వైద్య విద్యార్థులకు రక్షణ ఏది?

by Ravi |   ( Updated:2024-08-24 01:00:50.0  )
వైద్య విద్యార్థులకు రక్షణ ఏది?
X

మొన్న నిర్భయ, నిన్న దిశ, నేడు కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం... ఇలా దేశంలో ప్రతి 16 నిమిషాలకు ఒక మహిళపై లైంగిక దాడి జరుగుతుంది. దేశంలో మహిళల భద్రత, సంక్షేమం కరువైంది. ఆడపిల్లలపై అమానుష అత్యాచార ఘటనలు నిత్యకృత్యమైనా యి. ఆగస్టు 9వ తేదీ రాత్రి కోల్‌కతా లోని ఆర్‌జీ కర్ బోధన ఆస్పత్రిలో 31 సంవత్సరాల పీజీ డాక్టర్‌పై దారుణంగా లైంగిక దాడి చేసి క్రూరంగా హత్య చేశారు. దీంతో మరోసారి దేశమంతా నిరసన జ్వాలలు చెలరేగాయి.

సాధారణంగా రాత్రిపూట అమ్మాయిలు తిరగడం వలన, రెచ్చగొట్టే దుస్తులు ధరించడం వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయని అమ్మాయిలను తప్పు పట్టే ఘటనలు లేకపోలేదు. కానీ ఈ పీజీ డాక్టర్ నైట్ డ్యూటీలో ఉండగా జనాలతో కిటకిటలాడే ఆసు పత్రిలో, సెమినార్ రూంలో విశ్రాంతి తీసుకుంటుండగా, రాత్రి 2 గంటల తర్వాత కాళ్లు చేతులు విరిచి, గోళ్లతో రక్కి, మెడ ఎముక విరిచి, తల నుండి పాదాల వరకు రకరకాలుగా గాయపరిచి దారుణాతి దారుణంగా చంపేశారంటే దేశంలో మహిళల భద్రత ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు.

పట్టపగలు నడిచే పరిస్థితి లేదు!

మహిళలు, అర్ధరాత్రి కాదు కదా., పట్ట పగలు నడిచే పరిస్థితులు కూడా కష్టమే. నడిచే వాహనాలలో, గాలిలో ఎగిరే విమానాలలో, పనిచేసే చోట, ఇంటా బయటా అన్నిచోట్ల లైంగిక వేధింపులు విపరీతమవుతున్నాయి. మహిళల రక్షణ భద్రత సంక్షేమం కోసం అనేక చట్టాలు తయారు చేయడం జరిగింది. కానీ వాటి అమలులో చిత్తశుద్ధి లోపించడం, అందులో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని శిక్షల నుండి తప్పించుకోవడం, మితిమీరిన రాజకీయ జోక్యంతో బయటపడడం జరుగుతోంది. పాలక ప్రజాప్రతినిధులు సైతం ఈ దారుణాలకు పాల్పడుతుండడం బాధాకరం. గుజరాత్‌లో జరిగిన బిల్కినో భాను ఉదంతం, భారత రెజ్లర్లపై పాలక పార్టీ ప్రజా ప్రతినిధి లైంగిక దాడులకు పాల్పడినట్లు నెలల తరబడి ఆ క్రీడాకారులు రోడ్లపైకి వచ్చి ఉద్యమించడం లాంటి ఘటనలు కోకొల్లలు.

దాగిన చీకటి కోణం ఏది?

మహిళా వైద్యురాలిపై అమానుష హత్యాకాండ జరగడం ఒకటైతే. ఈ ఘోర కృత్యాన్ని దాచిపెట్టే ప్రయత్నాలు జరగడం, తండ్రి లాంటి వాడిని అని చిలక పలుకులు పలుకుతున్న మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆమె ఆత్మహత్య చేసుకున్నదని, ఆమె సెమినార్ రూంకు ఎందుకు వెళ్లవలసి వచ్చిందని మాట్లాడటం.. నేరస్తులకు సహకరించే ప్రయత్నం లాగా కనిపిస్తుంది. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో, ఆ ప్రిన్సిపాల్‌ను రాజీనామా చేయించి, మరింత మంచి హోదాలో నియమించారంటే అతగాడికున్న రాజకీయ మద్దతును అర్థం చేసుకోవచ్చు. బాధిత తల్లిదండ్రులకు కొన్ని గంటల పాటు తమ కుమార్తె శవాన్ని చూడనీయకుండా, ఎటువంటి నిరసన కార్యక్రమాలను తెలియజేయకుండా ఉండడానికి డబ్బులు ఎరవేస్తూ పోలీసులు ప్రతిపాదనలు చేశారని వార్తలు. అంటే ఈ సంఘటన వెనుక ఏదో పెద్ద చీకటి కోణం దాగి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కేసు విచారణను హైకోర్టు సీబీఐకి అప్పగించడం కోసమెరుపు.

వారాంతపు సెలవులూ లేని వెట్టి చాకిరీ!

