ఎండలు మండిపోతున్నాయి...

by Ravi |   ( Updated:2024-03-23 00:30:14.0  )
ఎండలు మండిపోతున్నాయి...
X

ఎండాకాలం పూర్తిగా రాకుండానే అనగా మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. గత సంవత్సరం మార్చి నెలలో 36 సెంటీగ్రేడ్‌గా ఉన్న ఉష్ణోగ్రత, ఈ సంవత్సరం 40 సెంటీగ్రేడ్‌కు అప్పుడే చేరుకుంది. ఉదయం 9 గం.లకే ఎండ తీవ్రత పెరిగింది. తక్కువ వర్షపాతం కారణంగా రిజర్వాయర్లు అడుగంటి, భూగర్భ జలాలు తరిగిపోతున్నాయి. ఈ వేసవి తాపం ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా.

మన దేశం సమశీతోష్ణ పరిస్థితులకు అనుకూలం. వర్షాలకు కూడా అనుకూలం. కానీ మన తప్పిదాల ఫలితంగా వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌, అస్సాం, తదితర ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాల డంపింగ్‌ అడ్డూ అదుపు లేకుండా సాగుతుంది. దీంతో త్రాగే నీరు, పీల్చేగాలి విషమై జనజీవనం కృశించిపోతుంది.

ప్రతి రోజు అసంఖ్యాకంగా కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుడటం వలన వాయుకాలుష్యం పెరుగుతుంది. గాలిలో బెంజీన్‌ ఘనపు మీటరు గాలిలో 5 మైక్రోగ్రాములకు మించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కాని గత సంవత్సరం హైదరాబాద్‌లో 7.95 మైక్రోగ్రాముల చొప్పున నమోదైంది. ఉష్ణోగ్రత పెరుగుదల వలన భూమిపై ఉన్న జీవులపై కూడా ప్రభావం చూపుతుంది. 1990 నుండి 2019 నాటికి భారత్‌లో వడగాల్పుల తీవ్రత 15% పెరిగినట్లు లాన్సెట్‌ నివేదిక తెలిపింది.

పర్యావరణ దినోత్సవం ఎందుకంటే

వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులకు సంబంధించి, వాతావరణంపై అధ్యయనం చేసేందుకు 1950, మార్చి 23న 180 దేశాల సభ్యత్వంతో ప్రపంచ వాతావరణ సంస్థ ప్రాంభించబడినది. ఆ సంస్థ ఏర్పడిన ఈ రోజును ప్రపంచ వాతావరణ దినోత్సవంగా నిర్ణయించారు. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. కావున ఈ మార్చి 23న నిర్వహించబడే ప్రపంచ వాతావరణ దినోత్సవ సందర్భాన మనము మరియు ప్రభుత్వం, ప్రజలందరికి అవగాహన కల్పించి, సమాజపు భద్రత, శ్రేయస్సు కోసం ఈ క్రింది చర్యలు తీసుకుని సమాజాన్ని కాపాడుదాం.

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్‌ వాహనాలను వాడుదాం. చెట్లను అధికంగా నాటుదాం. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుందాం.అలాగే పరిశ్రమలను వాతావరణ కాలుష్యం నివారణ అందరి బాధ్యత అని అందరం తీర్మానం చేసుకుని బాధ్యతగా వ్యవహరిద్దాం.

(నేడు ప్రపంచ వాతావరణ దినోత్సవం)

సి.వి.వి. ప్రసాద్‌

విశ్రాంత ప్రధానాచార్యులు

80196 08475

Advertisement

Next Story