- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బహుముఖీన సృజనకారుడు విశాల్ భరద్వాజ్
ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి, ఫిలిం మేకర్, సంగీత దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత, ప్లే బ్యాక్ సింగర్, నిర్మాత, కవి. ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి సినిమా ఇండస్ట్రీలో ఎవరూ ఉండకపోవచ్చు అంతటి లబ్ధ ప్రతిష్ట సాధించిన వ్యక్తి విశాల్ భరద్వాజ్. ఇవాళ ఆయన సృజన కారుడిగా భిన్న రంగాల్లో పేరు తెచ్చుకున్నాడు. ఆయన రాసిన ‘న్యూడ్’ కవితా సంకలనం ఆయన్నీ సాహితీ ప్రపంచంలో విలక్షణంగా నిలబెట్టింది. ‘కవిత్వం అంటే వ్యక్తుల వ్యక్తిగతమయిన భావ వ్యక్తీకరణ మాత్రమే’ అట్లా తమని తాము వ్యక్తపరుచుకోవడం ద్వారా కవి ఉపశమనం పొందుతాడు. అందుకే కవిత్వం అన్ని కళా రూపాల్లో ఉత్కృష్టమైనది అంటారు. ప్రతి భాషకూ తనదైన ఒక వ్యక్తీకరణ రూపం వుంటుందంటారు.
సృజనాత్మక రంగంలో స్పేస్ ఏర్పరచుకొని..
సాధారణంగా సృజనకారులు రెండు రకాలు.. కళారంగంలో వున్న భిన్న కళారూపాల నుంచి కవిత్వాన్నో, కథల్నో, నవలా రచననో, సంగీతాన్నో, పెయింటింగ్‌నో, నాటక రంగాన్నో, బాల సాహిత్యాన్నో సినిమానో తమ వ్యక్తీకరణ మాధ్యమంగా స్వీకరించి జీవితాంతం కృషి చేసేవారు, ఇంకో రకం సృజనకారులు తమ కాన్వాస్‌ని ఎదో ఒక రంగానికి పరిమితం చేయకుండా భిన్నమైన రూపాల్ని స్వీకరించి, అందులో కృషి చేసి తమ ముద్ర మిగిల్చేవారు. వీరు సృజనాత్మక రంగంలో తమకంటూ ఒక స్పేస్‌ని ఏర్పరుచుకొని, ఎందరినో ఉత్తేజితుల్ని చేస్తారు. కొత్త దారులు వేసి మరెందరికో తొవ్వ చూపుతారు. ఇలా మన దేశ సృజనకారుల విషయానికి వస్తే టాగోర్, సత్యజిత్ రే, గుల్జార్ ఇలా అనేక మంది తమ సృజనాత్మక కాన్వాస్‌ని విస్తారంగా పరుచుకుని భిన్న రంగాల్లో గొప్ప కళారూపాలను సృష్టించి, సృజనకు రూపంలో కానీ సారంలో కానీ పరిమితులు లేవని నిరూపించారు. సరిగ్గా అదే రీతిలో గత తరం అందించిన స్ఫూర్తితో కొత్త తరంలో విశాల్ భరద్వాజ్ అదే కోవకు చెందినవాడు.
