- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అన్నీ ఉన్న అనాథలు.. ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు
ప్రతి ఏటా వేల కొద్ది యువత ఉన్నత విద్య, ఆకర్షణీయ ఉద్యోగాలు, ఆధునిక జీవనశైలి వేటతో విదేశాలకు పయనమవుతున్నారు. వెళుతూ వెళుతూ తమపై కోటి ఆశలు నింపుకొని కాయకష్టం చేసి, బ్యాంకు అప్పులు చేసి, తాము పొదుపు చేసిన సొమ్మును వెచ్చించి, వారిని ప్రయోజకుల్ని చేసిన తల్లితండ్రులను వదిలి వెళుతున్నారు. పిల్లలు ఉన్నత విద్యతో అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడుతుంటారు. అయితే అక్కడ స్థిరపడిన పిల్లల తల్లితండ్రులకు అన్నీ అందుబాటులో ఉన్నప్పటికీ, బతుకే బహు భారంగా నడుస్తున్నది. ఎన్‌ఆర్‌ఐ తల్లితండ్రుల నవ్వుల వెనుక అదృశ్య బాధల కన్నీళ్ల వరదలు పారుతుంటాయి.
ఎన్నో సౌకర్యాలు ఉన్నా..
ఇక్కడి వృద్ధ దంపతుల్లో అభద్రతా భావం, నా అన్న వారు వెంట లేరనే ఒంటరితనపు వ్యాధి, భవిష్యత్తుపై భయం, అస్థిర జీవన గమనాలు, అత్యవసర సమయాల్లో పిల్లలు తాము దూరంగా ఉన్నారనే తెలియని ఆందోళనలు వారిని వెంటాడుతుంటాయి. ముసలితనంలో బ్యాంకు పనులకు క్యూలో నిల్చోవడం, కరెంటు బిల్లుల చెల్లింపుల తిప్పలు, గ్యాస్ బండను బుక్ చేయడం, సరుకులు కొనుక్కురావడం, శుభ అశుభాలకు హాజరు కావడం, అనారోగ్య సమయాల్లో వైద్యులను కలవడం లాంటి కనీస అవసరాలకు పరుగెత్తడం ముసలితనంలో తప్పడం లేదు. విధిలేని పరిస్థితుల్లో మిత్రులు, బంధువులపై ఆధారపడక తప్పని దుస్థితి వారిది. పండుగలు, పబ్బాలకు హంగామాలు, వంటింటి ఘుమఘుమలు ఉండవు. నూతన వస్త్రాలు కొని పెట్టేవారు కనిపించరు. పుట్టిన రోజులు, వివాహ/మాతృ/పితృ దినోత్సవాలు స్మార్ట్‌ఫోన్‌లోనే జరిగిపోతుంటాయి. వారికి ‘నా వాళ్లు’ అనేవారు ఉండరు. కాలక్షేపం బరువుగా, భారంగా జరుగుతుంది.
ఈ తల్లితండ్రుల హృదయ వేదనలు ఇరుగుపొరుగుకు కనిపించవు, పిల్లలకు వాటి తీవ్రత తెలియదు. ఒక్కసారి విదేశాలకు వెళ్ళిన యువత శాశ్వతంగా తిరిగి రావడం చాలా అరుదు. పౌర సమాజం వారిని ప్రవాస భారతీయ అమ్మనాన్నలుగా గొప్పగా చూస్తుంది. వీరినే ‘గ్లోరిఫైడ్ ఆర్ఫన్స్’గా పిలుస్తారు. వారికి ప్యాలెస్ లాంటి కొంపలు ఉంటాయి, అందులో పనిచేయడానికి సహాయకులు ఉంటారు. కానీ గట్టిగా తింటే అరగదు. ప్రేమను పంచే మనసులే కరువు. సుఖపడడానికి అవసరమైన వనరులన్నీ ఉంటాయి కానీ, పడుకుంటే నిద్రే కరువవుతున్నది. తిరగడానికి ఊత కర్రలా హస్తం అందించే కన్న పిల్లల చేతులే కరువు. వారి అనారోగ్యానికి ఖరీదైన ఆసుపత్రులు ఉన్నా, వారి మానసిక రోగాన్ని నయం చేసే డాక్టర్లే కరువు. చుట్టూ అందరు ఉన్నా, అయినవాళ్ళు దగ్గర లేరనే బాధ వృద్ధులను వెంటాడుతున్నది. మాతృదేశంలో నాణ్యమైన విద్య కరువైన వేళ, రెక్కలొచ్చిన పక్షుల్లా కోటి ఆశలతో విదేశాలకు వెళ్ళి స్థిరపడిన పిల్లల్ని చూసి తొలిరోజుల్లో గర్వపడుతుంటారు తల్లిదండ్రులు. కానీ రోజులు గడిచేకొద్ది వారిలో అభద్రతా భావం ఆవహిస్తుంది. ఎప్పుడో ఓ సారి వారిని చూడటానికి అనారోగ్యం సైతం లెక్కపెట్టకుండా వెళ్లి, కళ్ల నిండా కన్నీళ్లు నింపుకొని తిరిగి మాతృదేశానికి బయలుదేరతారు. అక్కడ ఉన్నన్ని మాసాలు వయసును మరిచి ఇంటి పనులు, వంట పనులు, పిల్లలకు సపర్యలు చేయడంలోనే పుణ్య కాలం గడిచి పోతుంది.
