సింగరేణి ఎన్నికలంటే ఉలుకెందుకు!?

by Ravi |   ( Updated:2023-04-25 00:15:58.0  )
సింగరేణి ఎన్నికలంటే ఉలుకెందుకు!?
X

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం ప్రజలకు ఉంది. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తున్న మెజారిటీ అభ్యర్థులపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ ఉండటంతో గుడ్డిలో మెల్ల అన్నచందంగా అయిష్టంగానే ఓట్లేస్తున్నారు. నచ్చని అభ్యర్థులు పోటీలో ఉన్నప్పుడు ‘నోటా’(నన్ ఆఫ్ ది ఎబౌ)ఓటు వేస్తున్నారు. కానీ రాజకీయ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోకు, వాగ్దానాలకు చట్టబద్ధత లేనట్లుగానే నోటాకు ఎటువంటి ఎన్నికల విలువ లేదు. అయినప్పటికీ సార్వత్రిక ఎన్నికల విధానాన్ని ప్రజాస్వామ్యంగా భ్రమింపచేస్తున్నారు. పార్లమెంటు, అసెంబ్లీల ఎన్నికలను నిర్దిష్టంగా, సమయానుకూలంగా నిర్వహిస్తున్నారు. కానీ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను మాత్రం ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు.

పోరాటాలతోనే సౌకర్యాలు..

సింగరేణిలో ఎన్నికలను పెట్టాలని కార్మికులు ఏనాడూ డిమాండ్ చేయలేదు. హక్కులకోసం కలబడుతూ బాధ్యతలకు నిలబడుతూ ఐక్యపోరాటాల మార్గాన్నే కొనసాగించారు. నాటి నిజాం హైదరాబాద్ స్టేట్‌లో రజాకార్లు, కాంట్రాక్టర్లు సాగించిన దోపిడీ దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి సర్వదేవభట్ల రామనాథం, మగ్దుం మోహియుద్దీన్, డాక్టర్ రాజ్ బహదూర్ గౌర్ మొదలైన నాయకులు కలిసి 1935లో ‘సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్’ను ఏర్పాటు చేశారు. తెలంగాణలో బొగ్గు ఉత్పత్తిని చేయడానికి 1886లో హైదరాబాద్ స్టేట్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ ఏర్పాటు అయి, 1889 నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అయింది. హైదరాబాద్ కంపెనీల చట్టం కింద 1920 డిసెంబర్ 23న ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’గా నమోదై, తర్వాత కేంద్ర ప్రభుత్వం 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 51 శాతం భాగస్వామ్యంతో, కార్మికుల శ్రమ ఫలితంతో విరాజిల్లుతుంది. అయితే సింగరేణిలో కార్మికులు అనుభవిస్తున్న హక్కులన్నీ పోరాటాలు, సమ్మెలు చేసి సాధించుకున్నవే. అనేక సమస్యల పరిష్కారం కోసం వామపక్ష, విప్లవ, జాతీయ, వృత్తి కార్మిక సంఘాలు దాదాపు 98 సంఘాలు వివిధ సమస్యల పరిష్కారంకై పోరాటాలు చేశారు. అప్పుడు ప్రభుత్వం దూరాలోచనతో ఐక్యపోరాటాల స్ఫూర్తిని, ఐక్యతను నీరుగార్చడానికి, పోరాటాలను నిలువరించే కుట్రతో సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రక్రియను తెరమీదికి తెచ్చింది. దాదాపుగా మెజారిటీ కార్మిక సంఘాలు సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు అనగానే సంబరాన్ని ప్రకటించారు. కార్మిక చట్టాలను, ఇతర ప్రభుత్వ పరిశ్రమల్లో కొనసాగుతున్న ఎన్నికల ప్రక్రియ సాధక, బాధకాలను పరిగణనలోకి తీసుకోకుండా గుడ్డెద్దు చేనులో పడినట్లుగా పోటీలో పాల్గొన్నాయి అన్ని సంఘాలు.

రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడే ఎన్నికలు

ఈ ఎన్నికలు 1998లో మొదటిసారి జరగగా, ఏఐటీయూసీ కార్మిక సంఘంగా, సాజక్ (వృత్తి సంఘాల కూటమి),హెచ్ఎమ్మెస్, ఐఎన్టీయుసి, టీఎన్టీయుసి ప్రాతినిధ్య కార్మిక సంఘాలుగా గెలుపొందాయి. అప్పుడు యాజమాన్యం ‘కోడాఫ్ డిసిప్లేన్’ పేరుతో కార్మిక సంఘాలకు బాధ్యతల పరిధిలను, పరిమితులను నిర్ణయించింది. సింగరేణి వ్యాప్తంగా మెజారిటీ ఓట్లను సాధించిన సంఘానికి గుర్తింపు హోదాను ఇచ్చింది.11 డివిజన్ లలోని కార్మికుల సమస్యలను చర్చించి మెమోరాండం ఆఫ్ సెటిల్మెంటు(ఎం.ఓ.ఎస్)చేసుకునే అవకాశం ఇచ్చింది. అలాగే పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్ 12(3) ప్రకారంగా త్రైపాక్షిక ఒప్పందాలను చేసుకునే అవకాశం ఇచ్చింది. డివిజన్ స్థాయిలో మెజారిటీ ఓట్లను సాధించిన కార్మిక సంఘానికి ప్రాతినిధ్యం హోదాను ఇచ్చి కేవలం డివిజన్ స్థాయి సమస్యలను చర్చించడానికి మాత్రమే అవకాశం ఇచ్చింది. ఇలా 2001లో, 2003లో, 2007లో ఎన్నికలు జరిగాయి. కానీ 2017లో జరిగిన ఈ ఎన్నికలలో రాజకీయ జోక్యం పెరిగింది. ఎంతలా అంటే ఈ ఎన్నికలకు సీఎం కేసీఆర్ స్వయాన ప్రచారం చేసేంతలా, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంస్థగా టీబీజీకేఎస్‌ను ప్రకటించి దానికి కవితను అధ్యక్షురాలిగా నియమించారు.

ఈ ఎన్నికలలో టీబీజీకేఎస్ గెలిచాక నిబంధనల ప్రకారం గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్‌తో ప్రతి మూడు నెలలకు ఒక సారి కంపెనీ స్థాయిలో ఛైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ పర్సనల్, అడ్మినిస్ట్రేటీవ్, వెల్ఫేర్ మిగతా డైరెక్టర్‌ల, అధికారుల భాగస్వామ్యంతో కార్మికుల సమస్యలపై, సంస్థాగత విధానాలపై చర్చలు జరిపి పరిష్కరింపచేయాలి. అలాగే టీబీజీకేఎస్, ఏఐటీయూసీ కార్మిక సంఘాలతో ‘జె.సి.సి’ (జాయింట్ కన్సల్టెంట్ కమిటీ) సమావేశాలను జరిపి కార్మిక సంఘాల సూచనలను రికార్డ్ చేసి పరిష్కారం చేయాలి. కానీ గడచిన ఐదేండ్ల కాలంలో కేవలం రెండే రెండు సమావేశాలు మొక్కుబడిగా జరిగాయి. బొగ్గు గనుల్లో జరిగిన అనేక ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఓదార్పును ఇవ్వడానికి ముఖ్యమంత్రి, గౌరవ అధ్యక్షురాలు, మంత్రులు, సంస్థ సీఎండీలు కూడా రాలేదు. అప్పుడు జాతీయ, విప్లవకర కార్మిక సంఘాలు ఐక్యకార్యాచరణగా పోరాటాలు చేసి కార్మికులకు బాసటగా నిలిచాయి. పారిశ్రామిక శాంతికి తోడ్పడ్డాయి.

కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అన్ని సంఘాలకు చర్చించే అవకాశం ఇవ్వాలని లేదా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర కార్మిక శాఖ అధికారులకు విజ్ఞప్తి చేయడంతో ప్రాంతీయ లేబర్ కమిషనర్(సెంట్రల్) మంత్రిత్వ శాఖ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి రెండు సంవత్సరాల కాలానికి గుర్తింపు ఇవ్వాలని సింగరేణి సంస్థ సీఎండీకి సూచించారు. కానీ కోవిడ్ మహమ్మారి కారణంగా సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదని బదులు ఇచ్చారు. కానీ అదే కోవిడ్ సమయంలో రాష్ట్రంలో హుజురాబాద్, మునుగోడు శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలను మరచిపోయారు. అంటే దీనిని బట్టే సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం అవుతోంది.

అయితే అన్ని సమీక్షించుకొని ఈ నెలలో కేంద్ర కార్మిక శాఖ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సింది ఉంది కానీ ఈ లోపే సింగరేణి యాజమాన్యం ఎన్నికలను ఇప్పుడే నిర్వహించలేమని హైకోర్టులో కేసు దాఖలు చేసింది. దీనికి ప్రధాన కారణంగా సింగరేణిలో టీబీజీకేఎస్‌కు ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని, పైగా రాష్ట్రంలో ఎన్నికలు డిసెంబర్‌లో జరిగే అవకాశాలు ఉండటంతో దీనికి ముందు తెలంగాణకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించినట్లయితే టీబీజీకేఎస్‌కు ప్రతికూల పరిస్థితి ఎదురైతే, ఈ ఫలితం ప్రభావం కోల్ బెల్ట్ జిల్లాల శాసనసభ నియోజకవర్గాలైన బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, రామగుండం, మంథని, భూపాలపల్లి, పినపాక, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లందులో పడుతుందని... అందుకే దురాలోచనతో నేటి బీఆర్ఎస్ పార్టీనే సింగరేణి యాజమాన్యంతో ఇప్పుడు ఎన్నికలను నిర్వహించలేమని హైకోర్టులో కేసు దాఖలు చేయించిందని కార్మికులు చర్చించుకుంటున్నారు.

మేరుగు రాజయ్య

94414 40791

Advertisement

Next Story