- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Singareni: సింగరేణికి ఏమైంది?
తెలంగాణకు తలమానికమైన సింగరేణిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని(టీబీజీకెఎస్) ముఖ్యమంత్రి కుమార్తె కె. కవిత గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఆ సంఘాన్ని గెలిపించుకోవడానికి అనేక హామీలు ఇచ్చారు. ఈ హామీల్లో భాగంగా కార్మికుడి కాలికి గుచ్చిన ముల్లును మునిపంటితో పీకిస్తానన్నాడు. ముఖ్యమంత్రి కూతురే ఈ సంఘం అధ్యక్షురాలు కావడంతో తమ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని భావించిన కార్మికుల ఆశ అడియాస అయింది. అధికారిక లెక్కల ప్రకారం 2014 మార్చి 31న సింగరేణిలో 61,778 మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేయగా, 2023 మార్చి 31 నాటికి 42,733 మందికి తగ్గించివేశారు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గాయి. గతంలో వాల్ పోస్టర్ వేస్తే పరిష్కారం అయ్యే సమస్య.. నేడు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కార్మిక సమస్యలు పేరుకుపోతున్నవి.
ఎవరు చెప్పినా పట్టించుకోరా?
చిరంచెట్టి కనకయ్య అనే కార్మికుడు 36 సంవత్సరాలు హెచ్ ఓవర్ మాన్‌గా శ్రీరాంపుర్ డివిజన్‌లోని ఆర్కే-6 మైన్‌లో 2017 ఏప్రిల్ 30న పదవి విరమణను పొందాడు. అప్పటికి నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ ఒప్పందం-10 అమలు కానందున ఒప్పందం-09 ప్రకారం నెలకు రూ.15,798 పెన్షన్ పొందుతున్నాడు. రిటైర్డ్ అయిన 6 నెలల తర్వాత, నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ ఒప్పందం-10 ఒప్పందమై బ్యాక్ డేట్ 2016 జులై నుండి అమలులోకి వచ్చింది. ఈ లెక్కన ఆయనకు 75 నెలల పునరుద్ధరణ, పెన్షన్ బకాయిలను, 10 నెలలు పెరిగిన వేతన బకాయిలను కనకయ్యకు చెల్లించాలి. కానీ ఆర్కే-6 మైన్ కాలరీ మేనేజర్, శ్రీరాంపూర్ డివిజన్ జనరల్ మేనేజర్, కోల్ మైన్స్ పీఎఫ్ రీజనల్ కమీషనర్‌లు అలసత్వంగా వ్యవహరించడంతో రిటైర్డ్ అయి ఆరు సంవత్సరాలు గడిచినప్పటికీ బకాయిలు చెల్లించలేదు. దీనిపై ఎన్ని వినతులు పెట్టిన పట్టించుకోలేదు. చివరకు సమాచార హక్కు చట్టం ప్రకారం వేతన బకాయిల సమాచారం ఇవ్వాలని అడిగితే, సీఎంపీఎస్ ప్రీమియంల వివి స్టేట్‌మెంటును పంపితే బకాయిలు చెల్లిస్తామని తెలిపారు. అయితే దీనిపై సింగరేణి అధికారులు సమాచారం ఇవ్వకుండా దాటవేసే ధోరణిని అవలంబించారు. దీనిపై రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఫిర్యాదు చేసిన వినడం లేదు.
చివరి ప్రయత్నంగా గవర్నర్‌కు లేఖ రాయగా, ఆమె సింగరేణి అధికారులకి కనకయ్యకు కావాల్సిన సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశించారు కానీ సింగరేణి అధికారుల నుండి కనీస స్పందన లేదు. సింగరేణిలో 36 సంవత్సరాలు ఉద్యోగం చేసిన కనకయ్యకు ఇలా జరగడం దురదృష్టం కాదు. ఇది స్వరాష్ట్ర తెలంగాణలో అధికారుల, ప్రభుత్వ యంత్రాంగం పనితీరుకు అద్దం పడుతోంది. రిటైర్డ్ అయిన సాధారణ కార్మికుడు తన పెన్షన్, వేతన బకాయిలు చెల్లించాలని చెప్పులు అరిగేట్లు తిరిగినా సమస్య పరిష్కారం కాలేదంటే రాష్ట్ర ప్రభుత్వ పాలనలో లోపం ఎక్కడున్నట్టు. ఇదేనా సింగరేణి కార్మికుడి కాలుకు గుచ్చిన ముల్లును మునిపంటితో పీకించడం. ఇదేనా ఎల్లవేళలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి భరోసా ఇవ్వడం! ఇప్పటికైనా స్వయాన చొరవ చూపి కనకయ్యకు పెన్షన్, వేతన బకాయిలు ఇప్పించాలని కార్మికులు కోరుతున్నారు.
మేరుగు రాజయ్య,
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్
94414 40791