AP Volunteers: వాలంటీర్ వ్యవస్థ.. రాజ్యాంగ విరుద్ధం!

by Ravi |   ( Updated:2023-07-20 00:00:16.0  )
AP Volunteers: వాలంటీర్ వ్యవస్థ.. రాజ్యాంగ విరుద్ధం!
X

రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న వాలంటీర్ వ్యవస్థ ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే కాక పంచాయతీరాజ్ చట్ట ఉల్లంఘన కూడా అవుతుంది. గత కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రం నుండి నేటి విభజన వరకు అన్ని ప్రభుత్వాలు, పార్టీలు, నాయకులు మూకుమ్మడిగా పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడంలో, ఆయా స్థానిక సంస్థలను నిర్జీవం చేయడంలో ఎవరి స్థాయిలో వారు చేసుకుంటూ వచ్చారన్నది వాస్తవం.

వారు..జవాబుదారీతనం లేని వ్యక్తులు!

అయితే ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ఇష్టపడ్డ వ్యవస్థగా చెప్పుకుంటున్న గ్రామ వాలంటీర్ వ్యవస్థతో నేడు రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ, రాజ్యాంగం కల్పించిన గ్రామసభ వ్యవస్థలు నామమాత్రంగా మారిపోయాయని చెప్పవచ్చు. 73,74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు సంక్రమించిన 29 అంశాలతోపాటు, గ్రామసభలు ద్వారా ఎంపిక కావాల్సి ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ ప్రజలచే ఎన్నిక కాబడిన పంచాయతీ పాలక వర్గాల నుండి తొలగించబడ్డాయి. అంతేకాక గ్రామంలో 29 శాఖలపై రాజ్యాంగం కల్పించిన పర్యవేక్షణ, పరిశీలన అధికారాలు నేడు పంచాయతీలు కోల్పోయాయి. నిజంగా గత రెండేళ్ల పంచాయతీల పాలనలో నిధులు లేక, విధులు లేక విధిలేని పరిస్థితుల్లో అప్పులు చేసి సర్పంచులుగా తమ విధులు అతి కష్టం మీద నడుపుకొస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, గృహ సారధులు, వార్డు కన్వీనర్లు లాంటి వ్యక్తుల సమూహం గ్రామాలలో, పంచాయతీలలో లేని అధికారాలను అనుభవిస్తూ, అనేక అవకతవకలతో పాటు, పౌరుల రహస్య వ్యక్తిగత సమాచారాలను సేకరించడంలో నిమగ్నమై పోయారు. ఈ అంశంపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశాలు వాస్తవమైనవిగా మనం భావించాలి. చట్టబద్దత లేని, జవాబుదారీతనం లేని వ్యక్తులకు ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అనేక ప్రభుత్వ బాధ్యతలు అంతా తామై గ్రామాలలో పార్టీ ప్రతినిధులుగా స్థానిక నాయకత్వంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఈ అంశాలపై స్పష్టమైన సమాధానం ఇవ్వాలి. అలా కాకుండా ప్రభుత్వ బాధ్యులు ఇష్టారీతిగా మాట్లాడుతున్న తీరు దుర్మార్గం బాధ్యతారాహిత్యం.

ఈ రాష్ట్రంలో తొంభై శాతం పైగా పాలక పార్టీ వర్గంగా ఉన్న సర్పంచులందరూ మూకుమ్మడిగా ఈ వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉండవలసిన తెలుగుదేశం ఈ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నది. దీనివలన పంచాయతీ రాజ్ వ్యవస్థపై తెలుగుదేశం వైఖరి మారదని స్పష్టం అవుతుంది. తాను గతంలో జన్మభూమి కమిటీల పేరుతో సృష్టించిన అరాచకం అనంతరం ప్రజలు ఇచ్చిన తీర్పును టీడీపీ గుర్తు చేసుకోవాలి.

చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు..

పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయకుండా, రాజ్యాంగ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలకు లేని అధికారాన్ని ఆర్డినెన్స్ రూపంలో నెట్టుకొస్తున్న ఈ వ్యవస్థ మోసపూరితమైన రాజ్యాంగ వ్యతిరేక వ్యవస్థగా మనం చెప్పుకోవాలి. ఫెడరల్ ప్రభుత్వ విధానంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో మెజారిటీ ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రిగా అనంతమైన అధికారాలను అనుభవిస్తూ, ఇంకా మరిన్ని అధికారాలు, పాలనలో స్వేచ్ఛను కోరుకుంటున్న ముఖ్యమంత్రి క్రింది స్థాయి పంచాయితీల హక్కులను, నిధులను బాధ్యతలు, అధికారాలు తన చెప్పుచేతల్లో ఉండాలనుకోవడం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంత పాలనలో ఉన్నామా అన్న ప్రశ్న నేడు ప్రజాస్వామ్య వాదులలో మొదలయ్యింది.

దశాబ్దాలుగా సర్పంచులు సంఘాలుగా ఏర్పడి అధికారాలు, హక్కుల సాధనకై కృషి చేస్తున్నా ఎలాంటి ఫలితాలు లేకపోవడం దురదృష్టకరం. తాను ప్రవేశపెట్టిన వాలంటీర్, సచివాలయం వ్యవస్థలు రాష్ట్రంలో అభాసుపాలవుతుంటే, దేశంలోనే అత్యుత్తమమైన వ్యవస్థగా గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం తీరు విడ్డూరం. వాలంటీర్, సచివాలయం వ్యవస్థలు ద్వారా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన జరిగిందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం తనదైన శైలిలో దీనికి కూడా జగనన్న గ్రామ స్వరాజ్యం అని చెప్పుకుంటే మంచిది. స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించి, స్థానిక, స్వపరిపాలన సాగిన నాడే నిజమైన గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని నేటి పాలకులు గుర్తించాలి. ఆ దిశగా అడుగులు వేసి ప్రజారంజకంగా పాలన సాగించిన నాడే ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతారని పాలకులు గుర్తించాలి.

వీరభద్రాచారి

గ్రామ స్వరాజ్య సాధన సమితి

6301 796 606

Advertisement

Next Story