నోటుకు ఓటు అవినీతికి లైసెన్సే

by Ravi |   ( Updated:2022-12-19 19:00:15.0  )
నోటుకు ఓటు అవినీతికి లైసెన్సే
X

గతంలో ఎమ్యెల్యేలలో చాలామందికి సొంత కార్లు కూడా ఉండేవి కావు.. వారు తరచూ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేవారు. సాధారణ హోటళ్లలో, ప్రభుత్వ అతిథి గృహాలలో బస చేసేవారు. ఇప్పుడు అలాంటి వారు మనకు కనిపిస్తారా? ఎన్నికైన తర్వాత ప్రజలకు ఎంతమంది అందుబాటులో ఉంటున్నారు? మంచిచెడులు చెప్పుకొని తగు సహాయం పొందే సౌలభ్యం ఎంతమంది వద్ద లభిస్తున్నది? ముడుపులు చెల్లించనిదే ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా పనులు జరుగుతున్నాయా? ఓట్ల కోసం డబ్బు ఖర్చుపెట్టే వారిని ఓడిస్తాం అంటూ ప్రజానీకం ధైర్యంగా ప్రకటించాలి. తమవద్దకు నోట్లతో వచ్చేవారిని పోలీస్‌లకు పట్టిస్తామని హెచ్చరించాలి. ఆ విధమైన చైతన్యం సాధారణ ప్రజలలో తీసుకు రాగలిగినప్పుడే మన ప్రజాస్వామ్యం ఫలవంతం కాగలదు. పేదలకు మేలు చేసే పాలనను పొందగలము.

దేశంలో ఇప్పుడు రాజకీయాలు ఒక వ్యాపారం కావడంతో, ప్రజాస్వామ్యంలో ఎన్నికల అర్థమే మారిపోయింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికలలో పోటీ చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని పెద్ద మొత్తంలో సర్దుబాటు చేసుకొని బరిలోకి దిగాల్సి వస్తోంది. ప్రజాసేవ కంటే ఆర్థికంగా బలంగా ఉండడమే ప్రధాన అర్హతగా మారిపోవడం శోచనీయం. ఎన్నికలలో చేయాల్సిన ఖర్చుపై ఎన్నికల సంఘం నిబంధనలకు క్షేత్రస్థాయిలో పెట్టే ఖర్చులకు ఏ మాత్రం పొంతనుండడం లేదు. 2018 తెలంగాణ, 2019 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీలు, అభ్యర్థులు పెట్టిన ఖర్చులను పరిశీలిస్తే ఇక సామాన్య నేతలకు ఎన్నికలలో పోటీ ఒక కలగానే మిగిలిపోతోంది.

తెలంగాణలో హుజూర్‌నగర్‌, దుబ్బాక, నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ప్రజా సమస్యలను అటకెక్కించి గెలుపే లక్ష్యంగా విచ్చలవిడిగా ఖర్చు పెట్టారు. తెలుగు రాష్ట్రాలలో డబ్బుతో ఎన్నికలను గెలవడం అనే ప్రక్రియకు చంద్రబాబే తెరలేపారని రాజకీయ మేధావులు, విశ్లేషకులు చెబుతుంటారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ఒక్కో అభ్యర్థికి పది కోట్ల రూపాయలు ఇచ్చిందని పార్టీ వర్గాలే చెప్పుకున్నాయి. ఏపీలో జగన్‌ కూడా పార్టీ తరఫున ఒక్కో స్థానానికి రూ.20 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. ఇక అభ్యర్థులు పెట్టుకునే ఖర్చులు వీటికి అదనం.

