పెను సవాల్‌గా మారుతున్న మతిమరుపు...

by Ravi |   ( Updated:2023-09-21 00:31:02.0  )
పెను సవాల్‌గా మారుతున్న మతిమరుపు...
X

మీరు వస్తువులను మరిచిపోతున్నారా? అయితే మీకు ఈ జబ్బు ఉండొచ్చు... అరే, బైక్ కీ ఇక్కడే ఎక్కడో పెట్టానే...ఎక్కడుందబ్బా అంటూ పలుమార్లు వెతుక్కోవడం, చివరకు బాగా తెలిసిన వ్యక్తి నైనా ‘మనం ఇంతకు ముందు ఎక్కడో కలిసినట్టున్నాం. ఎక్కడో గుర్తుకు రావట్లేదని’ ఆగమాగం కావటం చాలామందికి అనుభవమే. ఒక్కోసారి సొంత కుటుంబ సభ్యులను గుర్తు పట్టకపోవటం, వాళ్ళనే మీరు ఎవ్వరని ఖరాఖండిగా అడగడం వంటి చర్యలతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం. ప్రతి ఒక్కరిలో వయస్సు పెరిగే కొద్దీ మెదడులోని కొన్ని న్యూరాన్‌లను కచ్ఛితంగా కోల్పోతారు. అలా ఎక్కువగా కోల్పోయినవారు 'అల్జీమర్స్' అనే మతిమరుపు వ్యాధికి గురవుతారు.

ఈ జబ్బు బారిన పడ్డ వారు మతి మరుపు మూలాన దిక్కులను మరవడంతో దారి తప్పిపోతారు. పునరావృతమయ్యే ప్రశ్నలు అడుగుతారు. తెలిసిన వస్తువులను సూచించడానికి అసాధారణ పదాలను ఉపయోగిస్తారు. తెలిసిన పనులూ చేయలేరు. మాట్లాడటానికి పదాలు వెతుకుతారు. సమయం, ప్రదేశాలను మరిచిపోతారు. ఆలోచనలో సమస్యలు, ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఉద్వేగభరితంగా వ్యవహరిస్తారు. ఇతరుల భావాలను పట్టించుకోరు. మెదడులోని ఉండే న్యూరాన్లు లేదా నరాల కణాలు సరిగ్గా పని చేయడం తగ్గి పోవటం లేదా ఆగిపోవడంతో మతిమరుపు సంకేతాలు, లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధిని 1901లో గుర్తించారు. మతిమరుపు వ్యాధి గురించి అవగాహన కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 21న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాధారణంగా అల్జీమర్స్​కేసులు 60-65 సంవత్సరాలు దాటినా వారిలోనే ఎక్కువ. అయితే ఈ మధ్య 40-50 యేళ్లు దాటిన వాళ్లలోనూ ఈ లక్షణాలు కనబడుతున్నాయి. ముసలివారవుతున్న కొద్దీ వ్యాధి వచ్చే అవకాశం మరింత పెరుగుతుంది. 65+ వయస్సు వద్ద సుమారు 15 మందిలో ఒక్కరికి, 85 ఆపై వయస్సున్న వారిలో ముగ్గురిలో ఒక్కరికీ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని కుటుంబాలు ఈ వ్యాధిని సంక్రమింపజేసే ప్రమాదాన్ని కల్పించే జన్యువులను కలిగి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మగవారి కంటే ఆడవారిలో అల్జీమర్స్​కేసులు రెండు శాతం ఎక్కువగా ఉంటున్నాయి.

ప్రతి 3.2 సెకండ్లకు ఒకరికి...

2020లో ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్‌లకు పైగా ప్రజలు మతిమరుపుతో జీవిస్తున్నారని తేలింది. ఈ సంఖ్య ప్రతి 20 సంవత్సరాలకోసారి రెట్టింపు అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా యేటా 10 మిలియన్‌లకు పైగా మతిమరుపు కేసులు నమోదవుతున్నాయి. ఈ లెక్కన ప్రతి 3.2 సెకన్లకు ఒక కొత్త కేసు నమోదవుతుంది. 2030లో 78 మిలియన్‌లకు, 2050లో 139 మిలియన్‌లకు చేరుకుంటుందనీ అంచనా. ఈ పెరుగుదల అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే డిమెన్షియాతో బాధపడుతున్న వారిలో 60 శాతం మంది అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు. 2050 నాటికి ఇది 71 శాతానికి పెరుగుతుందని అంటున్నారు.

మతిమరుపునకు కారణాలు..

వయసు పెరగడంతో బ్రెయిన్‌లోని న్యూరాన్ల సంఖ్య తగ్గి, పనితనం మందగించడమే అల్జీమర్స్‌కు​ప్రధాన కారణం. విపరీత ఒత్తిడి, నిద్రలేమి, జీవన విధానంలో అనూహ్య మార్పులు, విటమిన్స్ బి1, బి12, బి6 లోపం, ట్రాఫిక్​సౌండ్, అనువంశికత వలన న్యూరాన్లు క్షీణించి ఈ వ్యాధి ఎక్కువ మందికి వస్తుంది. డిప్రెషన్, మూడీగా ఉండడం, అలోచనలు, ప్రవర్తనలో మార్పులు కూడా అల్జీమర్స్​లక్షణాలే, అలాగే ఆల్కహాల్, డ్రగ్స్​, పొగతాగే అలవాటు, గుండె జబ్బులు, పక్షవాతం ఉన్నవారికి చిన్న రక్తనాళాలు బ్లాక్ అవడం మూలాన ఈ వ్యాధి వస్తుంది. దీన్ని 'వాస్క్యులార్​డిమెన్షియా'గా పిలుస్తుంటారు. అలాగే బ్రెయిన్​ట్యూమర్స్, థైరాయిడ్ లోపం, డౌన్స్ సిండ్రోమ్, మెదడుకు గాయాలు, ఇన్ఫెక్షన్లు, కొన్ని మందుల అతి వాడకం అలవాటు ఉన్నవారిలోనూ అల్జీమర్స్ సంకేతాలు​లక్షణాలు కనిపిస్తాయి. పట్టించుకోకపోతే, ట్రీట్‌మెంట్ ఆలస్యం అయితే నయమయే అవకాశాలు దెబ్బతింటాయి.

