- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వీరప్పన్ క్రూరుడే, కానీ..
ఓటీటీలో నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేస్తున్న డాక్యుమెంటరీ సిరీస్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విషయ సేకరణ, నిర్మాణ నాణ్యతలో వారి కృషి, శ్రమ వల్ల అవి విజయం సాధిస్తున్నాయి. ఆగస్టులో నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన 'ది హంట్ ఆఫ్ వీరప్పన్' వాటిలో చెప్పుకోదగ్గది. ఒక్కోటి సుమారు ముప్పావు గంట వ్యవధితో 4 ఎపిసోడ్లలో దీనిని నిర్మించారు. మాసిపోయిన గాయాన్ని రేపిన ఈ సిరీస్‌కు వీక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోంది. సినీ ప్రేమికులు చిత్రీకరణ తీరును మెచ్చుకోగా, కర్ణాటక పోలీసులు అడవి సమీప గ్రామాల్లో చేసిన దాష్టికాలను కావాలనే వదిలేశారని సామాజిక విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
స్మగ్లింగ్ నుంచి మందుపాతరల దాకా...
వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి మాటలతో ఈ సిరీస్ మొదలవుతుంది. మంచివాళ్ళకు మంచివాడు, మోసగాళ్లకు మోసగాడు అన్న ధోరణిలో ఆమె వీరప్పన్ గురించి చెబుతుంది. ఆమె మాటల్లో వీరప్పన్ మంచి భర్తగా, తండ్రిగా, పేదల మనిషిగా కనబడతాడు. ఆమెతో జరిపిన సంభాషణ అంతా చిరునవ్వుతో ఆయన జ్ఞాపకాలు కెమెరా ముందు నెమరేసుకున్నట్లుగానే ఉంది. వీరప్పన్ సహచరుల, ఆనాటి అటవీ అధికారుల మాటల ప్రకారం తమిళనాడు కర్ణాటకల మధ్య ఉన్న విశాలమైన అడవిలో ఏనుగులను చంపి వాటి దంతాలను అమ్మడంతో వీరప్పన్ నేర చరిత్ర 1990లో మొదలవుతుంది. సుమారు వేయి ఏనుగులను చంపేసి దాదాపు అడవిలో ఏనుగులను ఖాళీ చేశాడని బి కె సింగ్ అనే ఫారెస్ట్ ఆఫీసర్ అంటారు. ఆ తర్వాత గంధపు చెట్లపై తన కన్ను పడింది. అడవిలో ఉన్న చందనపు చెట్లను వందల మందితో నరికేయిస్తూ వాటిని స్మగ్లింగ్ చేసి లెక్కలేనంత ధనాన్ని కూడబెట్టాడు. అడవిని అనుకోని ఉన్న ఊర్లలో పేదల అవసరాలకు, కష్టాలకు ఉదారంగా సాయపడేవాడు. అలా గ్రామీణుల్లో ఆయన పట్ల భయంతో పాటు గౌరవం కూడా ఏర్పడింది. దాంతో అటవీ అధికారులకు, పోలీసులకు గ్రామస్తులు వీరప్పన్‌ను పట్టుకొనే విషయంలో సహాయపడేవారు కాదని వీరప్పన్ సహచరుల అభిప్రాయం. మందుపాతరలతో ఫారెస్ట్ సిబ్బందిని చంపడంతో ఆయన హింస మొదలైంది. అందులో ఐఎఫ్ఎస్ అధికారి అయిన పి. శ్రీనివాస్ హత్య దారుణమైనది. అప్పుడు వీరప్పన్ వేట ఫారెస్ట్ అధికారుల నుండి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ చేతిలోకి వెళ్లడంతో అడవిలో గాలింపు అధికమవుతుంది. ఆ క్రమంలో గ్రామీణులు దుర్భరమైన పోలీసు హింసను, అణచివేతను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ యుద్ధంలో వీరప్పన్ అనుచరులు, సమీప గ్రామస్తులు 120 మంది చనిపోయారు. రెండు రాష్ట్రాల పోలీసులు పదేళ్ళపాటు శ్రమించి చివరకు 2004లో వీరప్పన్‌ను తుదముట్టించారు.
అదే వీరప్పన్‌ని పట్టించిందా?
