- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎగువసభ ఎవరి కోసం.. ఎందుకోసం?

గత 75 సంవత్సరాల దేశ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, వివిధ రాష్ట్రాల్లో కొనసాగిన ఎగువసభలు క్రమంగా ఏ విధంగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా పరిణామం చెందినవో మనకు అర్థం అవుతుంది. చట్టసభలు నిర్మాణ పరంగా సమాజంలోని అన్ని వర్గాల వారికి ముఖ్యంగా తరతరాలుగా అణచివేతకు, దోపిడీకి, వివక్షకు గురైన సామాజిక వర్గాల వారందరికీ వారి జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించే విధంగా ఉండాలి. అప్పుడే అవి మెజార్టీ ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఉండేది. దీనికి అవసరమైన రాజ్యాంగ సవరణలు చేపట్టినప్పుడే కౌన్సిల్ ప్రతిష్ట పెరిగేది, ప్రజల ఆకాంక్షలు సాకారమయ్యేది, లేకుంటే దాని కొనసాగింపు అర్థరహితం. ఎగువసభగా పిలువబడే ఈ శాసనమండలి ఏర్పాటు, దాని నిర్మాణం, ఆశయాలు, దాని అధికారాలను ఓసారి పరిశీలిస్తే, అది అసలు అవసరమా? అన్న సందేహం, ప్రశ్న ఎవరికైనా కలుగక మానదు.
రేపు మన రాష్ట్రంలో ఎగువసభగా పిలువబడే శాసన మండలిలోని మూడు స్థానాలకు ఎన్నికలు జరుగబోతున్నయి. ఈ మూడింటిలో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలవైతే ఒకటి మాత్రం పట్టభద్రులకు సంబంధించింది. ఎన్నికల బరిలో ఉన్న ప్రధాన అభ్యర్థులు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఓటర్లను విందులు, వినోదాలు, డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఉండే ఫంక్షన్ హాళ్లన్నీ ఆత్మీయ సమ్మేళనాల పేరిట మందు పార్టీలతో కిటకిటలాడుతున్నయి. కొంతమంది అభ్యర్థులు ఎన్నికల్లో ఎలాగైనా గెలువాలని 50 కోట్లకు పైగానే ఖర్చుపెడ్తున్నట్లు తెలుస్తుంది.
వీరికి ప్రాతినిధ్యం ఏది?
చాలా వరకు ప్రపంచ రాజ్యాలు కాలమాన పరిస్థితులను బట్టి చిన్న రాజ్యాలు ఏకసభా పద్దతిని రూపొందించుకోగా పెద్ద రాజ్యాలు సమాఖ్యలుగా ఏర్పడి వాటి అవసరాలను తీర్చుకునే నిమిత్తం ద్విసభా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నయి. ఏకసభా పద్ధతిలో కంటే ద్విసభా పద్ధతిలో ప్రజాభిప్రాయ వ్యక్తీకరణకు ఎక్కువ అవకాశముంటుందనేది విజ్ఞుల భావన. ఈ భావనే ద్విసభా విధానం ఆవిర్భావానికి మూలం. ఎగువసభ ప్రధానంగా సమాజంలోని వైవిధ్యతకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ 75 సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే దేశంలో అనేక ఉద్యమాలు కొత్త సామాజిక శక్తులను తెరపైకి తీసుకొచ్చినయి. ముఖ్యంగా దళిత ఉద్యమాలు, స్త్రీవాద, రైతుకూలీ, కార్మిక, వెనుకబడిన కులాల పోరాటాలు రాజకీయ ప్రాతినిధ్యం కోరుతున్నయి. నిర్మాణ పరంగా ప్రస్తుతమున్న శాసనమండలి వీరికి ప్రాతినిధ్యం కల్పించలేదు.
రిజర్వేషన్లకు ఆమడ దూరం
ప్రస్తుతమున్న కౌన్సిల్ ఉపాధ్యాయులకు, పట్టభద్రులకు, స్థానిక సంస్థలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది. మారిన, మారుతున్న సామాజిక వైవిధ్యతకు అది ఏ మేరకు స్థానం కల్పిస్తుంది అన్నది ప్రశ్న. షెడ్యూల్డ్ కులాలు తెగలవారికి శాసనసభ, లోక్‌సభలో సముచిత ప్రాతినిధ్యం కల్పించే నిమిత్తం వారికి రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు ఉన్నయి. శానసమండలి విషయంలో అలాంటి రిజర్వేషన్లు ఏవీ లేకపోవడంతో వారికి ఎగువసభలో సముచిత ప్రాతినిధ్యం లభించుట లేదు. మొదటి నుండి ఎగువసభ ఉన్నత వర్గాల వారికి మాత్రమే అందుబాటులో ఉంది తప్ప దళితులకు, బలహీన వర్గాల వారికి, మహిళలకు కాదన్నది సత్యం. రాజ్యాంగం ప్రకారం ఎగువసభ సమాజంలోని వైవిధ్యతకు ప్రాతినిధ్యం కల్పించడానికి ఉద్దేశించింది. మరి ఆ ఆశయం ఏ మేరకు నెరవేరుతున్నట్లు అన్నది ప్రశ్న. ఈ ఆశయం నెరవేరాలంటే చరిత్రలో సుదీర్ఘ కాలంపాటు అణచివేతకు, దోపిడికి, వివక్షకు గురైన ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన కులాలు, మహిళలకు రాజ్యాంగపరంగా రిజర్వేషన్లు కల్పించి వారికి మండలిలో స్థానం కల్పించాలి. గత 75 సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆ దిశలో చర్యలు చేపట్టిన ఉదంతాలు లేవు. అలాంటప్పుడు దాని కొనసాగింపు ఎవరికోసం? ఎందుకోసం? అన్నది ప్రశ్న.
