చేనేత పరిశ్రమకు దక్కని ప్రోత్సాహం!

by Ravi |   ( Updated:2024-11-19 00:45:46.0  )
చేనేత పరిశ్రమకు దక్కని ప్రోత్సాహం!
X

తెలంగాణ వస్త్ర పరిశ్రమ ప్రపంచ పోటీ మార్కెట్‌ను తట్టుకోలేని స్థితిలో ఉంది. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక నిరుద్యోగ సమస్య పెరుగుతోంది. తెలంగాణ ఏర్పడ్డ పదేళ్ల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలసీలు, ప్రోత్సాహకాలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రకటనలు, ప్రచారాలు.. పేరు గొప్ప ఊరు దిబ్బ అనడంలో అతియోశక్తి లేదు.

వరంగల్‌ జిల్లా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు, సిరిసిల్ల పవర్‌ లూమ్‌ పరిశ్రమలే ఇందుకు నిదర్శనం. గత పాలనలో చేనేత, జౌళిశాఖ, పరిశ్రమల శాఖ మంత్రిగా, సిరిసిల్ల ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన కేటీఆర్‌ హంగులు, ఆర్భాటాలు, చేసిన ప్రకటనలు, శంకుస్థాపనలు.. ఆ తర్వాత ఫలితాలు ఇవ్వలేక పోయాయి.

పేరు గొప్ప ఊరు దిబ్బగా..

2017లో వరంగల్‌ జిల్లా గీసుకొండ, సంగెం మండలంలో 1219 ఎకరాల్లో అట్టహాసంగా కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు గత గులాబీ సర్కారు శంకుస్థాపన చేసింది. రూ.11, 586 కోట్ల పెట్టుబడులతో లక్షా 13 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యం కాగా..ఏడేళ్ల కాలంలో వంద మంది స్థానికులకు కూడా ఉద్యోగాలు రాలేకపోయాయి. గణేషాయ ఇకో పిట్‌ కంపెనీ రెండు యూనిట్లు ఏర్పాటు చేసినప్పటికీ స్థానికులకు పెద్దగా ప్రయోజనం కలగలేదు. గత ప్రభుత్వ హయాంలో 22 కంపెనీలు రూ.3, 400 కోట్ల పెట్టుబడులతో 23 వేల 800 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పభుత్వంతో ఒప్పందం చేసుకున్నప్పటికీ, కార్యాచరణలో వాటిని చూపలేక పోయాయి. వరంగల్‌ ఉమ్మడి జిల్లాలో భారీగా పత్తి ఉత్పత్తి, రైలు మార్గం ఉన్నప్పటికీ పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. గత ప్రభుత్వం ఎప్పటి కప్పుడు ఆయా కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి ప్రోత్సహకాలు కల్పిస్తే పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశాలుండేవి. కానీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదనేది దీని ద్వారా స్పష్టమవుతుంది.

సిరిసిల్లలో కేటీఆర్‌ వైఫల్యం..