గెలుపే లక్ష్యంగా తాయిలాలు

ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీలు కలిపి వెయ్యి కోట్లకు పైగా ఖర్చు పెట్టారనే అంచనాలు వచ్చాయి. ఒక్కో ఓటుకు ఐదు నుంచి పది వేలకు పైగా నగదు, కొన్ని చోట్ల తులం బంగారం పంపిణీ చేశారు. మద్యం ఏరులై పారింది. అధికార పార్టీ తాయిలాల పంపిణీ కోసం అధికారాన్ని దుర్వినియోగ పరిచిందనే ఆరోపణలు వెలువడ్డాయి. తాయిలాలు అందలేదని కొన్ని చోట్ల ఓటర్లు ధర్నాకు దిగడం, నాయకులను నిలదీయడం ప్రజాస్వామ్యం దారితప్పిన తీరుకు పరాకాష్ట. ఎన్నికల చివరి నిమిషం వరకు ఇదే ధోరణి కొనసాగింది. డబ్బులిచ్చాకనే ఓటు వేస్తామని కొన్ని చోట్ల ఓటర్లు భీష్మించడంతో అప్పటికప్పుడు నగదు పంపిణీ జరిగింది. ఒకవైపు ఓటింగ్‌ జరుగుతుంటే మరోవైపు నగదు పంపిణీ జరిపారు. అందుకే రాత్రి తొమ్మిది గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగిందనేది బహిరంగ రహస్యమే. దీనికి ముందు జరిగిన హుజూరాబాద్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ దాదాపు 400 కోట్ల వరకు ఖర్చు చేసిందని ప్రచారం జరిగింది.

ఒక సామాజికవర్గం వారు తమకు ఓటు వేయరని నిర్ధారించుకున్న టీఆర్‌ఎస్‌ ఆ వర్గాన్ని మినహాయించి ఇతరులకు తాయిలాలు అందజేసింది. దీంతో ఒకే వీధిలో ఉండే ఓటర్లలో కొందరికి అంది, మరికొందరికి అందక పోవడంతో ధర్నాలు చేశారు. ఒక పార్టీ వారు అంతిచ్చారు, మీరు తక్కువిచ్చారని ఓటర్లు నాయకులను నిలదీసిన ఘటనలు చూశాం. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిధులు అందజేసింది. హుజూరాబాద్‌ ఎన్నికకు రూ.40 కోట్లు, మునుగోడు ఎన్నికకు రూ.100 కోట్లు ఇచ్చిందని ఆ పార్టీవర్గాలే చెప్పుకున్నాయి. ఈ ఖర్చుతో ఉత్తరాదిన మూడు నాలుగు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం భావించింది. ఈ పరిణామాలను చూస్తే తెలుగు రాష్ట్రాలలో రాబోయే ఎన్నికలు ఎలా ఉంటాయో ఆందోళన నెలకొంది. ఖర్చు పెట్టగలిగే వారినే బరిలోకి దింపాలని పార్టీలు యోచిస్తున్నాయంటే పరిస్థితి ఎంతకి దిగజారిందో తెలుస్తోంది.

అక్కడా, ఇక్కడ కూడా

స్థానిక ఎన్నికలలో కూడా ఓటుకు నోటు పంపిణే క్రియాశీలకంగా మారడం దురదృష్టకరం. పంచాయితీ, మండల, మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికలలో డబ్బు పంపిణీ సర్వ సాధారణంగా మారిపోయింది. ఈ ఎన్నికలలో పది లక్షలు మొదలుకొని కోటి వరకు ఖర్చు పెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా స్థానిక సంస్థల అధ్యక్ష ఎన్నికలలో ఓటర్లుగా ఉండే ఎన్నికైన ప్రతినిధులను గోవా, సిమ్లా, శ్రీలంక క్యాంపులకు, క్యాసీనోలకు తీసుకెళ్లి సరిగ్గా ఓటింగ్‌ రోజు తెచ్చారు. గెలుపునకు సరిపడా నంబర్లున్నచోట కూడా జారీపోకుండా ముందు జాగ్రత్తగా ఈ క్యాంపులు నిర్వహించారు. 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో పార్టీలు వేలం వేసినట్లు ఎవరికి డబ్బులున్నాయో వారికే టికెట్లు కేటాయించడంతో ప్రజాస్వామ్యం పరిహాసం పాలయ్యింది. సింగరేణి కాలరీస్‌ వంటి ప్రధాన ఉద్యోగ సంఘాల ఎన్నికలలోనూ డబ్బు ప్రభావం ప్రారంభం కావడం దౌర్భాగ్యమే.

