క్రోధి ఉగాది శాంతికి పునాది !

by Ravi |   ( Updated:2024-04-09 01:00:57.0  )
క్రోధి ఉగాది శాంతికి పునాది !
X

తెలుగు కాలమానినిలోని చైత్రమాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి రోజు బాల భానుడి తొలివెలుగు కిరణాలతో మొదలయ్యే పండుగ ఉగాది! ప్రపంచ వ్యాప్తంగా ఉండే తెలుగు వారందరూ ఎంతో గొప్ప ఉత్సవంగా, ఉత్తేజంగా, ఉల్లాసంగా జరుపుకునే పండుగ!

నిజానికి పండుగలన్నీ ప్రారంభమయ్యేది ఉగాదితోనే. అందుకే ఉగాదిని కొత్త సంవత్సరంగా, ఒక కొత్త శకానికి ఆదిగా, కొత్త సంవత్సరానికి తొలి పునాదిగా భావిస్తాం. భారతీయ కాలమానం ప్రకారం, జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, ఖగోళ శాస్త్ర ప్రకారం చేసిన పరిశోధనల్లో ఒక సంవత్సర కాలపు రుతువుల సంచారాన్ని, శీతోష్ణస్థితి పరిస్థితులని, నైసర్గిక పరిణామాలను ఆధారంగా చేసుకొని ఈ ఉగాదిని సంవత్సరానికి తొలి రోజుగా మన ప్రాచీనులు గుర్తించి కాలాన్ని లెక్కించారు.

తెలుగువారి సామూహిక ఉత్సవం..

మన తెలుగు పంచాంగంలో కూడా ఉగాదికి ప్రత్యేక విశిష్టత ఉంది. మన తెలుగువారి విశ్వాసాలలో కాలచక్రం ప్రతి 60 ఏళ్లకు ఒకసారి తిరిగి వస్తుందని గమనించి దాని ప్రకారం ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన పేరుని మన పూర్వీకులు సూచించారు. అలా ప్రభవ, విభవ, ప్రమోదూత ఇలాంటి పేర్ల నుంచి మొదలుకొని అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలుగా తెలుగు క్యాలెండర్ నిర్ధారించడం జరిగింది. వీటిలో 38వ సంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభం అవుతున్న శ్రీ క్రోధి నామ సంవత్సరం. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది వేప పూత, మామిడి కాత, కోయిల కూత, పంచాంగంలోని మన భవిత! భారతీయ పండుగలన్నీ ప్రకృతి గమనాలు, రుతువులను అనుసరించి నిర్ధారించబడిన పండుగలు కావడం విశేషం. అందుకే రుతువులు మారి కాలం వసంత కాలంలోకి మారుతున్న సూచికగా ఈ ఉగాది పండుగని మనం జరుపుకుంటూ వస్తున్నాం. ఎండలు, మామిడి పళ్ళు, కొత్త చిగుళ్లతో వేప చెట్లు, కోయిల పాటలు, మల్లె పూల పరిమళాలు ఇవి ఈ కాలపు సూచికలు, ఉగాదికి ప్రతీకలు. ఇలా ప్రకృతికి, మానవ జీవితానికి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను అత్యున్నతంగా చూపించే కుటుంబ ఉత్సవం, తెలుగువారందరి సామూహిక ఉత్సవం ఉగాది పండుగ.

శాంతి కోసం ‘క్రోధి’