సేవా కార్యక్రమాల్లో నిమగ్నమవుదాం!
విదేశాల్లో పిల్లల కుటుంబం పెరిగితే, స్వదేశంలో తాతలు/నాన్నమ్మలు/అమ్మమ్మలు వయోవృద్ధుల ఆయువు తరుగుతుంటుంది. రెండేళ్లకోసారి 2-3 వారాల కోసం స్వదేశానికి వస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, తిరిగి వెళ్లిపోతారు. వృద్ధ అమ్మనాన్నలు మాత్రం చేసేది ఏమీ లేకపోవడంతో అనాథలమైనామనే బాధలతో మానసికంగా కుంగిపోతుంటారు. కొడుకులు, కూతుర్లు ఫోన్‌లో అప్పుడప్పుడు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకుంటారు. బాధల్ని దిగమింగుకుంటూ, వాస్తవాలు చేబితే పిల్లలు బాధ పడతారని తాము పడుతున్న అవస్థలను చెప్పకుండా తమలో తామే కుమిలిపోతున్నారు. డబ్బు కావాలంటే పంపుతారేగాని, ఆత్మీయ స్పర్శకు మాత్రం ప్రత్యామ్నాయం లేదని తెలుసుకోరు. తెలిసినా వారికి మరో మార్గం లేదు. మనుమలు, మనుమరాళ్లకు స్పష్టమైన తెలుగు రాదు. స్మార్ట్‌ఫోన్‌లో వీడియో కాల్ ద్వారా చంటోళ్లు మాట్లాడితే వీరికి వారి భాష/యాస అర్థం కాదు. వారు మాట్లాడే ఆంగ్ల భాష వీరికి చెవిటోని ముందు శంఖం ఊదినట్లే అవుతుంది. వయోవృద్ధ దంపతులు అన్నీ ఉండి, సమాజం నుంచి కీర్తి గడించిన అనాథలుగా (గ్లోరిఫైడ్ ఆర్ఫన్స్), ఎన్నారై పిల్లల తల్లితండ్రులుగా, ఇరుగుపొరుగు ఈర్ష్య పడేలా, వృద్ధులుగా దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో శేష జీవితాన్ని మానసిక అనారోగ్యంతో గడుపుతున్నారు.
పిల్లలు ఎదిగి రెక్కలు తొడుక్కొని ఎగిరి విదేశాల్లో వాలి, స్థిరపడి చక్కటి జీవితాలను గడుపుతున్నారనే విషయాలను అర్థం చేసుకొని, వారిపై అధిక ఆశలు పెట్టుకోకుండా తల్లితండ్రులు స్వతంత్రంగా, సంతోషంగా జీవించడం నేర్చుకోవాలి. పిల్లలు వారి వారి జీవితాల్లో స్థిరపడ్డారని ఆనందిస్తూనే వారికి భారం కాకుండా తమ తమ పరిధుల్లో కాలం గడపడం, సమాజ సేవల్లో పాలుపంచుకోవడం, అనాథలకు రక్షణ గొడుగు పట్టడం, సమ వయస్కులతో సరదాగా గడపడం లాంటి దినచర్యలను పాటిస్తూ శారీరక, మానసిక ఆరోగ్య ఆనందాలను ఆస్వాదించడం విధిగా నేర్చుకోవాలి. మనం అనాథలు అయ్యామనే భావన మరిచి, సమాజ అభాగ్యుల ముఖాల్లో సంతోషాల నవ్వుల పువ్వులు విరబూసేలా మరో సేవా లోకాపు తలుపులు తడదాం, మరి కొందరు నిరుపేద పేదలకు అమ్మనాన్నలం అవుదాం, వృద్ధాశ్రమాలకు దూరంగా ఉందాం.
డా. బుర్ర మధుసూదన్ రెడ్డి
99497 00037