంలో చర్చ జరుగుతూనే ఉంది. చివరికి తహశీల్దార్‌‌నే ఆ ట్యాంకర్‌లో ఏముందో తెలుసుకొమ్మని కమిటి విజ్ఞప్తి చేశారు. ఇదంతా మరికల్‌ సిఐ, ఎస్‌ఐ ల ముందే జరిగింది. ఇక అంతా సర్దుకుంటుందని అనుకుంటున్న సమయంలో డీఎస్‌పీ వచ్చి సీఐ, ఎస్‌ఐలను పిలుచుకుని అరనిమిషంలో లాఠీచార్జికి ఆదేశించారు. దీంతో పోలీసులు విచక్షణ రహితంగా రైతులను కొట్టారు. అధికారులు స్వాధీనం చేసుకున్న ట్యాంకర్‌లో ఏముందో తెల్చమని కోరుతూ పదహారు గంటల పాటు రైతులు చేసిన విజ్ఞప్తిని పట్టించుకుని శాంతియుత బైఠాయింపును ఆపి వుంటే ఆందోళన ఆగిపోయేది. కానీ పోలీసులు దారుణంగా హింసించడంతోపాటు. చిత్తనూరు, ఎక్లాస్‌పూరు, జిన్హారం, కన్మనూరు గ్రామాల రైతులను, ఉద్యమ నాయకత్వాన్ని వెంటాడి, వేటాడి అరెస్టు చేశారు. 78 మందితో ఒక రిమాండ్‌ రిపోర్టు విడుదల చేశారు. దొరికిన వారిలో చాలామందిని పోలీస్‌ స్టేషన్‌లలో కూడా మొరటుగా హింసించారు.

కంపెనీ మద్దతుదారులను ఓడించండి!

గత రెండేళ్లుగా అన్ని ఆందోళనల సందర్భాలలో ఆయా శిబిరాల దగ్గర పోలీసులకు భోజనాలు వడ్డించారు. తమ బాధ అర్థం చేసుకుంటారనుకుంటే వారినే కంపెనీ వశపరుచుకుని వారితో లాఠీచార్జి చేయిస్తుందనుకోలేదు. ఈ కేసులో ఇప్పటికీ బెయిల్‌ దొరకకుండా బండారి లక్ష్మయ్య మరికొందరు జైలులోనే వున్నారు. పోలీసు దెబ్బలకు దొరకకూడదనుకున్న వారు కోర్టులో లొంగిపోయినా కస్టడీకి తీసుకుని వాళ్ళ పద్ధతి అమలు చేశారు. కోర్టు నుండి ముందుస్తు బెయిల్‌ తెచ్చిన వారి నుండి ఆ కాగితాలే తీసుకోకుండా భయపెట్టారు. అయితే, నాటి దుర్ఘటనకు కంపెనీ యాజమాన్యానికి ఎంత బాధ్యత వుందో ప్రభుత్వానికి అంతకు మించిన బాధ్యత వుంది. ప్రభుత్వం చిత్తనూరు ఇథనాల్‌ కంపెనీ అక్రమాలపై, హింసపై ఏ ఒక్క శాఖను పనిచేయనీయలేదు. ఇథనాల్‌ పాలసీ రూపొందించిన కేంద్ర ప్రభుత్వం దానికి లోబడి వున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులపై హింసకు బాధ్యత వహించాలి.

నిజానికి కోయిల్‌సాగర్‌ నీరు 50 వేల ఎకరాలకు పారాలి. ప్రభుత్వ అసమర్థత వల్లనే 12 వేల ఎకరాలకు కూడా పారటం లేదు. ఆ కొద్ది నీటిని కూడా రైతుల పంట పొలాల పొట్టగొట్టి కంపెనీ తరలించుకుపోతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే చిత్తనూర్‌ ఇథనాల్‌ కంపెనీ యాజమాన్యం చెయ్యని నేరంలేదు. మన్నెవాగును ధ్వంసం చేసినా, నక్షాబాటలు కలుపుకున్నా, అసైన్డ్ భూములను కంపెనీ అక్రమించినా, లేళ్ళను, జాతీయ పక్షులై నెమళ్ళను చంపినా ఒక్క కేసు పెట్టలేదు. కానీ చేయని నేరానికి రైతుల మీద, ఉద్యమకారుల మీద తీవ్రమైన సెక్షన్లతో అక్రమ కేసులు బనాయించారు. మేం ప్రభుత్వానికి, పోలీసులకు ఒక విషయం స్పష్టం చేయలదలుచుకున్నాం. మేం కంపెనీ హింసను, అక్రమాలను, దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నాం. మేం మా కోసం, మా బిడ్డల భవిష్యత్తు కోసం అభివృద్ధి పేరు మీద మహబూబ్‌నగర్‌ను ప్రత్యేకించి నారాయణ పేటను ప్రయోగశాలగా మారుస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాం. అంతే తప్ప మేం ఏమాత్రం నేరం చేయడం లేదు. ఇలాంటి బెదరింపులతో, అక్రమ కేసులు, అరెస్టులతో ఉద్యమాలు ఆగవని తెలుపుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కంపెనీని రద్దు చేస్తుందా? లేదా పోలీసులు, వివిధ ప్రభుత్వ శాఖలు కంపెనీపై కేసులు నమోదు చేస్తారా? అనేది తెలపాలి! ఈ ప్రాంతంలో ఎన్నికలలో నిలబడే జిల్లా అభ్యర్థులను ఈ కంపెనీపై నిలదీయమని, కంపెనీ మద్దతుదారులను ఓడించమని మనవి చేస్తున్నాం. కంపెనీ రద్దయ్యే దాకా న్యాయం కోసం ప్రశ్నిస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం.

ఎం. రాఘవాచారి

పాలమూరు అధ్యయన వేదిక

94907 03857

Advertisement

Next Story