Vijay: కాపీ పేస్ట్ భావజాలం: టీవీకేపై ద్రవిడ పార్టీల విమర్శలు

by Mahesh Kanagandla |
Vijay: కాపీ పేస్ట్ భావజాలం: టీవీకేపై ద్రవిడ పార్టీల విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సినీ హీరో, ఇళయదళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం(టీవీకే) పార్టీ భావజాలంపై ద్రవిడ పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఒక వైపు ఆయన రాజకీయ రంగప్రవేశాన్ని ఆహ్వానిస్తూనే ఆయన చెప్పిన పార్టీ భావజాలంపై విమర్శలు చేశాయి. విజయ్ చెప్పిన విధానాలు అన్నీ తమవేనని, ఆయన చెప్పిన విధానాలు, భావజాలాన్ని తాము ఆచరిస్తున్నామని, అమలు చేస్తున్నామనీ డీఎంకే నేత టీకేఎస్ ఎలంగోవన్ వివరించారు. 75 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో డీఎంకే పార్టీ ప్రజా సమస్యలపై పోరాడిందని, ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా ఉన్న విధానాలతో పార్టీ నిర్మితమైందని తెలిపారు. డీఎంకే ప్రజల కోసం పని చేసేదని, కానీ, టీవీకే రెండేళ్లలో అధికారం కోసం ఏర్పడిన పార్టీ అని విమర్శించారు. ప్రజల కోసం ఉద్యమించి జైలుకు వెళ్లడానికైనా నిత్యం ముందుండే పార్టీ డీఎంకే అని వివరించారు. డీఎంకేకు, ఇతర పార్టీలకు ఉన్న ప్రధాన తేడాల్లో ఇదీ ఒకటని చెప్పారు. ఇక స్టాలిన్ కుటుంబం అవినీతికి పాల్పడిందని, రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నదని విజయ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. డీఎంకే ఎంతోమంది ప్రత్యర్థులను చూసిందని, సుదీర్ఘంగా విజయవంతంగా రాజకీయాల్లో ఉన్నదని వివరించారు. విజయ్‌కిది తొలి సభ మాత్రమేనని, ఇప్పుడే విమర్శలు చేయాలని అనుకోవడం లేదని పేర్కొన్నారు.

ఇక ఏఐఏడీఎంకే ప్రతినిధి కోవై సత్యన్ విజయ్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఆయన పార్టీ భావజాలాన్ని ఎత్తిచూపారు. అన్ని పార్టీల భావజాలల సమ్మేళనాన్ని తన పార్టీ భావజాలంగా విజయ్ చెప్పారని ఆరోపించారు. టీవీకే పార్టీ భావజాలం, విజయ్ రాజకీయ ప్రవేశం.. కొత్త సీసాలో పాత సారాలాగే ఉన్నదని పేర్కొన్నారు. తమిళనాడులోని రాజకీయ పార్టీల భావజాలాల నుంచే టీవీకే పార్టీ భావజలాన్ని రూపొందించారని ఆరోపించారు.

విజయ్ నిన్న భారీ బహిరంగ సభ నిర్వహించి తన పార్టీ భావజాలం గురించి మాట్లాడారు. ద్రవిడ మాడల్ అంటూ రాష్ట్ర ప్రజలను ఇక్కడి పార్టీలు మోసం చేస్తున్నాయని, అవినీతికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. డీఎంకే తన రాజకీయ ప్రత్యర్థి అని స్పష్టం చేసిన విజయ్.. బీజేపీ విచ్ఛిన్నకర రాజకీయాలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఏ పార్టీకి తాము ఏ టీం లేదా బీ టీం కాదని స్పష్టం చేస్తూ.. ఇది వరకు ఉన్న పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాము రావడం లేదని, రాష్ట్రంలో కొత్త ఒరవడిని సృష్టిస్తామని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed