- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏమైంది?
‘బొంబాయి దుబాయి- బొగ్గుబాయి' ఈ మాట తెలియని సగటు తెలంగాణ వాసి ఉండడు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ పదం కూడా ఒక ప్రముఖ ఉద్యమ నినాదంగా ఉండింది. రాష్ట్రం నుండి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు ఎంతో మంది వలసలు వెళుతుంటారు. అయితే ఇక్కడి నుండి ఉపాధి నిమిత్తం వలస వెళ్లే కార్మికులలో సుమారు 90% మంది కార్మికులు ఎలాంటి నైపుణ్యాలు లేకుండా కేవలం నిర్మాణరంగ కూలీలుగానే మాత్రమే వెళుతున్నారు. దీంతో వీరు అక్కడ అత్యంత ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులలో పనిచేస్తున్నారు. ఇంత కష్టానికి కూడా వారికి లభించే వేతనాలు అంతంతే, అక్కడి కార్మిక చట్టాల ద్వారా వీరు పొందే లబ్ధి కూడా చాలా తక్కువే.
కఠిన నిబంధనలు తెలీక..
స్వంత ఊరిలో ఉపాధి కరువై ఎన్నో ఆశలతో డబ్బులు సంపాదించాలని కోరికతో, ఉన్న ఊరిని కన్న వారిని వదిలి ఎడారి దేశాల్లో అడుగు పెట్టిన కార్మికులకు అక్కడ ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. ఏండ్ల తరబడి ఎడారి దేశాల్లోనే మగ్గుతున్నారు. అక్కడ నివసించడానికి కనీస హక్కులు లేక, కఠినమైన పరిస్థితుల నడుమ బతుకీడుస్తున్నారు. ఒకప్పుడు విదేశాల నుండి వచ్చే శ్రామికులను అక్కున చేర్చుకొని వారి చెమట కష్టంతో ఇంత అభివృద్ధిని సాధించిన గల్ఫ్ దేశాలు ప్రస్తుతం కఠిన నిబంధనలు పెట్టి భారత కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రమాదవశాత్తు అక్కడ మరణించిన వారి శవాలను కూడా కొన్నిసార్లు స్వదేశానికి తీసుకురావడం కష్టంగా మారుతుంది. గల్ఫ్ దేశాల చట్టాల పైన అవగాహన లేకపోవడం వల్ల ఇక్కడి నుండి వలస వెళ్లిన కార్మికులు అక్కడ ఏ చిన్న తప్పు చేసినా ఏళ్ల తరబడి జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరికి కనీస న్యాయ సలహాలు కూడా లభించడం లేదు. దీంతో ఇక్కడున్న వారి కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురవుతున్నారు. భారతదేశం దాదాపు 40 పైగా విదేశాలతో ఖైదీల బదిలీ ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల విదేశాలలో జైలు శిక్ష పడినటువంటి ఖైదీలకు అక్కడికి బదులుగా భారత దేశ జైల్లోనే శిక్షను అమలు చేయవచ్చు. కానీ ప్రభుత్వాలు ఆ వైపున అడుగులు వేయడం లేదు. చేసిన నేరాలకై భారీ స్థాయి జరిమానాలు కూడా చెల్లించిన సందర్భాలూ ఉన్నాయి.
ఎన్నికల్లో వీరి ప్రభావం..
అయితే వారు పనిచేస్తున్న సమయంలో గానీ లేదా ఇతరత్రా కారణాలతో వారికి ఏదైనా అపాయం కలిగితే వారికి బీమా సౌకర్యం కూడా ఉండదు. అందుకే ఉద్యమ సమయంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్నారై పాలసీని రూపొందిస్తామని ప్రకటించింది. అలాగే వారి సంక్షేమం కోసం బడ్జెట్లో కొన్ని నిధులను కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. అయితే ప్రత్యేక తెలంగాణ వస్తే వలసలు ఆగిపోతాయనుకున్న సగటు తెలంగాణ వ్యక్తి ఆశలు నెరవేరలేదు. ఉద్యమ సమయంలో వలసలు తగ్గిస్తామని ఉపాధి కల్పిస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు వలసల గురించి పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021 సంవత్సరంలో 4375 మంది కార్మికులు ఇక్కడి నుండి గల్ఫ్ దేశాలకు వెళ్ళగా, 2022 సంవత్సరంలో 9576కు పెరిగింది. రాష్ట్రావిర్భావం తర్వాత ఎడారి దేశాలకు వలసలు తగ్గాల్సింది పోయి నాటి నాటికి పెరుగుతూ పోతోంది. తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం, తెలంగాణ ఏర్పడిన కొత్తలో కేసీఆర్ రూ. 500 కోట్లతో గల్ఫ్ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని పలుమార్లు వెల్లడించారు. అయినప్పటికీ ఆ దిశగా చర్యలకు ఉపక్రమించలేదు. దీంతో ప్రభుత్వ మొండి వైఖరితో ఓపిక నశించినటువంటి కార్మికులు, గల్ఫ్ కార్మికుల సంక్షేమ సంస్థలకు చెందిన పలువురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. వీరి ప్రభావం దాదాపు రాష్ట్రంలోని 40 నియోజకవర్గాల్లో ఉంటుంది.
నేరడిగొండ సచిన్
ఎం.ఏ జర్నలిజం
87907 47628