రాజకీయ సాధికారత దిశగా.. పద్మశాలీ సమాజం

by Ravi |   ( Updated:2023-08-11 00:16:07.0  )
రాజకీయ సాధికారత దిశగా.. పద్మశాలీ సమాజం
X

భారతదేశ స్వాతంత్రోద్యమానికి వెన్నెముకగా నడిచిన నేతన్నలు, అదే ఉద్యమ ప్రేరణతో 1952లో ఏర్పడ్డ మొదటి అసెంబ్లీలో ముగ్గురు పద్మశాలీలు కొండా లక్ష్మణ్ బాపూజీ, గంగుల భూమయ్య, పెండెం వాసుదేవ్ ఏకకాలంలో గెలిచి, మేము సైతం చట్టసభల్లో అంటూ గొంతెత్తి చాటారు.. అదే రాజకీయ చైతన్యంతో, ఆ తర్వాత జరిగిన ఎన్నో సామాజిక, బహుజన పోరాటాల్లో చేనేత, పద్మశాలి నాయకత్వం ముందుండి నడిచింది. అందులో ముఖ్యంగా పలు దశలుగా సాగిన తెలంగాణ పోరాటంలో తొలి దశ నుండి రాష్ట్రం ఏర్పాటు అయ్యేదాకా ఒక పెద్దన్నలా పద్మశాలి సమాజం గొంతెత్తింది. రోడ్డెక్కింది, గర్జించింది. రాష్ట్రాన్ని సాధించింది. తొలిదశ నుండి మలిదశ దాకా ప్రతిదశలో పద్మశాలీలు ఎనలేని త్యాగాలు చేశారు.

1969 లోనే తెలంగాణ కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తన క్యాబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే స్ఫూర్తితో మలిదశ ఉద్యమ ప్రస్థానానికి నాంది పోసి, తన ఇంట్లోనే బీజం వేసి, సర్వం త్యజించారు మన బాపూజీ. అలా మొదలైన మలిదశ ప్రస్థానంలో, బాపూజీ స్ఫూర్తితో ఆలే (టైగర్) నరేంద్ర తెలంగాణ సాధన సమితి పేరుతో ఉద్యమించి టిఆర్ఎస్‌తో జత కట్టారు. ఆ తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేశారు. తెలంగాణ సాధన కోసం కేసిఆర్‌తో కలిసి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైంది.

ఉద్యమంలో కీలకపాత్ర..

తెలంగాణ ఉద్యమ వ్యూహాలు రచించేందుకు పార్టీలకతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు, అందరూ రాజకీయ నాయకులకు దిశానిర్దేశం చేయడమే కాకుండా వారందరికీ ఒక వార్ రూమ్‌లో స్థానం కల్పించింది కూడా మన ఈ పద్మశాలి బిడ్డనే! వారితో పాటు తెలంగాణ ఉద్యమంలో వనం ఝాన్సీ రాణి కూడా ప్రముఖ పాత్ర పోషించి జాతీయ స్థాయిలో కదలిక తీసుకువచ్చారు. పద్మశాలి యువకుడు సిరిపురం యాదయ్య ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఆత్మత్యాగం చేశారు. 2010 డిసెంబర్ 22న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో వేలాది మందితో పద్మశాలి యువగర్జన సభ నిర్వహించాం. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా సోషల్ మీడియాలో సైతం నెటిజనుల పోరుబాట నడిపారు. రాస్తారోకోలలో, పలు బహిరంగ సభల్లో, సకల జనుల సమ్మెలో సైతం మగ్గాలు- రాట్నాలను రోడ్లపై ప్రదర్శించి ఉద్యమించారు పద్మశాలీలు. అంతేకాకుండా పద్మశాలీ మేధావి వర్గమంతా ఎల్లప్పుడు ఉద్యమ పంథాను మారుస్తూ తమ చాణక్య నీతితో సమైక్యాంధ్ర వాదాన్ని గట్టిగా ఎదుర్కోవడమే కాకుండా, దేశంలో జరిగిన ఎన్నో సామాజిక ఉద్యమాలకు ఊతమిచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమ వెన్నుముకగా పని చేసింది పద్మశాలి సమాజం.

