సైన్ లాంగ్వేజ్ అభివృద్ధి ఎప్పుడు?

by Ravi |   ( Updated:2023-09-21 23:45:54.0  )
సైన్ లాంగ్వేజ్ అభివృద్ధి ఎప్పుడు?
X

జాతీయ అంతర్జాతీయ నాయకులచే సంకేత భాషల వాడకాన్ని, ప్రతిదేశంలోని బధిరులను ప్రోత్సహించడం, బధిరుల హక్కులను గుర్తించేందుకు 2018 నుంచి సెప్టెంబర్ 23న అంతర్జాతీయ సంకేత భాష లేదా సైగల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం సెప్టెంబర్‌ 23ను అంతర్జాతీయ సైన్‌ లాంగ్వేజ్‌ దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 70 మిలియన్ల బధిరులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 135 జాతీయ సంఘాల సమాఖ్య (డబ్ల్యు ఎఫ్‌) 1951 సెప్టెంబర్‌ 23న ఏర్పడింది. దీనికి గుర్తింపుగానే సెప్టెంబర్‌ 23ను అంతర్జాతీయ బధిరుల దినోత్సవంగా కూడా పిలుస్తారు. వీరి ప్రాముఖ్యత, ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23-29 వరకు సంకేత భాషల వారోత్సవాలు జరుపుకుంటారు.

మేం తక్కువ కాదంటూ..

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 72 మిలియన్ల బధిరులు ఉన్నారు. వీరిలో 80 శాతం మంది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నారు. అంతర్జాతీయంగా 300 కంటే ఎక్కువ మంది సైన్‌ లాంగ్వేజ్‌లు ఉన్నాయి. కానీ కేవలం 2 శాతం మంది సైన్‌ లాంగ్వేజ్‌ ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో బధిరులు సైతం సకలాంగులతో సమానంగా పోటీ పడుతున్నారు. ఒకప్పుడు సమాజంలో చులకనగా, హేళనగా చూడబడిన చెవిటివారు ప్రస్తుతం అంతర్జాతీయంగా వినికిడి విజ్ఞానం అభివృద్ధి కావడంతో అన్ని రంగాల్లో తామేమీ తక్కువ కాదంటూ దూసుకెళ్తున్నారు.

రష్యాలో మొదటిసారిగా 1802లో జార్ చక్రవర్తి అలెగ్జాండర్‌ చెవిటి, మూగ వారి కోసం ప్రత్యేక పాఠశాలను ప్రారంభించారు. ఫ్రాన్స్‌, రష్యా, ఐరోపా లాంటి దేశాలు ప్రత్యేక విద్యను ఒక వ్యవస్థగా అభివృద్ధి చేశాయి. రష్యాలో అనేక పాఠశాలల్లో వినికిడి సమస్య ఉన్న పిల్లలతో పాటు వారి తల్లిదండ్రుల్ని కూడా తరగతులకు అనుమతించేవారు. సోవియట్ యూనియన్‌లో పుట్టిన ప్రతిమూగ, చెవిటి వ్యక్తిని సంరక్షించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా సోవియట్‌ రష్యా బధిరుల విద్యా అభివృద్ధి కోసం కృషి చేస్తూ వచ్చింది. అలాగే చెవిటి పిల్లల విద్యాభివృద్ధి కోసం సాధారణ విద్యాసంస్థల్లో ప్రత్యేక సామర్థ్యం కల్గిన ఉపాధ్యాయులను నియమించడం, వీరి ద్వారా పిల్లల సామర్ధ్యానికి అనుగుణంగా చదవడం, రాయడం వేలిముద్రలు వినియోగించి అక్షరాలు నేర్చుకోవడం వంటివి చేస్తూ వచ్చారు. సైగల భాష అభివృద్ధి కావడం ద్వారా బధిరులు ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు.

మహిళలే ఎక్కువ..