అంతా మెదడులోనే

మెదడులో 'ఎసిటైల్ కొలిన్'లాంటి న్యూరో కెమికల్స్ తగ్గుతూ ఉంటే జ్ఞాపక శక్తి, స్పష్టంగా ఆలోచించే సమర్థతలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. సెరిబ్రో స్పయినల్ ఫ్లూయిడ్ ( CSF ) శాతం పెరగడం వలన మెదడు పరిమాణం 25 శాతం పైగా తగ్గుతుంది. నీటి శాతం పెరుగుతుంది. ఆమలాయిడ్ అనే ప్రొటీన్‌లు పెరగడంతో క్లాట్స్ ఏర్పడతాయి. టౌ ప్రొటీన్‌లు పెరిగితే 'ట్యాంగిల్స్' వస్తాయి. శరీర భాగాలకు సిగ్నల్స్​అందవు. మూత్రం కంట్రోల్‌లో ఉండదు. నడకలో తేడా వస్తుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. మనుషులను, వస్తువులను గుర్తు పట్టలేరు. పునరావృతమయ్యే ప్రశ్నలు, తెలిసిన పనులూ చేయలేకపోవడం, ప్రదేశాలను మరిచిపోవడం, ప్రవర్తనలో మార్పులు రావడం, ఉద్వేగభరితంగా వ్యవహరించడం వంటివి చేస్తుంటారు. ఇతరుల భావాలు పట్టించుకోరు. ఇక తీవ్రస్థాయి అల్జీమర్స్‌లో నడవడం, కూర్చోవడం, తినడం కూడా కష్టమవుతుంది. సొంతంగా పనులు చేసుకోలేరు. ఇతరుల మీద ఆధారపడతారు. ఒక్కోసారి శరీరంలోని అన్ని వ్యవస్థలు పనిచేయకపోవడంతో చనిపోయే ఆస్కారం కూడా ఉంటుంది, ఈ వ్యాధి ఉన్నవారి కుటుంబ వార్షిక ఖర్చు వ్యాధి తీవ్రతను బట్టి సుమారు రెండు లక్షల దాకా ఉంటుంది.

ఇలా చెస్తే... కొంత బెటర్..

ఆరోగ్యకర జీవన శైలితో ఈ వ్యాధిని కొంత వరకు జయించవచ్చు. 60 యేండ్లు దాటాక మానసికంగా యాక్టివ్‌గా ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకర సంతులిత ఆహారం తీసుకోవాలి. సుఖనిద్ర, ఒత్తిడి లేకుండా పనులను చక్కబెట్టుకోగలగాలి. మంచి మానవ సంబంధాలను కలిగి ఉండాలి. ఏదో ఒక పని కల్పించుకోవాలి. మ్యూజిక్, బుక్ రీడింగ్, పజిల్స్​వంటివి మెదడుని యాక్టివ్‌గా ఉంచుతాయి. ముదురు రంగు పండ్లు ఎక్కువ తినాలి. ఆలివ్​ఆయిల్, నట్స్, అవకాడో, అప్రికాట్‌, బెర్రీలు, యాపిల్, బీన్స్​ డైట్‌లో ఉండాలి. కూరగాయలు, గింజలు, పొట్టు తీయని ధాన్యాలు, చేపలు, కోడిగుడ్డు ఎక్కువగా తినాలి. పసుపు, నల్ల మిరియాలు, నెయ్యి వంటివి కూడా అల్జీమర్స్‌ను తగ్గించే పదార్థాలే. మాంసం, ఫాస్ట్, ప్యాకేజ్‌డ్, షుగర్ ఫుడ్ వీలయినంతగా తగ్గించాలి. వైట్ షుగర్, వైట్ బ్రెడ్, సాల్ట్ చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, జంక్​ఫుడ్, పేస్ట్రీలు, ప్రాసెస్డ్​ మీట్ తక్కువగా తినాలి. బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవాలి. ప్రస్తుతం కొలినేస్టరేజ్ నిరోధకాలు. మేమంటిన్ లాంటివి, ఈ మధ్య 'అడుకానుమాబ్' అనే ఔషధం అల్జీమర్స్ వ్యాధిని సమర్థంగా అరికట్టగలదని బ్రిటిష్ వైద్య నిపుణులు చెబుతున్నారు. మందులతో చికిత్సతో పాటు మతిమరుపుతో బాధపడుతున్నవారికి కుటుంబ సభ్యులు అతి ముఖ్యమని మరిచిపోవద్దు... వాళ్ల జబ్బును అర్థం చేసుకోవడమే కాదు.. సహకరించడం కూడా మరవద్దు.. అదే అసలు సిసలైన వైద్య విధానం కూడా సుమా!

(నేడు ప్రపంచ అల్జీమర్స్ డే)

డా.బి.కేశవులు

ఎండీ. న్యూరో- సైకియాట్రీ,

విశ్రాంత సహాయ ఆచార్యులు, ఎర్రగడ్డ ఆసుపత్రి

85010 61659

Advertisement

Next Story

Most Viewed