అయితే కాలక్రమేణా రాజకీయ ప్రాతినిధ్యం రానురాను తగ్గిపోతూ స్వీయ పాలనలో దిగజారి చట్ట సభల్లో పద్మశాలీలకు కనీస రాజకీయ ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఒక్కరంటే ఒక్కరు కూడా పద్మశాలీ ఎమ్మెల్యే లేరంటే చాలా విచారకరం. ఎందరో నాయకులు ప్రస్తుత రాజకీయాల్లో రాణించలేక చతికిలపడుతున్నారు... తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలకు ప్రత్యేక అస్తిత్వం వుంది. అనాదిగా వస్తున్న వస్త్రోత్పత్తి రంగంలో పద్మశాలీల సృజనాత్మకతకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభించింది. సామాజికంగా, ఆర్థికంగా. సాంస్కృతికంగా, సాహిత్య రంగంలో పద్మశాలీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కానీ రాజకీయ రంగంలో శూన్యత కనిపిస్తుంది. అధికారంలో భాగస్వామ్యం కానీ సమాజం మరుగున పడిపోతుంది అన్న చరిత్రకారుల మాటలు నిజమయ్యే రోజులు రాకముందే కళ్ళు తెరిచిన పద్మశాలీలు, ప్రస్తుతం గొంతెత్తి తమ సమాజ రాజకీయ హక్కుల కోసం ఏకతాటి మీదకు వచ్చి కదం కదం తొక్కి మా హక్కులు మాకే కావాలని నినదిస్తున్నారు... అందులో భాగంగానే ఈ మధ్య జరిగిన పలు రాజకీయ సమాలోచనలు..

అస్తిత్వం కోసం ఈ యజ్ఞం..

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఎందరో మేధావులు మళ్ళీ మేమున్నామంటూ ముందుకొస్తున్నారు. అందరిని ఏకతాటి మీదికి తీసుకొచ్చే పనులు చేస్తూ తమ వంతు సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. రాజకీయాల్లో మనమెందుకు ఎదగొద్దు. ఎందుకు మనం సమాజం పట్ల నిర్ణయాలు తీసుకునే చోట ఉండడం లేదు అని ఎన్నో మెదళ్లలో కదలిక తీసుకొస్తున్నారు .. ఒక పరివర్తన కోసం గళం ఎత్తుతున్నారు. ప్రస్తుతం తలపెట్టిన చలో కోరుట్ల పద్మశాలి రాజకీయ యుద్ధభేరి సభ ఆ ఆలోచనల్లోంచి, ఆ మేధోమధనంలో నుండి పుట్టిన ఒక కార్యక్రమమే. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో కలిసి చేనేత సంబంధిత కులాల రాజకీయ పురోగతి కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పద్మశాలి కుల బాంధవుల కోసమే.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే మన దామాషా ప్రకారం పద్మశాలీలు అసెంబ్లీలో కనీసం 10 మందికి పైగా, కౌన్సిల్ లో 5 గురు. పార్లమెంట్‌లో ముగ్గురు ఉండి తీరాలి. అలాగే గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ మొదలుకొని రాజ్యసభ సభ్యుని వరకు పద్మశాలీలు వుండి తీరాలి అని నినదిస్తూ, ప్రతి పార్టీని నిలదీయడానికి అడుగులేస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతం కావాలంటే రాజ్యాంగబద్ద పాలన కొనసాగించే నిబద్ధత గల రాజకీయ పార్టీలతో పాటు జాగరూకులైన ప్రజానీకం కూడా చాలా అవసరమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారు. ఇప్పుడు తమ రాజకీయ అస్తిత్వం కోసం చేస్తున్న ఈ మహా యజ్ఞానికి పద్మశాలీయులు అందరూ కదలాల్సిన సమయమిది.

మన ఓట్ బ్యాంకు ప్రదర్శిద్దాం..

