ఓటు చరిత్రను మార్చే క్రతువు

by Ravi |   ( Updated:2024-05-12 01:15:38.0  )
ఓటు చరిత్రను మార్చే క్రతువు
X

ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతంలో 17 సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఇప్పటికే అనేక మంది ఓటు హక్కు వినియోగించుకోవడంలో నిర్లిప్తత వహించడం బాధ్యతారాహిత్యమే. 50 శాతానికి పైగా యువతతో ఉత్సాహం ఉరకలేస్తున్న మన దేశంలో 100% ఓటింగ్ నమోదు కాకపోవడం ఆవేదన కలిగించే అంశం. పట్టణ ప్రాంతాల్లో కనీసం 50 శాతం కూడా ఓటింగ్ నమోదు కాకపోవడం దురదృష్టకరం. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకునేందుకు ముందుకు రావాలి.

ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తన ఓటును ప్రలోభాలకు గురి కాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలి. ప్రస్తుత ఎన్నికల సమయంలో ప్రతి పౌరుడికి ఓటు ఎంతో కీలకం. ఓటు హక్కు పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితిగతులను మార్చే శక్తి ఓటుకు ఉంది. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెంది మనం బాగు పడాలి అనే తాపత్రయం ఉండటమే కాదు... అందుకు అవసరమైన సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ పేర్కొన్నట్లుగా.... ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్నే ప్రజాస్వామ్యం అంటారు. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం, స్వేచ్ఛ, సమానత్వం, హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరం కంకణబద్దులం కావాలి. ఓటు ద్వారా మచ్చలేని వ్యక్తులను చట్టసభలకు ఎన్నుకోవటం... వారికి పరిపాలన పగ్గాలు అప్పగించటం మన చేతుల్లోనే ఉంది. ఎంతో మంది మహనీయుల త్యాగం ఫలితంగా ఏర్పడ్డ స్వంతంత్ర భారత నవ నిర్మాణం కోసం ప్రతి పౌరుడిని భాగస్వాములను చేసేందుకు ఉద్దేశించినదే ఓటు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా దేశంలోని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగం ముందు సమానమే. అందుకే భారత రాజ్యాంగం ప్రతి పౌరుడి చేతికి వజ్రాయుధం లాంటి ఓటు హక్కును కల్పించింది. తద్వారా దేశ భవిష్యత్తును మన చేతుల్లోనే పెట్టింది. కానీ మనం ఓటు హక్కును వినియోగించుకునేందుకు తటపటాయిస్తున్నాం. భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు హక్కును వినియోగించుకోవాలి.

ఓటే వజ్రాయుధం

ఇటీవలి కాలంలో రాజకీయాల్లో స్వార్థ, వ్యాపార దృక్పథం పెరిగిపోయింది. రాజకీయం లాభదాయకమైన పెట్టుబడిగా కొందరు భావిస్తున్నారు. కోట్ల రూపాయలు వెదజల్లి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గెలిచాక పది నుంచి వందరెట్లు తిరిగి సంపాదిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి వల్ల చాలా మంది తాము ఓట్లకు దూరంగా ఉంటున్నామంటున్నారు. కానీ, ఇది సరికాదు. ఓటుకు దూరంగా ఉండటం వల్లే ఇలాంటి అపసవ్య ధోరణులు పెరిగాయని గుర్తించాలి. స్వార్థ రాజకీయాలు చేసే వారిని ఓడించాలన్నా ఓటే వజ్రాయుధం అనే విషయాన్ని మరువద్దు. ప్రతి పౌరుడు దేశ ప్రయోజనాల దృష్ట్యా ఆలోచన చేయాలి. అవినీతి, స్వార్థపరులను ఓడించేందుకు నడుం కట్టాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు కోసం నోట్లను ఎరగా చూపే నాయకులను ఓడించాలి. ఓటు ద్వారా నిశ్శబ్ద యుద్ధం చేసి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయవచ్చు. సరైన నిర్ణయం ద్వారా దేశ ప్రగతికి బాటలు వేయవచ్చు.

ప్రశ్నించే హక్కు కోల్పోతున్నాం!

ప్రజాస్వామ్య భారతంలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఎంతో పవిత్రమైనది. పద్దెనిమిదేళ్ల నవయువకుడి నుంచి కాటికి కాళ్లు చాచిన ముదుసలి వరకు ఓటు హక్కు వినియోగించుకుంటేనే దానికి సార్థకత ఉంటుంది. ఓటును ఆయుధంగా వాడుకోవాల్సిన మనం, చిన్న చిన్న ప్రలోభాలకు లోనై ఓటును నిర్వీర్యం చేసుకుంటున్నాం. నోటు తీసుకుని ఓటు వేసి ప్రశ్నించే హక్కుని కోల్పోతున్నాము. డబ్బు, మద్యానికి అమ్ముడుపోయి అవినీతి కుళ్లు రాజకీయాలను మనమే ప్రోత్సహిస్తున్నాం. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా, సాంఘిక, ఆర్థిక, సమానత్వాన్ని సాధించాలన్నా, మన జీవితాలు, తలరాతలు మారాలన్నా.... అందుకు మన ఓటు ద్వారా సరైన పాలకులను ఎంచుకోవటమే మార్గం. నోటుకు ఓటును అమ్ముకోవద్దు. దేశ చరిత్రను మార్చే క్రతువులో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అలాంటి ఓటు హక్కును వినియోగించుకోవటం ద్వారా.... ప్రపంచ యవనికపై ప్రజాస్వామ్య భారత పతాకాన్ని ఎగురవేసే సైన్యంలో మనమూ ఒకరిగా నిలుద్దాం. భారత యువశక్తి సామర్థ్యాన్ని దశదిశలా చాటుదాం. స్పష్టమైన వైఖరితో భవిష్యత్తు కోసం దారులు నిర్మిద్దాం.. నవ భారత నిర్మాణంలో భాగస్వాములవుదాం.

జీవన్

ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీస్ కన్వీనర్

88850 99930

Advertisement

Next Story