‘తాను మూర్ఖుడు అన్న విషయం తెలుసుకున్న వాడే గొప్ప తెలివైన వాడు’ అని విశ్వసించే విశాల్ రాజకీయ అంశాలపైన స్పందించడం తన జీవితంలో అంతర్భాగమంటారు. నిజానికి మనిషి అన్న ప్రతివాడికి అతడు అంగీకరించినా లేకున్నా తనదయిన రాజకీయ స్వరం ఉంటుందంటాడు విశాల్ భరద్వాజ్. ఇవాళ నగరంలో నివసించే వాళ్లకు భారతీయ గ్రామీణ జీవిత భాష తెలీదు. పల్లెలోనే జీవితాలు సంక్లిష్టంగా ఉంటాయని, అసలైన దేశం అక్కడే వుందంటారు విశాల్. 1965 ఆగస్టు 4న పుట్టిన విశాల్ భరద్వాజ్ షికార్ పూర్ అనే గ్రామం నుంచి వచ్చాడు. అప్పుడు ‘ షికార్ పూర్ సే ఆయాహై’ అనే వాళ్ళు. అంటే ఆ వూరు నుంచి వచ్చిన వాళ్ళు బేవకూఫ్‌లని అర్థమని విశాల్ సరదాగా చెబుతుండేవారు. తర్వాత నజియాబాద్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం, తర్వాత 6-12 తరగతులు మీరట్ నగరంలో సాగింది. అప్పుడు మీరట్‌లో మొహల్లా దాదాలు వుండేవాళ్ళు. వీరి దగ్గర కోట్లాటలు అధికంగా జరిగేవి. అక్కడి భాష కూడా మీరట్ మాండలీకంలో సాగేది. విశాల్ తల్లి సత్యా భరద్వాజ్ గృహిణి. తండ్రి రాం భరద్వాజ్ షుగర్ కేన్ ఇన్‌స్పెక్టర్. ఆయన మంచి కవి కూడా, ఆయనకు సినిమాల్లో రాయాలని వుండేది. కొన్ని రాశారు కూడా.
క్రికెటర్ టూ కవి!
సినిమాల విషయానికి వస్తే విశాల్ చూసిన మొదటి సినిమా మొఘల్ ఎ ఆజం. చిన్నప్పటినుండీ అంతర్ముఖీనుడిగా వున్న విశాల్‌కి క్రికెట్ అంటే ఇష్టం. అండర్ 19లో కూడా ఆడాడు. ఇంకా ముందుకు ఆడేందుకు ఆయనకు జరిగిన రెండు ప్రమాదాలు, తనని అనర్హుడిగా చేసాయి. మరోసారి విశాల్ తండ్రి చనిపోవడంతో క్రికెట్‌ను తన కెరీర్‌గా చేసుకోలేకపోయాడు. విశాల్ చిన్నప్పటి నుండే సంగీత పరికరాలు మాండొలిన్, బాన్ జోలని వాయించేవాడు, విశాల్ అన్న కూడా మంచి వాయిద్య కారుడే. విశాల్ మొట్టమొదట తన మిత్రుల గజల్స్‌కి హార్మోనియం వాయించడంతో తన కెరీర్ మొదలయింది. తర్వాత ఢిల్లీలో సంగీత కంపెనీ సీబీఎస్‌లో ఉద్యోగంలో చేరాడు. తర్వాత బాంబేలో మ్యూజిక్ కంపోసర్‌గా వృత్తిని ఆరంభించాడు. మొదట ప్రచార చిత్రాలకు జింగిల్స్‌కి సంగీతం సమకూర్చాడు. తర్వాత క్రమంగా సినిమాలకు మ్యూజిక్ చేయడం మొదలు పెట్టాడు.