నిజాయితీపరులకు చోటేది?

పార్టీ సిద్ధాంతాల పట్ల, ప్రజల పట్ల అంకితభావం గల వారిని, ప్రజాసేవలో నిబద్ధత గలవారిని కాకుండా ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉన్నవారిని మాత్రమే అభ్యర్థులుగా నిలబెడుతున్నాయి. ఏ పార్టీ తరపున అయినా అభ్యర్థిగా పోటీ చేయాలంటే బయోడేటాను కాకుండా వారి బాలన్స్‌ షీట్‌ను చూసే పరిస్థితి ఏర్పడిరది. అవినీతి పరులైన ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకులకు భారీ ఎత్తున రుణాలను ఎగొట్టిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, అడ్డదిడ్డంగా డబ్బు సంపాదించిన కాంట్రాక్టుదారులు, స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నవారు మాత్రమే ఇప్పుడు పోటీచేసేందుకు అర్హత పొందుతున్నారు. ఒకే అభ్యర్థి ప్రధాన పార్టీల చుట్టూ తిరుగుతూ ఎవ్వరు సీట్‌ ఇస్తే వారి తరపున పోటీచేయడానికి సిద్దపడటాన్ని కూడా చూస్తున్నాము. ప్రజాపోరాటాలు చేస్తూ ప్రజల మధ్య ఉండే నేతలు కాకుండా పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు బరిలోకి దిగుతున్నారంటే ఇది ఫక్తు వ్యాపార ధోరణే.

ఎన్నికల్లో ఖర్చు పెట్టిన వారు లాభాల కోసం ఎంత అవినీతికైనా పాల్పడుతారు. వీరు నిజాయతీతో ప్రజాసేవ చేస్తారా? ఖర్చు పెట్టిన డబ్బును వసూలు చేసుకొనే ప్రయత్నం చేయరా? తమ నియోజకవర్గంలో పోలీస్‌, రెవెన్యూ అధికారుల బదిలీలు, పోస్టింగులు నుంచి వివిధ అభివృద్ధి పనులకు జరిగే కాంట్రాక్టు పనులలో నిర్ధేశిత కమీషన్‌ వారి జేబుల్లోకి వెళ్తుంది. ఇదివరకటి వలే న్యాయవాదిగా, డాక్టర్‌గా, ఉపాధ్యాయుడిగా నలుగురికి సుపరిచితులైనవారు, వ్యవసాయం చేస్తూ గ్రామాలలో అందరికీ తలలో నాలుకవలె మెలిగిన మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతికి చెందినవారు ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితులే కనిపించడం లేదు. తమ కులంవారనో, మతంవారనో, ప్రాంతంవారనో, తమకు నోట్లు ఇచ్చారనో ఓట్లు వేస్తున్నంత కాలం మెరుగైన పాలన ఆశించలేము. మార్పు అన్నది ప్రజల నుంచే ప్రారంభం కావాలని, అధికార పార్టీలు మారితే ప్రయోజనం ఉండబోదని లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఏనాడో చెప్పిన మాటలు ఇక్కడ ప్రస్తావనార్హం.

పెద్దనోట్లు మాయం

తెలుగు రాష్ట్రాలలో బ్యాంకులలో, ఏటీఎంలలో నగదు లభించడం లేదంటే రాబోయే ఎన్నికలలో ఖర్చు పెట్టడం కోసం ఇక్కడి రాజకీయ నాయకులు నగదును రహస్య స్థావరాలకు తరలించారని, అందుకే నగదు అందుబాటులో ఉండడం లేదని ఒక సందర్భంలో కేంద్రమంత్రి చెప్పడం ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు రెండు వేల రూపాయల నోటు బహిరంగ మార్కెట్లో, బ్యాంకుల్లో, ఏటిఎమ్‌ కేంద్రాలలో కనిపించడం లేదంటే, ఈ నోట్లను రాజకీయ నాయకులు బ్లాక్‌ చేయడమే కారణమనే అభిప్రాయం ఉంది.