ఒక డాక్టర్ తయారు కావడం అంతా ఆషామాషీ కాదు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదివి ఎంట్రెన్స్‌లలో విజయం సాధించి సీట్ సంపాదించి కఠినమైన విషయాల పట్ల అవగాహన పెంచుకుని పగలనకా రాత్రనకా రేయింబవళ్లు విధులు సేవలు అందించేవారు డాక్టర్లు. నైట్ డ్యూటీ అంటే సాధారణంగా రాత్రిపూట మాత్రమే అనుకుంటాం, కానీ వైద్య విద్యార్థులకు అది 36 గంటల డ్యూటీ. ఆ డ్యూటీలో కనీసం వారికి తినడానికి తీరిక కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి డ్యూటీలు వారానికి కనీసం మూడు చేయాల్సిందే. వాళ్లకు పండుగలు, ఫంక్షన్లు విందులు, వినోదాలు అచ్చట ముచ్చట ఏమీ ఉండవు. వారానికి కనీసం ఒక వారాంతపు సెలవు కూడా ఉండదు. ఇది కోర్సు చదువుతున్న వైద్య విద్యార్థుల ప్రస్తుత పరిస్థితి. ఇలాంటి తరుణంలో వారిపై ఒత్తిడి ఎలా ఉంటుంది? వారి మానసిక పరిస్థితి ఏమిటి? అనేది అర్థం చేసుకోవాలి.

విపరీతమైన ఒత్తిడితో..

విధులు నిర్వర్తించే క్రమంలో పేషంట్లతో పాట్లు, ఒకవేళ పేషంట్ సీరియస్ కండిషన్లో ఉంటే వారి బంధువులైన అటెండర్‌లతో తంటాలు, తగువులు, తన్నులు పడాల్సిందే.. ఇలాంటి బాధలు అనుభవిస్తున్న జూనియర్ డాక్టర్లకు రక్షణ, సంక్షేమం కోసం కళాశాల అధిపతులు, యాజమాన్యాలు, ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వారు సేద తీరుదామంటే తగిన విశ్రాంతి గదులు, టాయిలెట్ సౌకర్యాలు, టీ, టిఫిన్, భోజన వసతు లు ఏవి కూడా సరిగా ఉండవు. శుచి, శుభ్రత, ఆరోగ్యంగా ఉండడానికి సలహాలు ఇచ్చే డాక్టర్లకు అవి కరువు అవడం ఆశ్చర్యకరమైన విషయం. చాలామంది ఇవి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండడం డిప్రెషన్‌లోకి వెళ్లడం లాంటి మానసిక సమస్యలతో డాక్టర్లు సతమతం అవుతున్నారు. ఇలా వైద్య విద్యార్థులు విపరీతమైన ఒత్తిడితో మానసిక సమస్యల బారిన పడుతున్నారని సాక్షాత్తు జాతీయ మెడికల్ కమిషన్ నివేదిక తెలుపుతుంది. ప్రతి నలుగురు ఎంబీబీఎస్ విద్యా ర్థుల్లో ఒకరు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రతి ముగ్గురి పీజీ విద్యార్థుల్లో ఒకరిలో ఆత్మ హత్య ఆలోచనలు కూడా వచ్చాయని తెలిపింది.

కీచకులను తక్షణం శిక్షించాల్సిందే!

ఈ విధంగా వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్న నేపథ్యంలో రెసిడెంట్ డాక్టర్లు వారానికి 74 గంటలకంటే ఎక్కువ పనిచేయవద్దని, వారానికి ఒకరోజు కచ్చితంగా సెలవు తీసుకోవాలని, వైద్య విద్యార్థులు సెలవు అడిగినప్పుడు తిరస్కరించకుండా మంజూరు చేయాలని జాతీయ మెడికల్ కమిషన్ పలు సూచనలు చేసింది. వీటిని చిత్తశుద్ధితో అమలుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులపై వైద్య సిబ్బందిపై హింసకు వ్యతిరేకంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని పలువురు డాక్టర్లు డాక్టర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు, ఆ చట్టాన్ని తీసుకువచ్చి మెడికల్ కాలేజీలలో మహిళా డాక్టర్లు సిబ్బందికి భద్రత కల్పించాలి. అత్యాచారాలకు పాల్పడుతున్న నయా కీచ కులను, మానవ మృగాలను తక్షణమే శిక్షించాలి.

పని ప్రదేశం అసురక్షితమైతే..

భారతదేశం ప్రగతి పథంలో పయనించాలంటే స్త్రీల భాగస్వామ్యం అవసరం. అది సాధ్యం కావాలంటే సురక్షితంగా పని ప్రదేశం నుండి ఇంటికి వెళ్లగలగాలి. ప్రతి స్త్రీకి భద్రత గౌరవం అవసరం. అదే విధంగా మహిళా వైద్యులకు, సిబ్బందికి రక్షణ కల్పించాలి. ఆస్పత్రుల్లో భద్రత కోసం జూనియర్ డాక్టర్లు చేస్తున్న పోరాటానికి ప్రజలు మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, పౌరసమాజం, రాజకీయ పార్టీలు స్పందించాలి, మద్దతు ఇవ్వాలి. ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడు మాత్రమే దేశానికి తలంపు తెచ్చే ఇలాంటి అత్యాచారాలకు అడ్డుకట్ట వేయడానికి సాధ్యమవుతుంది.

తండ సదానందం

టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్

99895 84665

Advertisement

Next Story

Most Viewed