జనరంజకమైన బడ్జెట్!

by Ravi |
జనరంజకమైన బడ్జెట్!
X

ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సారి 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన- నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, ఆవిష్కరణలు, సంస్కరణలు... లాంటి తొమ్మిది అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నారు..

కేంద్ర ప్రభుత్వం వచ్చే రెండేళ్లలో కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపింది. కూరగాయల ఉత్పత్తి పెద్దఎత్తున చేపట్టేలా క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ఉద్యానవన పంటలు, కూరగాయలు పండించే రైతులకు కేంద్రం వరాలు కురిపించింది. అలాగే నాలుగు కోట్ల యువతకు ఉపాధే లక్ష్యంగా బడ్జెట్‌లో పలు బడ్జెట్‌లో పలు ప్రతిపాదనలను ప్రతిపాదించింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఈపీఎఫ్ఓ పథకం అమలు, 20 లక్షల మంది యువత కోసం సరికొత్త కార్యక్రమం ద్వారా ఉపాధి కల్పించడం లక్ష్యంగా నిర్దేశించడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ మేరకు 1000 నైపుణ్య శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు

సంకీర్ణ ప్రభుత్వం ఉండటంతో..

సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్న బిహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ సారి బడ్జెట్‌లో సముచిత కేటాయింపులు దక్కాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ప్రత్యేక సాయం. అవసరాన్ని బట్టి అమరావతికి మరిన్ని నిధులు, పోలవరానికి పెద్దపీట.. త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి, రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విశాఖ- చెన్నై కారిడార్లో కొప్పర్తికి, హైదరాబాద్- బెంగళూరు కారిడార్లో ఓర్వకల్లుకు నిధులు ఇస్తామని ప్రకటించింది. బిహార్‌లో జాతీయ రహదారులకు 20 వేల కోట్లు, వరద నివారణకు, సాగు కార్యక్రమాలకు రూ.11వేల కోట్లు కేటాయింపుని ప్రకటించింది. వరద నివారణకు అస్సాం, హిమాచల్ ప్రదేశ్‌కు ప్రత్యేక నిధులతోపాటు ఆధ్యాత్మిక టూరిజం అభివృద్ధికి పెద్దపీట వేశారు. కాశీ తరహాలో గయ అభివృద్ధి 'బిహార్ రాజిరి జైన్ ఆలయాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక, టూరిజం కేంద్రంగా నలందా అభివృద్ధి ప్రత్యేక హోదా తెరపైకి రానీకుండా రాష్ట్రాలకు లబ్ధి చేకూరే విధంగా రాబడిని పెంచుకునేందుకు పలు పథకాలకు నిధుల కేటాయింపు ఆ రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుంది.

మహిళా సాధికారత దిశగా..

ఈ బడ్జెట్‌లో కేంద్రం మహిళలకు, బాలికలకు పెద్దపీట వేసింది. వీరికి లబ్ధి చేకూరేలా ఏకంగా రూ. 3 లక్షల కోట్లు కేటాయించడం పనిచేసే మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, వర్కింగ్ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం హాస్టళ్లను ఏర్పాటు చేయనుంది. ఉపాధి, నైపుణ్యం, సూక్ష చిన్న మధ్య తరహా వ్యాపార సంస్దలతో పాటు ప్రధాన రంగాలకు ప్రాధాన్యత ఇచ్చి దేశంలోని 4.1 కోట్ల మంది యువతకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం ఈ నాలుగు రంగాలపై దృష్టి సారించనుంది.

మందుల ధరల తగ్గింపు..

మొబైల్ ఫోన్ల దిగుమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గించడం వల్ల మొబైల్ ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. ఔషధాలకు దిగుమతి సుంకం నుంచి నుంచి మినహాయింపు ఇవ్వడం ద్వారా దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు వినియోగించే మందుల ధరలు తగ్గనున్నాయి. అలాగే వైద్య పరికరాలపై దిగుమతి సుంకం తగ్గించడంతో రోగ నిర్ధారిత పరీక్షల వ్యయం తగ్గనుంది. మరోవైపు బంగారం, వెండిపై దిగు మతి సుంకం 6 శాతానికి తగ్గించడం వల్ల బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. అలాగే ఆదాయ పన్ను శ్లాబుల్లో స్వల్ప మార్పులు ప్రకటించడం వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో వేతన జీవులకు కొంత ఊరట. పర్యావరణ, శాస్త్ర సాంకేతిక రంగాల కేటాయింపులు దేశాభివృద్ధికి ఉత్ప్రేరకాలు. మిత్ర ధర్మాన్ని పాటిస్తూ, రానున్న కాలంలో దేశ పురోభివృద్ధికి కావలసిన మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ రైతన్నకు చేయూతనిస్తూ, మహిళా సాధికారత దిశగా అడుగులేస్తూ ఉపాధికి ఊతమిస్తూ పరిశ్రమలకు , కార్మి కుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్ర సాంకేతిక విద్యా వైద్య పర్యావరణ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించే విధంగా కేటాయింపులు చేస్తూ అభివృద్ధి సంక్షేమం సమతుల్యత పాటిస్తూ ప్రవేశపెట్టిన 2024-25 (8 నెలల పూర్తి) బడ్జెట్ జనరంజమనే చెప్పాలి.

- రత్నాకర్

99898 55445



Next Story