మనదేశంలో బధిరులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయడం పట్ల నిర్లక్ష్యం ఉంది. ఇప్పటికీ అమెరికన్‌ సైన్‌ లాంగ్వేజ్‌నే మనదేశంలో వినియోగిస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాలు స్వతహాగా వారివారి దేశాల్లో జాతీయ స్థాయిలో సైన్‌ లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేస్తే 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మాత్రం అమెరికా సైన్‌ లాంగ్వేజ్‌‌పై ఆధారపడడం బధిరుల విద్య పట్ల మన పాలకులకున్న చిత్తశుద్ధికి నిదర్శనం. 2021 ఆగష్టులో మనదేశ సైన్‌ లాంగ్వేజ్‌ను అధికారికంగా గుర్తిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికైనా మన సొంత సైన్‌ లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేయడంపై పాలకులు శ్రద్దపెట్టాలి. ప్రపంచంలో అనేకదేశాలు బధిరుల కోసం ప్రాథమిక విద్య నుండి యూనివర్శిటీ వరకు సైన్‌ లాంగ్వేజ్‌లో బోధిస్తున్నారు. కానీ మనదేశంలో ప్రభుత్వ రంగంలో తగినన్ని లేవు. సాధారణ పాఠశాలల్లో ప్రత్యేక ఉపాధ్యాయులను నియమించాలని విద్యాహక్కు చట్టంలో ఉన్నప్పటికీ ఇది అమలుకు నోచుకోవడం లేదు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మన దేశంలో 10-20 శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. 50 ఏండ్లు పైబడిన వారిలో 40 శాతం, 70 ఏండ్లు పైబడిన వారిలో 70 శాతం మంది వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. జనాభాలో సగటున ప్రతి 6 మందిలో ఒక్కరికి వినికిడి లోపం ఉంది. 2050 నాటికి ప్రతి నలుగురిలో ఒక్కరికి వినికిడి సమస్య ఉండొచ్చని 2021 డబ్ల్యుహెచ్‌ ప్రకటించింది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) రిపోర్ట్ ప్రకారం పురుషుల కంటే మహిళా వికలాంగుల సంఖ్య ఎక్కువగా ఉంది. 2016 ఆర్పిడి చట్టం గుర్తించిన 21 రకాల వైకల్యాల ప్రకారం వీరి సంఖ్య రెట్టింపు అవుతుంది.

చట్టంలో ఉన్నా..అమలు కష్టమే!

2016 ఆర్‌పీడీ చట్టం ప్రకారం, సామూహిక ప్రాంతాలన్నీ మూగ, చెవిటి వారితో పాటు వికలాంగులు వినియోగించుకునే విధంగా ఉండాలని పేర్కొంది. 2015లోనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాక్సెసెబుల్‌ ఇండియా క్యాంపెయిన్‌ ద్వారా 2020 నాటికి ప్రధాన నగరాల్లో 50 శాతం అందుబాటులోకి రావాలి. దేశవ్యాప్తంగా 1182 స్థలాలు గుర్తిస్తే 482 మాత్రమే అందుబాటులోకి వచ్చినవి. బస్టాండ్‌, రైల్వే స్టేషన్స్‌, విమానశ్రయాలు ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో సైగల భాష సౌకర్యాలు అందుబాటులో ఉండాలి. కానీ ఇవేవీ అమలులో లేవు. దేశంలో వారు వినియోగించే పరికరాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్రభుత్వం వారికి ఆ పరికరాలను ఉచితంగా సరఫరా చేయాలి. వినికిడి సమస్యను గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతిలో చికిత్స అందించాలి. దీని కోసం ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో ఆడియాలజిస్టు, స్పిచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజిస్టులను నియమించాలి. ఆడియాజిస్టు శిక్షణ కోసం ప్రత్యేకంగా కళాశాలను ఏర్పాటు చేయడం, పుట్టిన బిడ్డలకు వినికిడి పరీక్షలు చేయాలి. వినికిడి పరికరాల కొనుగొలు కోసం రీయంబర్స్మెంట్‌ సౌకర్యం కల్పించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పరికరాలు వాడేందుకు దోహదపడుతుంది. వినికిడి సమస్య ఉన్న వారికి క్లియర్‌ ఇంప్లాంట్‌ చికిత్స ఉచితంగా చేయాలి. తీవ్రతను బట్టి ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకోసం వీరు ప్రభుత్వాలపై పోరాడి హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉంది.

(రేపు అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ దినోత్సవం)

- యం. అడివయ్య

ఎన్‌పిఆర్‌డి జాతీయ ఉపాధ్యక్షులు

94900 98713

Advertisement

Next Story

Most Viewed