'గోట్ లైఫ్' సినిమా వెనుక కథ

by Ravi |   ( Updated:2024-04-12 00:45:43.0  )
గోట్ లైఫ్ సినిమా వెనుక కథ
X

మలయాళీ సినిమా ఆడు జీవితం 'గోట్ లైఫ్' పేరిట హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మార్చి 28న విడుదలైంది. దుర్భరమైన ఎడారి జీవితాన్ని అద్భుతంగా చిత్రీకరించారని, పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంతో రిస్క్ తీసుకుని నటించారని ఆ సినిమాకు ప్రశంసలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు కథే మూలం. ఆ కథ ఎలా బయటికి వచ్చింది అనేది కూడా ఎంతో ఆసక్తితో కూడిన అంశమే.

కేరళవాసులు బ్రతుకు తెరువు కోసమో, మంచి జీవితం కోసమో గల్ఫ్ దేశాలకు వెళ్లడం మామూలే. అలా వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి వ్యధాభరిత అనుభవమే ఈ చిత్రం. ఈ సినిమాకు ప్రసిద్ధ మలయాళీ రచయిత బెన్యామిన్‌ కథను అందించారు. కేరళ నుండి బెహ్రెయిన్ వెళ్లి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేసిన ఆయన ప్రస్తుతం ఫుల్ టైం రైటర్‌గా కొనసాగుతున్నారు. ఎన్నాళ్ళ నుంచో ఆయన కేరళ ప్రవాస కూలీల జీవితాలపై వాస్తవిక నవల రాయాలని తగిన సమాచార వేటలో ఉన్నాడు. మాటల సందర్భంలో రచయిత మిత్రుడు సునీల్ తన బావ నజీబ్ సౌదీలో అనుభవించిన కఠోర జీవితం గురించి చెప్పాడు. అప్పుడు బెహ్రెయిన్‌లో ఉంటున్న నజీబ్ ను రచయిత కలిసి ఆయన పడిన కష్టాలను రికార్డు చేశారు. సినిమాలో చూయించిన ఎడారిలో జీవన్మరణ కష్టాలను నజీబ్ ఏప్రిల్ 1992 - ఆగస్టు 1995 మధ్య కాలంలో అనుభవించాడు. అలా నజీబ్ జీవితం బెన్యామిన్‌ చేతిలో 'ఆడుజీవితం' అనే గొప్ప నవలగా 2008లో రూపుదిద్దుకుంది.

వివిధ భాషల్లో 130 ముద్రణలు

నమ్మశక్యం కాని నవలానాయక నజీబ్ జీవితం వాస్తవమని తెలిసి పుస్తకంపై పాఠకుల ఆసక్తి పెరిగింది. ఇప్పటికీ ఆడు జీవితం బెస్ట్ సెల్లర్‌గా నిలుస్తోంది. ప్రీ బుకింగ్ చేసినవారికి తన ఆటో గ్రాఫ్‌తో కాపీ పంపేందుకు ఓ రోజు బెన్యామిన్‌ ఏకబిగిన 800 పుస్తకాలపై సంతకాలు చేయాల్సివచ్చిందట. అలా పలు భారతీయ భాషలతో పాటు అరబ్బీ, నేపాలీ, తాయి విదేశీ భాషల్లోకి కూడా ఆ నవల వెళ్ళింది. అన్ని భాషలు కలిపి ఇప్పటికీ 130 ముద్రణలు దాటాయి. కేరళ, కాలికట్, పాండిచ్చేరి యూనివర్సిటీల్లో, ఇంకా కేరళ పదో తరగతికి పాఠ్య పుస్తకంగా ఈ నవల తీసుకోబడింది. 2012 లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, ఆ తర్వాతి కాలంలో ఎన్నో పురస్కారాలను ఈ నవల సొంతం చేసుకుంది. అకాడమీ అవార్డు ఫంక్షన్ లో రచయితతో పాటు నజీబ్ కూడా పాల్గొని తన స్పందనను తెలిపారు.

రచయితగా తన జీవితం..

అలా పాపులర్ అయిన నవల సినిమా వాళ్ల కంట పడటం, పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించేందుకు సిద్దపడడంతో వెండితెరపైకి ఎక్కింది. 2008లోనే రచయిత నుండి సినీ హక్కులు తీసుకున్న పదేళ్ల తర్వాత బ్లేస్సి దర్శకత్వంలో 2018లో షూటింగ్ మొదలైంది. కరోనా కారణంగా మళ్ళీ షూటింగ్ ఆగిపోయి ఇటీవల పూర్తి చేసుకుంది. ఎడారి సన్నివేశాలను జోర్డాన్, అర్మేనియాలో చిత్రీకరించారు. రచయితగా తన జీవితం ఆడుజీవితం కన్నా ముందు , దాని తర్వాతగా విడిపోయిందని బెన్యామిన్‌ అంటారు. 53 ఏళ్ల బెన్యుమిన్ చిన్నప్పటి నుండే పుస్తకాల పురుగు. చదువు, ఉద్యోగ సమయాల్లోనూ గంటల తరబడి పుస్తకాలు చదివేవాడు.

20 ఏళ్ల గల్ఫ్ జీవితం

తాను రచయితగా మారుతానని ఎన్నడూ అనుకోని ఆయనకు 2000లో రచనలపై ఆసక్తి కలిగి ముందు కథలు రాశాడు. అలా రచనా జీవితం మొదలై రాయడానికి తగిన సమయం కోసం ఉద్యోగాన్ని వదిలేశారు. 1992 నుండి 2013 వరకు బహ్రెయిన్‌లో ఉన్న ఆయన రచయితగా కొనసాగడానికి కేరళకు తిరిగి వచ్చాడు. ఇప్పటికి ఆయన కథలు, నవలలు 30 పుస్తకాలుగా వచ్చాయి. ప్రతి రచన ఇంగ్లీషుతో పాటు ఎన్నో భాషలకు అనువాదం అయింది. భారతీయ జీవితాలపై వచ్చే ఇంగ్లీషు నవలకు జెసిబి ఫౌండేషన్ 2018 నుండి ఇస్తున్న రూ.25 లక్షల బహుమతి తొలిసారిగా బెన్యామిన్‌ రాసిన 'జాస్మిన్ డేస్' కి లభించింది. ఈ నవలను మలయాళం నుండి ఇంగ్లీషులోకి షహనాజ్ హబీబ్ అనువదించారు.

కథానాయకుడికి 63 ఏళ్లు

ఈ సినిమా 'కథ' నాయకుడైన నజీబ్ ప్రస్తుతం సుఖంగా ఉన్నాడు. మళ్ళీ గల్ఫ్ బతుకునే నమ్ముకొని తన బావ సునీల్ సహాయంతో ఉచిత వీసాపై బెహ్రెయిన్ వెళ్లి క్రమంగా ఉద్యోగంలో స్థిరపడడంతో కుటుంబాన్ని కూడా బెహ్రెయిన్ తీసికెళ్ళాడు. ఇప్పుడు నజీబ్ మొహమ్మద్ వయసు అరవై మూడు ఏళ్ళు.

- బి.నర్సన్,

94401 28169

Advertisement

Next Story

Most Viewed