ఓట్ల కోసం డబ్బు పంచే రాజకీయ నాయకులు ఎంతటి ద్రోహులో డబ్బు తీసుకొని ఓటు వేసే వారు కూడా అంతటి ద్రోహులే అని గ్రహించాలి. నోట్లకు ఓట్లు వేయడం అంటే అవినీతికి లైసెన్స్‌ ఇచ్చిన్నట్లే కాగలదు. ప్రజల సమ్మతితోనే బహిరంగంగా మన నేతలు మనలను దోచుకొంటున్నారని గ్రహించాలి. ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని, అభివృద్ధిని పట్టించుకోకుండా తమకు కమీషన్లు లభించే పనులకే ప్రాధాన్యం ఇవ్వడం, అంచనాలను పెంచుకొంటూ పోవడం చూస్తూనే ఉన్నాం. అధికార, ప్రతిపక్ష సభ్యులు సహితం అవినీతిలో ఎవరి వాటా వారు పొందే ప్రయత్నం చేస్తున్నారు.

గతంలో ఎమ్యెల్యేలలో చాలామందికి సొంత కార్లు కూడా ఉండేవి కావు. వారు తరచూ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించే వారు. సాధారణ హోటళ్లలో, ప్రభుత్వ అతిథి గృహాలలో బస చేసేవారు. ఇప్పుడు అలాంటి వారు మనకు కనిపిస్తారా? ఎన్నికైన తర్వాత ప్రజలకు ఎంతమంది అందుబాటులో ఉంటున్నారు? మంచిచెడులు చెప్పుకొని తగు సహాయం పొందే సౌలభ్యం ఎంతమంది వద్ద లభిస్తున్నది? ముడుపులు చెల్లించనిదే ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా పనులు జరుగుతున్నాయా? ఓట్ల కోసం డబ్బు ఖర్చుపెట్టే వారిని ఓడిస్తాం అంటూ ప్రజానీకం ధైర్యంగా ప్రకటించాలి. తమవద్దకు నోట్లతో వచ్చే వారిని పోలీస్‌లకు పట్టిస్తామని హెచ్చరించాలి. ఆ విధమైన చైతన్యం సాధారణ ప్రజలలో తీసుకు రాగలిగినప్పుడే మన ప్రజాస్వామ్యం ఫలవంతం కాగలదు. పేదలకు మేలు చేసే పాలనను పొందగలము.

అవినీతిని అంతమొందిస్తామనే నినాదంతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఆయన మీద ఇప్పటివరకు నేరుగా అవినీతి ఆరోపణలు రాలేదు. అయితే, ఆయన అవినీతి లేని ప్రభుత్వాన్ని అందించగలుగుతున్నారా అంటే నిరాశ తప్పడం లేదు. గత ఎనిమిదేళ్లలో అవినీతి పెరిగిందని ఒక సర్వేలో 65 శాతం మంది ప్రజలు పేర్కొనడం గమనార్హం. ఏసీబీ అధికారులు చిన్న చిన్న ఉద్యోగులను పట్టుకొని కేసులు నమోదు చేస్తుంటారు. భారీ స్థాయిలో అవినీతికి పాల్పడే మంత్రులు, ఎమ్యెల్యేలు, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై దాడులు చేయడం గురించి విన్నామా? ధన రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు, ప్రజలు పోరాటం చేయలేని పక్షంలో వ్యాపారవేత్తలే రాజకీయ పార్టీలను సొంతం చేసుకొనే పరిస్థితులు తొందరలోనే తటస్థ పడే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వాన్ని కార్పొరేట్‌ శక్తులు హస్తగతం చేసుకొని, తమ వ్యాపార ప్రయోజనాలకు పెద్దపీట వేసి ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశాలున్నాయి.

గోనె ప్రకాశ్‌ రావు

మాజీ ఎమ్మెల్యే

98487 66000

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672.

Advertisement

Next Story

Most Viewed