- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ అంధకారం ఇంకా ఎన్నాళ్లు? - సంపత్ గడ్డం
ఈ దేశంలో ప్రధానంగా దళితుల పరిస్థితి రోజుకు రోజుకు మరింత అద్వానంగా మారుతుంది. ఇప్పటికీ మెజారిటీ దళితులకు పారిశుధ్య రంగమే దిక్కవుతుంది. ఇది అధికారిక లెక్కల్లో కూడా తేలింది. ఈ దేశంలో పారిశుధ్య రంగంలో ఎక్కువగా సేవ చేసేది దళిత సామాజిక వర్గానికి చెందిన వారే.. క్షేత్ర స్థాయిలో ఉండే ఈ రంగం తప్ప దళితులకు మెరుగైన అవకాశాలు ఆశించినంత దక్కడం లేదు. ఇదిలా ఉంటే దేశంలో వివిధ నేరాలు చేసి జైలు జీవితం శిక్ష అనుభవించే వారిలోనూ జైళ్లలోనూ కుల ఆదారాన్ని బట్టి పనులు కేటాయించడాన్ని చూస్తే దళితుల పరిస్థితి ఈ దేశంలో ఎంత ఘోరమో అర్థం అవుతుంది. సమూలంగా దళితులకు రావాల్సిన అవకాశాలను కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం కావడం బాధాకరం. వర్గీకరణ అమలుతో కూడిన నియామకాలు చేపడితే తప్పా మాదిగ, ఉపకులాల బతుకుల్లో వెలుగులు నిండవు.
ప్రస్తుతం దేశంలో ఎస్సీ వర్గీకరణ మీద ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును చూస్తే దళితుల భవిష్యత్తు అర్థమవుతుంది. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని ఉద్యమం వల్ల ఎబీసీడీ వర్గీకరణ కోర్టు సానుకూల తీర్పునిచ్చింది. మరోవైపు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రాలకే ఎస్సీ వర్గీకరణ చేసుకునే హక్కు ఇచ్చింది. దీంతో దళితుల్లోని మెజారిటీ ప్రజలకు, అటు ఉపకులాలకు ఈ తీర్పు వారి బతుకుల్లో వెలుగులా మారింది. అన్ని రాష్ట్రాల కంటే తమ రాష్ట్రమే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారు. ఇప్పటికే ఉపాధి అవకాశాలు లేక మానసికంగా మాదిగ నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే గతంలో దేశ వ్యాప్తంగా ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను తీసుకువచ్చింది. అది తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణంగా అమలవుతుంది. ఎస్సీ, బీసీల కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఈడబ్ల్యుఎస్ కోటా కింద ఉద్యోగాలు పొందారు. ఈడబ్ల్యుఎస్‌ను అంత తొందరగా అమలులోకి తెచ్చిన ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ తీర్పు వచ్చినా కమిటీల పేరుతో కాలయాపన చేయడం మంచిది కాదు.
ఆ పరీక్షలకూ వర్గీకరణ వర్తింపజేయాలి
తెలంగాణ గ్రూపు - 1లో మెయిన్స్ కోసం అనేక మంది అభ్యర్థులు వాయిదా వేయాలని ఆందోళనలు చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వ విధానాలను తప్పు బట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అయితే అన్యాయం జరుగుతుందని లెక్కలతో చెప్పారు. అయినా కోర్టులు సమర్దించి పరీక్ష నిర్వాహణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పరీక్షలు నడుస్తున్నాయి. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ కోసం కేబినేట్ సబ్ కమిటీని మంత్రులతో కూడిన కమిటీని వేశారు. ఆ తరువాత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఏక సభ్య కమిషన్ హై కోర్టు మాజీ న్యాయమూర్తి షమీమ్ అక్తార్‌తో వేసింది. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఆ లోపు జరిగే ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబందించిన పరీక్షలను సైతం ఆ కమిటీ రిపోర్ట్ వచ్చే వరకూ వాయిదా వేయాలి. లేదంటే గ్రూపు 2, గ్రూపు 3లోనూ మాదిగ అభ్యర్థులకు తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పుడు ఎస్సీ జాబితాలోని పూర్తి లెక్కలు తీయకుండా.. వర్గీకరణ అమలు చేయకుండా నియామక పరీక్షలు నిర్వహిస్తే మాదిగ నిరుద్యోగ అభ్యర్థులు మరో దశాబ్దం అంధకారంలోకి వెళ్లే అవకాశం ఉంది. గ్రూపు -2, గ్రూపు 3లోనైనా ఎస్సీ వర్గీకరణ అమలు చేసేలా ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చి న్యాయం చేయాలి.
మాదిగలకు తొలి నుంచీ అన్యాయమే...!
మాదిగల కంటే మాల కమ్యూనిటీ ఒక తరం ముందు ఉందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అలాగే మాదిగల ఓట్ల వల్లే తాను జడ్పీటీసీ కాగలిగానని, ఆ తరువాత ఎమ్మెల్యేగా ఇలా అనేక సందర్భాలలో మాదిగలు తన వెంట నిలిచారని ఆయన చెప్పారు. మాదిగలకు కొంత అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమేనని సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు. అటువంటి స్పష్టత ఉన్నప్పుడు తక్షణం ఎస్సీ వర్గీకరణ అమలులోకి తెచ్చి అత్యంత వెనుకబడిన మాదిగ, ఉపకులాల సామాజిక వర్గాలకు అండగా నిలవాలి. లేకుంటే మాదిగల బతుకులు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడే పరిస్థితి ఉంది. ఆర్థిక వెనుకబాటు ఉన్న వారికి రిజర్వేషన్ల అమలులో ఎటువంటి జాప్యం లేకుండా అమలు చేస్తున్నప్పుడు .. తరతరాలుగా నలిగిపోతున్న ఈ వర్గాలకు సుప్రీం ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలతోనైనా వీలైనంత త్వరగా అమలు చేయాలి.
మా ఆకాంక్షను అర్థం చేసుకోండి
తెలంగాణలో జరగబోయే ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూడాలి. లేకుంటే డీఎస్సీ, గ్రూపు -1లో నష్టపోయినట్లు మరోసారి నష్టపోయే అవకాశం ఉంది. నవంబర్‌లో గ్రూపు 3, డిసెంబరులో గ్రూపు 2 పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఒకవేళ ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు కల్పించకపోతే నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసి... తరతరాల మాదిగల ఆవేదనను అర్థం చేసుకోవాలి. వర్గీకరణ అమలుతో కూడిన నియామకాలు చేపడితే తప్పా మాదిగ, ఉపకులాల బతుకుల్లో వెలుగులు నిండవు. ఎవరి జనాభా ప్రతిపాదికన వారికి దక్కాల్సిన వాటా దక్కాల్సిందే. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పాలకుల అధికార దాహనికి...మాదిగల నినాదం బలమై... మా బతుకులు బలిపీఠం మీద వేలాడేలా చేయడం మంచిది కాదు.
సంపత్ గడ్డం
78933 03516