కోర్సు రద్దుపై పునరాలోచించాలి..

by Ravi |   ( Updated:2024-01-11 00:45:27.0  )
కోర్సు రద్దుపై పునరాలోచించాలి..
X

మన దేశ విశ్వవిద్యాలయాల్లో ఎంఫిల్ కోర్సులో చేరాలని ఉత్సాహ పడుతున్న విద్యార్థుల అభిలాషను నిరుత్సాహపరుస్తూ గత నవంబర్‌లో యూజీసీ ఆ కోర్సుని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఎం ఫిల్ కోర్సును ఎందుకు రద్ధు చేశారో కారణాలను మాత్రం యూజీసీ ప్రకటించకపోవడం విచారకరం.

ఒక కోర్సును కొనసాగించాలా.. తిరస్కరించాలా? దాని స్థానంలో మరో కోర్సును ప్రవేశపెట్టాలా? అనే విషయంలో యూజీసీకి అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. దానిని ఎవరూ ప్రశ్నించటం లేదు. కానీ ఒక కోర్సును ప్రారంభించటానికి, అర్ధాంతరంగా రద్దు చేయడానికి సహేతుక కారణాలను వెల్లడించడం మాత్రం అవసరం.

చారిత్రక నేపథ్యం

ఎం.ఫిల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పరిశోధన కోసం చేసే ఓ షార్ట్ టర్మ్ కోర్స్. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు, డాక్టోరల్ (పీహెచ్.డీ)కోర్సుల మధ్య ఉన్న మిడ్‌వే కోర్సు. పీహెచ్‌డీ దీర్ఘకాలిక పరిశోధన కోర్సు. ఇది సైన్స్ సబ్జెక్టులలో దాదాపు నాలుగు సంవత్సరాల వరకు కాలపరిమితి ఉంటుంది. అవసరమైతే కాలపరిమితిని యూనివర్సిటీ పొడిగిస్తుంది. అలాగే ఫీల్డ్ డేటా కలెక్షన్‌పై ఆధారపడిన ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ హ్యుమానిటీస్ సబ్జెక్టులకు 4-5 సంవత్సరాలకు మించి కాలపరిమితి ఉంటుంది. ఇలా దీర్ఘకాలిక కోర్సును కొనసాగించలేని వారు కేవలం మూడు సెమిస్టర్ల వరకు ఉండే ఎం.ఫిల్ కోర్సులను ఎంచుకునేవారు. గతంలో యం.లిట్ (M.Litt) కోర్సు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత అనేక విశ్వవిద్యాలయాలలో ఉనికిలో ఉండేది. కానీ, 1970లలో ఈ కోర్సుకు బదులు ఎం.ఫిల్‌‌ని తీసుకొచ్చారు. తత్వశాస్త్రం, సాహిత్యంతో సహా అనేక రంగాలను ఈ కోర్సు కలిగి ఉన్నందున ఇది మాస్టర్ ఆఫ్ లిటరేచర్ (M.Litt) కాదు, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్) అని పేరు మార్చారు. జూనియర్ కళాశాలల్లో, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్ వృత్తిని చేపట్టాలనుకునే ఎం.ఫిల్ వంటి షార్ట్‌ డ్యూరేషన్ కోర్సును ఎంచుకునేవారు.

రద్దు నిర్ణయం.. మంచిది కాదు

గతంలో ఉన్న విద్యా నిపుణులు ఎంతో విజ్ఞతతో ఎం.ఫిల్ కోర్సును రూపొందించారు. విదేశాల విశ్వవిద్యాలయాలు సైతం ఎం.ఫిల్‌ కోర్సును ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. ఈ కోర్సు ద్వారా రీసెర్చ్ మెథడాలజీ పెరుగుతుంది. ఎం.ఫిల్ కోర్సు కళాశాల స్థాయిలోనే కాబట్టి.. ఉపాధ్యాయుడు సమర్థవంతమైన ఉపన్యాసకుడిగా రాణించటానికి తగినంత సమాచారం, ఆచరణాత్మక పరిజ్ఞానం ఈ కోర్సు అందిస్తుంది. ఇది జూనియర్ కళాశాలకు, అండర్ గ్రాడ్యుయేట్ క్లాసులు చెప్పాలనుకునే ఉపాధ్యాయులకు ఈ కోర్సు వరం. దీనిని తొలగించి దాని స్థానంలో మరో కొత్త కోర్సును ప్రవేశపెట్టలేదు. ఇలా చేయటం ఆరోగ్యకరమైన విద్యావ్యవస్థకు మంచిదికాదు. ఈ కోర్సు రద్దు ద్వారా పీజీకీ, పీహెచ్‌డీ మధ్య శూన్యత సృష్టించారు.

అందువల్ల ఎం.ఫిల్ కోర్సును రద్దు చేయాలనే యూజీసీ నిర్ణయంపై పునరాలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కోర్సును కొనసాగించడానికి ఏమైనా ఇబ్బందులుంటే.. మరో మధ్యవర్తిత్వ పరిశోధనా కోర్సుతో భర్తీ చేసేంతవరకైనా దీనిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ కోర్సు గురించి దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకులు, విద్యావేత్తలు యూజీసీకి తగిన సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుంది.

డా. కోలాహాలం రామ్ కిషోర్,

98493 28496

Advertisement

Next Story

Most Viewed