పద్మశాలి సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇంటి నుండి రోడ్లపైకి వచ్చి న్యాయం కోసం ఎలుగెత్తి చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీల ఆత్మగౌరవం నిలుపుదాం. బీసీలలో అత్యధిక జనాభా కలిగిన పద్మశాలీలకు గుర్తింపు, గౌరవం, సమన్యాయం కావాలి. నిర్ణయాలు తీసుకునే దగ్గర, శాసనాలు తయారు చేసే సభల్లో మనం సైతం ఉందాం. ఇదివరకటిలా చట్టాల రూపకల్పనలో సహాయ హోదాలలో మాత్రమే కాకుండా నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో సైతం మనం ముందుందాం అని నినదిద్దాం. స్వీయ పాలనలో నిర్మూలించ లేకపోయిన చేనేతల ఆత్మహత్యల మీద నిర్ణయాలను మనమే తీసుకుందాం. నేతన్న వలసలు ఆపడంతో పాటు పారిశ్రామికీకరణ వల్ల చతికిల వద్ద నేత పరిశ్రమను పరిరక్షించుకుందాం. నేతన్నల బతుకుల్లో వెలుగులు నింపుకుందాం. అందుకోసమే రాజకీయ సాధికారత దిశగా పద్మశాలి సమాజం పరుగెడుతోంది.

సిరిసిల్ల, కోరుట్ల, ఓట్ బ్యాంకుగా మాత్రమే ఉన్న పద్మశాలీ కులం సంఘటితం అవ్వడంతో పాటు మన హక్కులను సాధించుకునేందుకు రాజకీయ అధికారం దిశగా అడుగులు వేస్తూ, సమానత్వం కోసం పని చేస్తుంది. ప్రస్తుత పద్మశాలి సమాజం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎక్కువ త్యాగాలు చేసి అత్యధికంగా నష్టపోయిన కులం పద్మశాలీ కులం మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలకు జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అంటరానితనాన్ని రూపుమాపేందుకు పౌరుషం కలిగిన ప్రతి ఒక్క పద్మశాలీ బిడ్డ నడుం బిగించి కదం తొక్కాలి. పద్మశాలీల దయనీయ పరిస్థితికి ప్రధాన కారణం రాజకీయంగా ఎదగకపోవటమే. రాజకీయ పార్టీలు పద్మశాలీలను ఓటు వేసి యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మన వాటా సాధించుకోవాలంటే మన ఓట్ బ్యాంకు శక్తిని ప్రదర్శించాలి.

అన్ని రాజకీయ పార్టీలు పద్మశాలీలకు సీట్లు... టికెట్లు కేటాయించాలి. వివిధ పార్టీల నుండి పోటీ చేసిన అభ్యర్థులకు ప్రతి ఒక్క పద్మశాలి తన ఓటుతో పాటు సమయం ఇచ్చి గెలిపించుకోవాలి. అప్పుడే పద్మశాలీల సంఘటిత శక్తి ప్రదర్శింపబడుతుంది. మన ఆత్మ గౌరవం ఇనుమడింపబడుతుంది. పద్మశాలీల జీవితాలలో వెలుగులు నింపే అవకాశం కలుగుతుంది. మన రాజకీయ అధికారానికి దారులు వేసుకుంటూ, మన శక్తిని ప్రదర్శించి, రాజకీయాధికారం దిశగా అడుగులు వేస్తూ పేద పద్మశాలీల అభ్యున్నతికి కొత్త పథకాలు రూపొందించుకోగలుగుతాం. ఆ దిశగా ఆగస్టు 13న కోరుట్లలో జరిగి పద్మశాలి రాజకీయ యుద్ధభేరికి అందరూ కుటుంబ సభ్యులతో తరలి వచ్చి అందరం కలిసి నినదిద్దాం. లక్షలాది మందితో మన సమస్యలు ఎలుగెత్తి చాటుదాం. మన హక్కులు సాధించుకుందాం. రాబోయే మన తరాలకు మనమే మార్గదర్శనం చేద్దాం.

-డా. దాసరి కిరణ్,

పద్మశాలి రాజకీయ యుద్ధభేరి కోర్ కమిటీ మెంబర్

63018 49448

Advertisement

Next Story

Most Viewed