కలెక్టర్​ లాగిన్‌లో రెండే ఆప్షన్లు..క్రమ క్రమంగా ధరణిలో చేర్పులు మార్పులు

by Aamani |
కలెక్టర్​ లాగిన్‌లో రెండే ఆప్షన్లు..క్రమ క్రమంగా ధరణిలో చేర్పులు మార్పులు
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ధరణిలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్నికల ఎజెండాలో ప్రధాన అంశం. అయితే ఇప్పటికీ ధరణి దరఖాస్తులు క్లియర్​ కాకపోవడంతో బాధితులు నిత్యం కలెక్టర్​ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో బాధితులు సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాలను ఒక్కొక్కటి గా పరిష్కారం చేయాలని కాంగ్రెస్​ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే అధికారం చేపట్టిన కొద్ది రోజులకే ధరణిలోని ఆప్షన్లు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అయినప్పటికీ రైతులకు ఈ ఆప్షన్లు ఉపశమనం కలిగించలేదని తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ధరణి ఆప్షన్ల ఫైనల్​ అధికారాలు వికేంద్రీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో కలెక్టర్​‌పై భారం తగ్గడమే కాకుండా ధరణి బాధితులకు కొంత ఊరటేనని చెప్పాలి. ఇంతకాలం కలెక్టర్లు ధరణి దరఖాస్తులతోనే కాలం గడిచిపోయిన పరిస్థితులున్నాయి. ఇప్పుడు జిల్లాలోని అన్ని శాఖలను సమన్వయం చేయడంతో పాటు అభివృద్ధి కార్యాక్రమాలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.

రెండు ఆప్షన్లకే కలెక్టర్ అధికారం..

గత ప్రభుత్వంలో 33 ఆప్షన్లకు కలెక్టర్​ ఫైనల్​ అథారిటీ ఉండే.. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు ఆప్షన్లకు కుదించింది. ఇప్పుడు కేవలం రెండు ఆప్షన్లకే పరిమితం చేసింది. కలెక్టర్​ ధరణి దరఖాస్తులు ఎన్ని క్లియర్​ చేస్తున్నారు..? ఏ ఏ స్థాయిలో దరఖాస్తుల అప్లికేషన్లు ఉన్నాయనే విషయాన్ని సమీక్షించుకునే వీలు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం పని విభజన చేయడంతో పెండింగ్​ దరఖాస్తులు తొందరగా క్లియర్​ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కలెక్టర్​ లాగిన్​ లో నిషేధిత జాబితాలో ఉన్న భూములు, టీఎం–33 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన లాగిన్​లు అదనపు కలెక్టర్​ రెవెన్యూ, ఆర్డీవోలకు కేటాయించారు.

సక్సెషన్​ క్లియర్​ ఆర్డీవో పరిధిలోనే..

ధరణి పోర్టల్​ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సక్సెషన్​ దరఖాస్తు క్లియర్​ కలెక్టర్​ పెట్టడంతో అనేక మంది ఇబ్బంది పెట్టారు. వారసత్వంగా వచ్చే భూములను కూడా పొందే పరిస్థితి లేకుండా ప్రభుత్వం ఆప్షన్లు పెట్టింది. ఒక్కో కలెక్టర్​ ఒక్కో విధంగా ఆప్షన్లకు కండీషన్లు పెట్టారు. అందులో సక్సెషన్​ ఆప్షన్ ​కు లీగల్ హైర్​ ధ్రువీకరణ పత్రం, భూమి ఏ విధంగా సక్రమించిందో పహాణీలు, పంచాయతీ కార్యాలయంలో నోటిఫికేషన్​ వేసినట్లు కార్యదర్శి సంతకం లాంటి విషయాలు తప్పకుండా నివేదికకు జత చేయాలని చెప్పడంతో ఏ ధ్రువీకరణ పత్రం లేకపోయినా రిజెక్ట్​ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో బాధితులు కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన పరిస్థితులున్నాయి. ఇప్పుడైనా ఆర్డీవో కి ఇచ్చిన అధికారాలతో సక్సెషన్​ సాఫీగా సాగుతుందా? లేదా? అనే అనుమానాలున్నాయి. తల్లిదండ్రులు సంపాదించిన భూములను తమ పేర్లపై దక్కించుకోలేని దౌర్భగ్యం ధరణితో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అదనపు కలెక్టర్​ ఈ ఆప్షన్లకు ఫైనల్​..

ధరణి పోర్టల్​ ప్రారంభించినప్పటి నుంచి తహశీల్దార్​ నుంచి నేరుగా కలెక్టర్ ​కు రిపోర్ట్​ పంపిస్తే అప్రూవల్​, రిజెక్ట్ ఉండేవి. కానీ తర్వాత ఆర్డీవో ద్వారా దరఖాస్తుల నివేదికలు పంపాలనే నియమం పెట్టారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనపు కలెక్టర్​ రెవెన్యూ రికమండ్​ చేస్తే తప్ప కలెక్టర్ నిర్ణయం తీసుకోవద్దనే నియమం పెట్టారు. ఇప్పుడు ఏకంగా అదనపు కలెక్టర్ ​కే మూడు ఆప్షన్లు ఫైనల్ నిర్ణయం తీసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అందులో పెండింగ్​ మ్యుటేషన్​, కోర్టు కేసు పీపీబీ, నాలా లేదా హౌస్​ సైట్​ మాడ్యూల్​ దరఖాస్తులపై నివేదిక ఆధారంగా పూర్తిస్థాయి నిర్ణయం తీసుకునే అవకాశం కల్పించారు. ఈ ఆప్షన్లు ఇప్పటికే చేర్పులు మార్పులు చేసినట్లు రెవెన్యూ అధికారులు వివరించారు.

Advertisement

Next Story

Most Viewed