- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వికసిత్ భారత్ ఎక్కడ?
2004-14 సంవత్సరాల మధ్య పదేళ్ల కాలంలో జీడీపీ వృద్ధిరేటు సగటున 8.1శాతంగా ఉండింది. కానీ పదేళ్ల కాలంలో బీజేపీ ప్రభుత్వంలో అది కేవలం 5.4శాతం మాత్రమే ఉంది. ఒక వేళ బీజేపీ ప్రభుత్వం చెబుతున్నట్లు జీడీపీ ప్రగతి పథంలో ఉన్నట్లైతే ఆ అభివృద్ధి ఫలాలు సామాన్య ప్రజల నిత్య జీవన విధానంలో ప్రతిబింబించాలి కదా! మరి వాస్తవంగా అలా ఉందా?
'వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ' పేరుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం, తన పదేళ్ళ పాలనా కాలంలో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని దేశం మొత్తం తిరిగి వివరించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. మన దేశ జాతీయ స్థూల ఉత్పత్తి(జీడీపీ)7 శాతం వృద్ధి రేటుతో ప్రగతి పథంలో దూసుకుపోతోంది అని అంటున్నారు. అంతే కాక 2047 నాటికి గ్లోబల్ ఆర్థిక వ్యవస్థలో 3వ, ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావాన్ని భారత ప్రధాని మోదీ ఇటీవల వ్యక్తం చేశారు కూడా. ఇది సంతోషించదగిన విషయం. అయితే, ఈ ప్రకటనను కేవలం ఊహలు, అభిలాషల పరంగా కాకుండా వాస్తవిక గణాంకాల ఆధారంగా పరిశీలించడం అవసరం.
సాధారణంగా జీడీపీ వృద్ధి రేటు ఏమేరకు పెరిగిందో చూడాలంటే అంతకు ముందు సంవత్సరం తో పోల్చి ప్రస్తుత జీడీపీ ఎంత పెరిగిందో ప్రకటిస్తారు. కానీ, మన ప్రభుత్వం 2021లో కోవిడ్ సందర్భంగా మన జీడీపీ మైనస్ 5.8 శాతం మాత్రమే నమోదైన దాంతో పోల్చి 2022-2023 లలో జీడీపీ వృద్ధిరేటు 7 శాతానికి పైగా పెరిగిందనట్లుగా ప్రభుత్వం లెక్కలు కట్టింది. కానీ వాస్తవాలు పరిశీలిస్తే 2004-14 సంవత్సరాల మధ్య పదేళ్ల కాలంలో యూపీఏ పాలనలో జీడీపీ వృద్ధిరేటు సగటున 8.1 శాతంగా ఉండింది. కానీ గత పదేళ్ల కాలంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో అది కేవలం 5.4శాతం మాత్రమే ఉంది. ఒక వేళ జీడీపీ ప్రగతి పథంలో ఉన్నట్లైతే ఆ అభివృద్ధి ఫలాలు సామాన్యుల ప్రజల నిత్య జీవన విధానంలో ప్రతిబింబించాలి కదా! మరి వాస్తవంగా అలా ఉందా నిష్పాక్షికంగా పరిశీలన చేద్దాం.
ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి
ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం భారత్‌లో ప్రజల మధ్య ఆర్ధిక అంతరాలు పెరిగిపోతున్నాయని వెల్లడించింది. అలాగే 'ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ' సంస్థ కూడా తన నివేదికలో గత దశాబ్ద కాలంలో దేశంలోని సంపన్నుల ఆదాయం పది రెట్లు పెరిగిందని స్పష్టంగా వెల్లడించింది. ప్రస్తుతం వారి వార్షికాదాయం నేటి భారతదేశ బడ్జెట్ కంటే అధికమని కూడా తెలిపింది. దేశ జనాభాలో ఒక్క శాతంగా ఉండే సంపన్న వర్గాలకే మొత్తం దేశ ఆదాయంలో సుమారు 73 శాతం పోతుందనీ, ఇక 67 కోట్ల మంది సామాన్య ప్రజల ఆదాయం మాత్రం కేవలం ఒక్క శాతమే పెరిగింది అని పేర్కొంది. మరి దీన్ని ప్రగతి పథం అంటారా? బీజేపీ ఆర్థిక నిపుణులు నిజాలు వెల్లడించాలి. దేశంలో అనునిత్యం విద్యా, వైద్య, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. ఖర్చులు భారమై కుటుంబాలు రుణభారంతో వొరిగిపోయాయి. వడ్డీలు చెల్లించ లేక ఉన్న కొద్దిపాటి ఆస్తులు కూడా అమ్ముకుంటున్నారు. దేశంలో ప్రతి ఏటా 6.3 కోట్ల మంది దారిద్రంలోకి నెట్టబడుతున్నారని ఈ సంస్థ స్పష్టంగా పేర్కొంది. దేశంలో జీడీపీ వృద్ధి రేటు బాగా ఉంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలి కదా! నిజానికి అలా పెరుగుతున్నాయా మోదీజీ? ప్రభుత్వ హామీ ప్రకారం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ పాటికే ఈ పదేళ్ళలో 20కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. మరి ఇచ్చారా, లెక్కలు ఉన్నాయా? నిజానికి కొత్త కొలువులు రాకపోగా ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి.
