ఇక్కడి శత్రువులతో పోరాడలేకపోతున్నాం!

by Ravi |   ( Updated:2024-04-18 11:14:26.0  )
ఇక్కడి శత్రువులతో పోరాడలేకపోతున్నాం!
X

భారత ప్రభుత్వానికి చెందిన మినిస్టర్ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ న్యూఢిల్లీ ఆఫీస్ వారి మెమోరాండం నంబర్ 150152882 Esst (D), తేదీ 12.02.1986 ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో G.O.Ms.No.57 తేదీ 13.03.2001 మాజీ సైనికుల ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హత, క్వాలిఫై మార్కులలో సడలింపులు ఇవ్వడం జరిగింది.

అయితే, నీళ్లు - నిధులు - నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మాజీ సైనికులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సీలో గత పదేళ్లుగా అన్యాయం జరుగుతోంది. న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కడం లేదు దానికి కారణం తెలంగాణ రాష్ట్ర సైనిక సంక్షేమ కార్యాలయం డైరెక్టర్ మరియు ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. టీఎస్‌పీఎస్సీలో మాజీ సైనికులకు కేటాయించిన పోస్టులలో GO- 57 ప్రకారం లోయర్ స్టాండర్డ్ సెలెక్షన్ అమలు చేయమని మాజీ సైనికుడు రాజేశం హైకోర్టును రిట్ పిటిషన్ ద్వారా ఆశ్రయించారు. కానీ క్వాలిఫై మార్కుల విషయంలో మాజీ సైనికుల సంక్షేమ అధికారి బాధ్యతగా సమాధానం రాయాల్సిన డైరెక్టర్, సోమాజిగూడ రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై జీవో 57 విషయంపై తన సమాధానంతో అటు ప్రభుత్వాన్ని ఇటు కోర్టును తప్పుదోవ పట్టించి కేసు నీరుగార్చెలా చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం 2022 ఏప్రిల్ లో మాజీ సైనికులకు క్వాలిఫై మార్కులు 40% విధిస్తూ G.O. 55 అమలులోకి తెచ్చింది. ఈ జీవో వల్ల మాజీ సైనికుల క్వాలిఫై మార్కుల విషయంలో అన్యాయం జరుగుతుందని గమనించి మరో సైనికుడు విజయ్ కుమార్ రిట్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించారు. మళ్లీ అదే విధంగా డైరెక్టర్ తన సమాధానంతో కేసును నీరు గార్చేలా చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇప్పటివరకు హైకోర్టులో ఈ కేసుకు కౌంటర్ ఫైల్ చేయలేదు.

చెల్లుబాటు కాని అభ్యర్థన

ఆ తరువాత 2022 డిసెంబర్‌లో గ్రూప్ -4 నోటిఫికేషన్ విడుదల చేయడం మాజీ సైనికులకు 2% రిజర్వేషన్‌తో 194 పోస్టులు, జీవో 55 ప్రకారం 40 శాతం క్వాలిఫై మార్కులతో జనరల్ కేటగిరీలో కేటాయించడం జరిగింది. గ్రూపులో 40% క్వాలిఫై వలన పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని GO 55 ని సవరించాలని 12 మంది మాజీ సైనికులు హైకోర్టును రిట్ పిటిషన్ ద్వారా ఆశ్రయిస్తే మళ్లీ ఇదే డైరెక్టర్, తన తప్పుడు సమాధానంతో అటు హైకోర్టును ఇటును ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి మాజీ సైనికుల అభ్యర్థనను ప్రభుత్వం తిరస్కరించేలా చేశాడు. గ్రూప్-4 మాజీ సైనికులకు ఉద్దేశించిన 194 పోస్టులలో 40% క్వాలిఫై మార్కులతో కేవలం 115 పోస్టులకు మాత్రమే అర్హత పొందారు మిగతా 79 పోస్టులలో 30% మార్కులతో అర్హత పొందారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరల 18 మంది మాజీ సైనికులు రిట్ పిటిషన్స్ ద్వారా న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు.

సరిహద్దుల్లో పోరాడతాం కానీ...

కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న G.O.57ను ప్రభుత్వం అమలు చేయమని డైరెక్టర్ రీజనల్ సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఏ రోజు ప్రభుత్వానికి డైరెక్ట్‌గా ఉత్తరం రాసింది లేదు. ఈ జీవో అమలు జరిగితే గత సంవత్సరాలుగా ఇంతమంది మాజీ సైనికులు హైకోర్టును ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. సైనికులు బార్డర్లో శత్రు దేశాలతో పోరాడుతున్నారు కానీ లోపలి శత్రువులతో పోరాడలేక పోతున్నారు. రక్షణ శాఖ ఉత్తర్వుల ప్రకారం డైరెక్టర్ పదవి కాలం ఐదు సంవత్సరాలు కానీ గత పదేళ్లుగా పదవిలో కొనసాగుతున్నాడు. తన పదవీకాలం పొడిగింపు మీద ఉన్న శ్రద్ధ మాజీ సైనికుల ఉద్యోగాల మీద లేదు. దేశ సేవ చేసి పదవీ విరమణ పొందిన మాజీ సైనికులు గౌరవంగా ప్రభుత్వ ఉద్యోగం చేయాల్సిన వారిని ప్రైవేట్ కంపెనీలలో సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తున్నారు.

-బందెల సురేందర్ రెడ్డి,

మాజీ సైనికుడు

83749 72210

Advertisement

Next Story

Most Viewed