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం దేశవ్యాప్త చర్చగా మారింది. ఆధునిక యంత్రాల ఏర్పాటు చేయలేక, ప్రపంచ పోటీని ఎదుర్కోలేక పోవడంతో ఇక్కడి వస్త్ర పరిశ్రమ, అందులోని కార్మికులు ప్రభుత్వంపైనే ఆధారపడాల్సి వస్తోంది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఉత్పత్తి పేరుతో పది మంది పెట్టుబడి దారుల కోసం కార్మికులకు తాత్కాలిక ఉపాధి ఉపశమన చర్యలు చేపట్టినా, పవర్‌లూమ్‌ పరిశ్రమ అభివృద్ధి దిశగా ముందుకు సాగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2004లో సిరిసిల్లలో ఏర్పాటైన టెక్స్‌టైల్‌ పార్కును స్వరాష్ట్రంలో విస్తరించ లేకపోయింది. 235 ప్లాంట్ల ప్రారంభంలో 111 యూనిట్లు ఏర్పాటు చేయగా, అవి కాస్తా 30 యూనిట్లకు తగ్గాయి. ఈ యూనిట్లు కూడా ప్రస్తుతం మూతపడ్డాయి. ప్రస్తుత పోటీ మార్కెట్‌కు అనుగుణంగా ఇక్కడి పారిశ్రామికులు ఉత్పత్తి చేయకపోవడమే టెక్స్‌టైల్‌ యూనిట్ల మూసివేతకు కారణంగా చెప్పవచ్చు. నీటి సౌకర్యం లేక పోవడం, ఎస్టీపీ ప్లాంటు నిర్మించక పోవడంతో ప్రాసెసింగ్‌, డైయింగ్‌ యూనిట్లు ఏర్పాటు కాలేక పోయాయి. వర్కర్‌ టూ ఓనర్‌ పథకం కింద షెడ్ల నిర్మాణం చేపట్టినా, ఈ పథకం ముందుకు సాగలేకపోయింది. 2017-18లో ముంబాయికి చెందిన ప్రముఖ కంపెనీ సిరిసిల్లలో రూ. 1250 కోట్లతో స్పిన్నింగ్‌ మిల్‌, డైయింగ్‌, ప్రాసెసింగ్‌, క్లాత్‌ ప్రొడక్షన్‌, సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు ముందుకొస్తే అప్పటి మంత్రి కేటీఆర్‌ విముఖత చూపడం వల్ల ఆ పరిశ్రమ సూరత్‌కు తరలి వెళ్లింది. ఒకవేళ ఈ పరిశ్రమ ఇక్కడ ఏర్పాటైతే సిరిసిల్ల కార్మికులకు ఉపాధి లభించేది. ఇక సిరిసిల్ల అపెరల్‌ పార్కులో గతంలో ఏర్పాటైన గోకుల్‌ దాస్‌ కంపెనీ లోదుస్తుల తయారీ కేంద్రం విస్తరణకు నోచుకోలేకపోయింది. రెండు వేల మందికి పైగా ఉపాధి కల్పించే ఈ కంపెనీ ప్రస్తుతం సుమారు 500 మంది మహిళలు మాత్రమే పరిమితమైంది.

రేవంత్‌ సర్కారుపై ఆశలు..

వరంగల్‌ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పరిశ్రమల ఏర్పాటుపై స్థానికుల్లో ఆశలు చిగురిస్తున్నా యి. ఇప్పటికే ఇక్కడి నిర్వాసితులకు ఇండ్లు మంజూరు చేసిన రేవంత్‌ సర్కారు..పెట్టుబడి దారులకు ప్రోత్సహకా లు ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. వరంగల్‌ను రెండో రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించిన సీఎం.. ఇంటర్నే షనల్‌ ఏయిర్‌పోర్ట్‌ ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చేశారు. దక్షణ కొరియా పర్యటనలో వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పెట్టుబడులకు పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. దీంతో పాటు పరిశ్రమల ఏర్పా టుకు టాస్క్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇతర రాష్ట్రాలు, వివిధ దేశాల్లోని వస్త్ర పరిశ్రమపై అధ్య యనం చేసేలా సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశాలకు ఆదే‌శాలు జారీ చేశారు. మరోవైపు ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్‌ టెక్నాలజీని ప్రారంభించిన సర్కారు డిప్ల మా విద్యార్థులకు అంతర్జాతీయ శిక్షణ అందిస్తున్నారు.. సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పరిశ్రమ విస్తరణ, కార్మికులకు మెరుగైన ఉపాధి దిశగా చర్యలు చేపట్టింది. ఇందుకై ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీపైసా వృథాకాకుండా ప్రయోజనాలు చే కూర్చేలా కార్యచరణతో ముందుకు సాగుతుంది. సిరిసిల్ల కార్మికులకు ఉపాధి కల్పించే స్వయం సంఘాల మహిళల చీరల ఉత్పత్తికి అత్యాధునిక టీఎఫ్‌వో‌యార్న్‌ను ఉపయోగించనుంది. దీనిద్వారా నాణ్యమైన చీరలు తయారౌతాయి.

చిలగాని జనార్థన్‌

81219 38106

Advertisement

Next Story