రైల్వేలో ఉద్యోగాల నిలిపివేత
ప్రభుత్వ సంస్థల్లో కెల్లా అతి పెద్దదైన రైల్వేలతో సహా ఉద్యోగ నియామకాలను కేంద్ర ప్రభుత్వం దాదాపు నిలిపివేసింది. ఎటువంటి ఉద్యోగ భద్రత లేని, అత్యంత తక్కువ వేతనాలకు ఈ రోజున కార్మికులు పనిచేయవలసి వస్తోంది. కొత్తగా వస్తున్న కొద్దిపాటి ఉపాధి కూడా కాంట్రాక్టు, అసంఘటిత రంగాల నుండే వస్తుంది. వీరికి నెలకు పదిహేను వేలకు మించి ఆదాయం లేదు. మహిళాభివృద్ధి, బేటీ పడావో అని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, మోదీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ, ఆశ, మిడ్ డే మీల్స్ వంటి రంగాల్లో పనిచేస్తున్న సుమారు కోటి మందికి పైగా మహిళా కార్మికులకు ఉద్యోగ భద్రత లేదు, వేతనాలు కూడా అత్యంత తక్కువ. అవి కూడా సకాలంలో విడుదల కావు. పేదలకు పోషకాహారం, మహిళా, శిశు సంరక్షణ వంటి ముఖ్యమైన అనేక సేవలందిస్తున్న ఈ స్కీం వర్కర్ల సమస్యలు చెప్పనలవికావు. చివరకు ఆరెస్సెస్‌కు అనుబంధంగా ఉన్న భారతీయ మజ్దూర్ సంఘ్ కూడా వీరి సమస్యల పరిష్కారానికై ఆందోళన చేయవలసి వచ్చింది.
భావోద్వేగాలు కూడెట్టవ్..!
నేడు దేశం వికసిత భారత్ ఏమో గానీ అత్యధిక పేద, మధ్య తరగతి ప్రజానీకాన్ని అభివృద్ధి ఫలాల నుండి గెంటివేసే భారత్‌గా రూపాంతరం చెందుతోంది. ఇది ఇలాగే కొనసాగితే 2047 కల్లా భారత దేశం ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఆందోళన కలుగుతుంది. మోదీ అనుకూల మీడియా సంస్థల ద్వారా, సోషల్ మీడియా అనుబంధ సంస్థల ద్వారా ఎన్ని అసత్యాలతో, అభూత కల్పనలతో ఎంత ఊదరగొట్టిన ప్రజలు తమ నిత్య జీవిత అనుభవాలే నిజమేంటో వారికి తెలుపుతున్నాయి. మోదీజీ పదేళ్ల పాలనలో అసమానతలు రెట్టింపుగా పెరిగాయి. ప్రజల జీవన ప్రమాణాలు ఘోరంగా పడిపోయాయి అన్నది ముమ్మాటికీ నిజం. మోదీ ప్రభుత్వం కొద్ది కాలం కులం, మతం, వంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి కొంతకాలం పబ్బం గడుపుకోవచ్చునేమో గానీ, ఎల్లవేళలా అశేష ప్రజానీక నిత్య జీవిత అనుభవాన్ని మాయమాటలతో మోసపుచ్చలేరు. నిజం నిలకడపై తేలుతుంది.
డా.కోలాహలం రామ్ కిషోర్
98493 28496