నిష్ణాతులకు దూరంగా ఎగువ సభ
సాహిత్యం, కళలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, సాంఘిక సేవ మొదలైన రాజకీయేతర రంగాలలో నిష్ణాతులైన వారికి రాష్ట్ర గవర్నర్ ద్వారా నామనిర్ధేశ పద్ధతిలో ప్రాతినిధ్యం కల్పిస్తే వారి జాతికి ఆ సేవలు లభించే అవకాశముందనే రాజ్యాంగ ఆశయం ఏ మేరకు సాకారం అయిందన్న విషయం గత 75 సంవత్సరాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఉద్యోగాలలో ఉన్న పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు వ్యవస్థీకృత ఉద్యోగ సంఘాలు ఉండగా వారికే అందులో ప్రాతినిధ్యం కల్పించి సమాజంలో అసంఖ్యాకంగా ఉన్న సామాజిక వర్గాల వారికి అందులో ప్రాతినిధ్యం కల్పించలేదంటే అది ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా సృష్టించబడ్డదో అర్థం చేసుకోవచ్చు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థి పట్టభద్రుడు కానవసరం లేదు. అదే విధంగా ఉపాధ్యాయుల నియోజకవర్గంలో పోటీ చేయాలనుకునే అభ్యర్థి ఉపాధ్యాయుడే కానవసరం లేదు. పోటీ ఎవరైనా చేయవచ్చు. పోటీకి అందరూ అర్హులే. పోటీకి అర్హులే గానీ వారికి ఓటు హక్కు మాత్రం ఉండదు. ఒక వ్యక్తికి ఓటు హక్కు లేకుండా పోటీ చేసే హక్కు ఎలా లభిస్తుందో అర్థం కాదు.
బిల్లుల జాప్యం కోసమేనా?
శానసమండలి అధికారాలను పరిశీలిస్తే.. అసలు ఈ సభ అవసరమా? అన్న సందేహం ఎవరికైనా కలుగక మానదు. శాసనాల నిర్మాణంలో మండలి పాత్ర కేవలం సలహాలు ఇవ్వడానికే పరిమితం. ఆ సలహాలను శానససభ గౌరవించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. శానససభ ఆమోదించిన బిల్లులను శానసమండలి తాను ఆమోదించకుండా ఆ బిల్లులు చట్టం కాకుండా కేవలం నాలుగు నెలలపాటు మాత్రమే అది జాప్యం చేయగలదు. ఏ బిల్లుకైనా శానసమండలి ప్రతిపాదించే సవరణలకు సలహా పూర్వకమైన విలువ మాత్రమే ఉంటది. ఆర్థిక బిల్లుల విషయంలో ఆ మాత్రం స్వేచ్ఛ, అధికారం కూడా శానసమండలికి లేదు. ఈ బిల్లుల విషయంలో అవి చట్టం కాకుండా కేవలం 14 రోజులు మాత్రమే ఎగువసభ జాప్యం చేయగలదు. శాసనసభ ఆమోదించిన బిల్లులను అవి చట్టం కాకుండా జాప్యం చేయడానికి ఎగువ సభ అవసరమా అన్నది ప్రశ్న.
ప్రజాధనం దుర్వినియోగం
అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని శాసనమండలి ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికి సదరు ప్రభుత్వ మనుగడకు ఎటువంటి విఘాతం కలుగదు. అంతేగాక రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేందుకు గానీ రాజ్యసభ సభ్యులను ఎన్నుకునేందుకు గానీ కౌన్సిల్ సభ్యులకు కనీసం ఓటుహక్కు కూడా ఉండదు. ఏ అధికారాలూ లేని ఈ ఎగువసభల నిర్వహణకు ప్రజాధనం పెద్ద మొత్తంలో దుర్వినియోగం అవుతుంది. అలాంటప్పుడు ఎగువసభల కొనసాగింపు అవసరమా? అన్న సందేహం, ప్రశ్న ఎవరికైనా కలుగక మానదు.
-ప్రొ. జి.లక్ష్మణ్,
ఉస్మానియా యూనివర్సిటీ,
98491 36104