విశాల్ భరద్వాజ్ సంగీత దర్శకుడిగా అభయ్, ఫౌజీ, మాచిస్, లాంటి పలు సినిమాలకు పని చేసాడు. వాటిల్లో ఆయన నవ్య సంగీత రీతులని అందించారు. విశాల్ ముఖ్యంగా గుల్జార్ కవిత్వం వ్యక్తిత్వాలతో ప్రభావితం అయ్యాడు. సంగీతకారుడిగా విజయవంతంగా వున్న రోజుల్లోనే తాను దర్శకత్వం వైపు దృష్టి సారించాడు. ఆయనపై టరంటినో, కైస్లోవిస్కీ లాంటి దర్శకుల ప్రభావం స్పష్టంగా వుంది. షబానా ఆజ్మీ విశాల్‌కు ఎంతగానో సహకరించింది. ‘మఖ్డీ’ సినిమాకు ఎలాంటి పారితోషికం లేకుండానే నటించి ప్రోత్సహించింది. తర్వాత విశాల్ భరద్వాజ్ షేక్స్పియర్ రచన మాక్బెత్ చదవడంతో పాటు దాని ఆధారంగా రూపొందిన కురుసోవా ‘త్రోన్ ఆఫ్ బ్లడ్’ సినిమా చూసి విపరీతంగా ప్రభావితుడయ్యాడు. తాను కూడా మాక్బెత్‌ను ‘మక్బూల్’ సినిమాగా రూపొందించారు. తర్వాత ఒథెల్లో, హామ్లెట్‌ల ఆధారంగా ఆయన రూపొందించిన ఓంకారా, హైదర్ చిత్రాలు ఆయన్ని భారతీయ చలన చిత్ర చరిత్రలో ఉన్నత స్థానంలో నిలిపాయి.
ఆయన కవితల్లో ప్రేమ, ఆర్తితో పాటు..
దర్శకుడిగా తాను రూపొందించిన సినిమాలకు మూడు అంతర్జాతీయ అవార్డులు, ఏడు జాతీయ ఫిలిం అవార్డులు అందుకున్నారు. ఇతర చిత్రాలతో పాటు 1960, 70, 80 దశకంలో వచ్చిన సమాంతర చిత్రాల తర్వాత నూతన తరంలో ఎదిగివచ్చిన దర్శకుల్లో విశాల్ కొత్త భావాలతో కొత్త టెక్నిక్‌తో నిలబడ్డ నవ్య దర్శకుడు. ఇట్లా తన వైవిధ్య భరితమైన సృజన రంగాలతో పాటు విశాల్ భరద్వాజ్ తన కవిత్వ సంకలనం ‘న్యూడ్’ వెలువరించారు. ఇందులో 25 గజల్స్, దాదాపుగా అంతే సంఖ్యలో కవితలూ (నజ్మ్) వున్నాయి. మొదట ఈ సంకలనానికి విశాల్ ‘నేకెడ్’ అన్న పేరు పెట్టాడు. ఆ విషయాన్ని గుల్జార్ కు చెప్పగా, ఆయన దానికి ‘న్యూడ్’ అన్న పేరు సూచించాడు. విశాల్ కవితల నిండా ప్రేమ ఆర్తి, వేదన వున్నాయి వాటితో పాటు వ్యవస్థ మీద ఆయన చేసిన కామెంట్స్ కూడా అదే స్థాయిలో వున్నాయి. సరికొత్త ఇమేజరీలతో భావాలతో సాగే ఆయన కవిత్వం సూటిగా సరళంగా స్పష్టంగా ఉంది.‘ ఇది బనారస్ కాదు, ఇది ఢిల్లీ ఇక్కడ గంగ వెనక్కి ప్రవహిస్తుంది’ అంటాడు అంతేనా ‘ఎలుకలకు ఇంట్లో కాల్చిన రొట్టెలను తినిపిద్దాం, రాజకీయాలు వింతైన ఎలుకలు’ అని కూడా అంటాడు. గుల్జార్‌ని అమితంగా అభిమానించే విశాల్ కవిత్వంలో గాలిబ్ గురించి, ఓషో గురించీ కవితలున్నాయి. మొత్తం మీద గొప్ప భావుకుడయిన కవిగా విశాల్ భరద్వాజ్ తన ‘న్యూడ్’ సంకలనంతో భారతీయ సాహిత్య ప్రపంచంలో నిలబడ్డాడు. విశాల్ హిందీ కవిత్వాన్ని సుకృత పాల్ కుమార్ ఇంగ్లీష్ లోకి అంతే ప్రతిభావంతంగా అనువదించారు.
వారాల ఆనంద్
94405 01281
- Tags
- Vishal Bharadwaj