ఈ సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే కోపము కలవారు అని అర్థం. క్రోధి అంటే కోపం. ఇది ఎప్పుడైనా తనకు మాత్రమే కాదు, తన చుట్టూ ఉండే వారికి, తనపై ఆధారపడ్డ వారికి, తన కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఇబ్బంది కలిగిస్తుంది అనేది సత్యం. ఇక రక్షించేదల్లా ఏంటి అంటే మనలోని ప్రశాంతతే, మనలాంటి మనుషులలోని కరుణ, దయ, జాలి, సానుభూతి, సాటి మానవుల పట్ల మనకుండే ప్రేమ, గౌరవం ఇవే మనల్ని రక్షిస్తాయి. మానవులుగా నిలబెడతాయి. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూడా అన్ని సంవత్సరాలలాగే ప్రకృతి, పరిస్థితులు, పరిసరాలు, మనుషులు, వ్యవస్థలు శపించవచ్చు. శుభం చేయవచ్చు. విజయాలు, వైఫల్యాలు అందించవచ్చు. కరుణించవచ్చు. కోపించవచ్చు. వాటి వల్ల వ్యక్తులు బాధపడవచ్చు. నష్టపోవచ్చు. కానీ వాటన్నింటికీ అతీతంగా మనిషి ముఖ్యం, మానవుడే ముఖ్యం! “మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం” అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు స్ఫూర్తితో మానవతకు పట్టాభిషేకం చేసే విధంగా మనల్ని మనం సంసిద్ధం చేసుకొని మెలగాల్సిన సంకేతాన్ని ఈ సంవత్సరం మనకు సూచిస్తోంది. అయితే కోపం అసలు అక్కర్లేదా అని అంటే ఖచ్చితంగా కోపం అవసరమే, ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు, ఒక అక్రమం జరుగుతున్నప్పుడు, ప్రకృతికి, మానవులకి, పరిసరాలకి, సృష్టికి విఘాతం కలిగినప్పుడు బాధ్యతాయుతమైన వ్యక్తులుగా, పౌరులుగా మనం కోపాన్ని ప్రదర్శించటం అవసరం. అందుకని కోపంలో కూడా ధర్మం ఉంటుంది గనుక ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఎప్పుడొచ్చినా అది మనందరి బాధ్యతగా భావించాల్సిందే.

సకల అనుభవాల మత్తడి

ఉగాది అనగానే మనకు గుర్తొచ్చే ఉగాది పచ్చడి. పచ్చడి ఇస్తున్న సందేశం జీవితంలోని వివిధ రకాల అనుభవాలను ఆహ్వానించాలనేదే! షడ్రుచుల సమ్మేళనంగా ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి తీపి, ఉప్పు, వగరు, పులుపు, చేదు, కారం, ఇలా ఆరు రుచులతో మనకు చెబుతున్న సందేశం. జీవితంలో కూడా మనకు అన్ని రకాల అనుభవాలు ఉంటాయని అదే జీవితంలోని పరమార్థం అని, గెలుపు-ఓటములు, విషాదము-ఆనందము మన జీవితంలో అంతర్భాగమేనని! వీటన్నిటిని సమపాళ్లలో స్వీకరిస్తూ నిరంతరం ప్రగతి వైపుగా. పురోగతి వైపుగా, ఎదగడమే మన కర్తవ్యం.

మనుషులుగా మనం ఆరు రకాలుగా ఎదగాలని అనుకుంటాం. శారీరకంగా, బౌద్ధికంగా, భావోద్వేగాల పరంగా, నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ఆరు రకాలుగా ఎదిగినప్పుడే ఒక మనిషి సంపూర్ణ మానవుడు అవుతాడు అని ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మనకి అంతర్లీనంగా తెలియజేస్తున్నాయి. ఆరు రుచులు, ఆరు రుతువులకు ప్రతినిధులుగా నవ జీవన విలువలను, జీవనేచ్ఛను పొంగించగల ఉత్సవం ఉగాది. అందుకని ఈ ఉగాది పచ్చడిని ఏదో రుచికరమైన వంటగా కాకుండా ఒక జీవన సందేశాన్ని, తెలుగు జాతి తాత్వికతను తెలిపే అంశంగా మన పూర్వీకులు గమనించారు. అదే వారసత్వాన్ని కొనసాగించే దిశగా మనందరం ప్రకృతికి ఉగాది వేడుకలతో నీరాజనాలు అందిద్దాం. సకల జనులకు, సర్వలోకాలకు శుభం కలగాలని ఆశిద్దాం. శాంతికి పునాదులు వేద్దాం!

అందరికీ శ్రీ క్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు!

-డా. మామిడి హరికృష్ణ

80080 05231

Advertisement

Next Story

Most Viewed