మరోవైపు వీరప్పన్ వేటలో సిట్ బృందం గ్రామాలను తగలబెట్టింది. వారు అమాయక గ్రామీణులను విపరీతంగా హింసల పాలు చేశారు. వర్క్ షాప్ అనే గోడౌన్ లాంటి షెడ్‌ను నిర్మించి అందులో రోజుల తరబడి ఆడ, మగవాళ్ళను క్రూరంగా చిత్ర హింసలు పెట్టారు. అందులోకి వెళ్లిన వారిలో ప్రాణాలతో బయటపడ్డవారు తక్కువ. దానికి సారథ్యం వహించి పరమ క్రూరుడిగా ముద్ర పడిన ఆనాటి కర్ణాటక డిజిపి శంకర్ బిదరి ఈ సిరీస్‌లో కనబడడు. బహుశా ముఖం చాటేసి ఉంటాడు. రెండు మాటలతో వర్క్ షాప్ ఉదంతాన్ని ముగించడం వల్ల ఈ సిరీస్ ప్రభుత్వాన్ని వెనుకేసుకొచ్చిందని విమర్శలు వచ్చాయి. వాచాతి కేసు ప్రస్తావన, కోర్టు తీర్పు గురించి పూర్తి సమాచారం ఇందులో లేదు. వాచాతి అనే గ్రామంలో గిరిజన మహిళలపై పోలీసుల అత్యాచారాలపై 1992 లో మద్రాస్ హైకోర్టులో వేసిన కేసుకు 2011 లో తీర్పు వచ్చింది. అందులో 269 అటవీ, పోలీసు అధికారులు, సిబ్బందిని నేరస్తులుగా ప్రకటించి కోర్టు శిక్షలు వేసింది. అయితే ఇప్పటికి పై కోర్టు అప్పీలు పేరిట అందరూ బయటే ఉన్నారు. వారిలో కొందరు మరణించారు కూడా. వీరప్పన్ చేతుల్లో కన్నడ నటుడు రాజ్ కుమార్ కిడ్నాప్, విడుదల గురించి మాత్రం చాలా వివరంగా ఉంది. వీరప్పన్ బీబీసీ వార్తలు వినేవాడని, సంఖ్యాబలం తగ్గడంతో చివర్లో శ్రీలంక పారిపోవాలని ప్రయత్నించాడని చూపారు. అయితే ఆ ప్రయత్నమే పోలీసులకు ఉపయోగపడింది.
ఎవరు దొంగలు, స్మగ్లర్లు?
అందరికీ ఆసక్తికరమైన వీరప్పన్ నేర చరిత్రని దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ ఎంతో శ్రమకోర్చి చిత్రీకరించారు. ఆస్కార్ అవార్డు పొందిన 'లైఫ్ ఆఫ్ పై'కి ఆయన అసిస్టెంట్. నీల, కాంత అనే తమిళ చిత్రాలకు దర్శకుడు. నాలుగు ఎపిసోడ్స్‌ల ఈ సిరీస్‌ని వదలకుండా చూసేలా దర్శకుడు పట్టు సాధించారనవచ్చు. ఈ సిరీస్‌కి ఫొటోగ్రఫీ, మ్యూజిక్ ప్రాణపదాలు. చిత్రీకరణ, నేపథ్య సంగీతం వీక్షకులని ఆ కారడవిలోకి తీసుకెళ్తాయి. సెల్వమణి, అతని బృందం రెండేళ్లు స్క్రిప్ట్ వర్క్, ఏడాది చిత్రీకరణ, మరో ఏడాది పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ప్రాజెక్ట్‌ని తీర్చిదిద్దారు. సిరీస్‌కి దక్కిన ఆదరణతో వారి నాలుగేళ్ల శ్రమ ఫలించింది అనవచ్చు. వీరప్పన్‌కు చెందిన వీడియోలు, ఫోటోలు, పేపర్ కటింగ్స్ ఎన్నో ఇందులో చూడొచ్చు. వాటిని సన్నివేశాలకు తగ్గట్లుగా చిత్రీకరించిన తీరు బాగుంది. నాలుగు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ అయినా ఒక చక్కటి సినిమా చూసిన ఫీల్ ప్రేక్షకులకు కలుగుతుంది. ఫిక్షన్ డైరెక్టర్ అయిన సెల్వమణి నాన్ ఫిక్షన్‌లో కూడా ఇలా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఎవరిని తప్పు పట్టకుండా వీరప్పన్ వేటనే నా సబ్జెక్ట్ అని దర్శకుడు అన్నారు. లంచగొండి అధికారుల మద్దతుతో ఎందరో స్మగ్లర్లు అడవిని ధ్వంసం చేస్తుంటే, ఆ స్మగ్లర్లే ప్రజానేతలుగా చెలామణి అవుతుంటే, అడవి ద్వారా వచ్చిన సొమ్మును పేదలకు పంచుతున్న నేను ఎందుకు తలవంచాలి అని ఇందులో వినబడే వీరప్పన్ వాదన ఒప్పుకోకున్నా.. ఈ సిరీస్ చివరి దాకా చూశాక అయిదు వేల రాత్రులు అడవిలో గడిపిన వీరప్పన్ క్రూరుడే కానీ..అని అనిపించక మానదు.
- బి.నర్సన్,
రచయిత, సామాజిక విశ్లేషకులు
94401 28169