Cabinet Expansion: ఆ జిల్లా నుంచి పోటీలో నలుగురు.. 6 స్థానాలు భర్తీ చేసేందుకు సీఎం రేవంత్‌ ప్లాన్ (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-22 06:36:13.0  )
X

దిశ, తెలంగాణ బ్యూరో: వచ్చే నెల 7వ తేదీలోపు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎవరెవరిని మంత్రివర్గంలో తీసుకోవాలనే అంశంపై నెక్ట్స్ వీక్ ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌తో డిస్కస్ చేసే చాన్స్ ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ప్రస్తుతం కేబినెట్‌లో ప్రాతినిధ్యంలేని ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాలకు ప్రయారిటీ ఇవ్వనున్నారు. సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరు రెడ్లు, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరిని కేబినెట్‌లో తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఏడాది వేడుకలకు పూర్తి స్థాయి కేబినెట్?

డిసెంబర్ 7వ తేదీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కానున్నది. ఇంతకాలం కేబినెట్ విస్తరణ చేయకపోవడానికి బలమైన కారణాలే ఉన్నట్టు కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. మంత్రి వర్గంలో తీసుకునే ఎమ్మెల్యేల సామాజిక సమీకరణలు కుదరక కొంత కాలం ఆ ప్రక్రియ వాయిదా పడిందని, ఆ అంశం కొలిక్కి వచ్చిన తర్వాత ఏఐసీసీ నేతలు హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో బిజీగా ఉండి పోయాని, ఈనెల 23న ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అధిష్టానం కేబినెట్ విస్తరణకు క్లియరెన్స్ ఇస్తుందనే ఆశలో పార్టీ నేతలు ఉన్నారు. ‘మేము పవర్‌లోకి వచ్చి డిసెంబర్ 7వ తేదీతో ఏడాది పూర్తి కానున్నది. ఈ లోపే కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ రిజల్ట్స్ తర్వాత విస్తరణ ఉంటుంది’. అని ఓ మంత్రి చెప్పారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎక్కువ మంది పోటీ

పార్టీలోకి వచ్చే ముందే తనకు మంత్రి పదవి ఇస్తారని అధిష్టానం హామీ ఇచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెబుతుండగా.. ఎస్టీ సామాజిక వర్గం నుంచి తనకు తప్పక మినిస్టర్ పోస్టు వస్తుందనే ఆశలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ఉన్నారు. కేబినెట్‌లో మాదిగ సామాజిక వర్గానికి ప్రయారిటీ లేదని, తనకూ మంత్రి పదవి ఇవ్వాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం కోరుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఆలేరు ఎమ్మెల్యే, విప్ బీర్ల అయిలయ్య సైతం తీవ్రంగా ప్రయత్నిస్తుట్టు తెలిసింది.

నిజామాబాద్ నుంచి సుదర్శన్‌ రెడ్డి పేరు ఫైనల్!

కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న సుదర్శన్‌రెడ్డిని కేబినెట్‌లో తీసుకుని కీలక శాఖ ఇచ్చే చాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే అదే జిల్లాకు చెందిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు సైతం పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఆసక్తికరమైన పోటీ నెలకొన్నది. జీ.వెంకటస్వామి కుమారులు వినోద్, వివేక్ ఇద్దరూ మినిస్టర్ పదవి కోసం పోటీ పడుతుండగా, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ సైతం తనకు మంత్రి పదవి ఖాయమనే ధీమాతో ఉన్నట్టు తెలుస్తున్నది. హైదరాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు మినిస్టర్ పోస్టు దక్కుతుందని ప్రచారంలో ఉన్నది.

లాబీయింగ్‌కు సిద్ధం

మహారాష్ట్ర ఫలితాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆశావహుల్లో ఉత్సాహం, ఉత్కంఠ పెరిగింది. ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు లాబియింగ్ షురూ చేసేందుకు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేసేందుకు ఆ నేతలంతా రెడీ అయ్యారు. మినిస్టర్ పదవి కోసం ఇప్పటికే కొందరు సీఎం రేవంత్ వద్ద ప్రయత్నాలు చేస్తుండగా, ఇంకొంత మంది ఢిల్లీ నేతల నుంచి సిఫారసు చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరికొందరు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ ద్వారా లాబియింగ్ చేయిస్తున్నట్టు తెలిసింది.

Advertisement

Next Story