- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సినిమా హిట్ ఫార్ములా... దొంగ
చిత్ర పరిశ్రమలో హిట్ ఫార్ములాగా కొన్నింటిని అనుసరిస్తారు. వాటిలో వరుస చిత్రాలు నిర్మిస్తారు. కథననుసరించి ప్రధాన పాత్రలకు ప్రముఖ హీరోలను తీసుకుంటారు. ఎనభైశాతం విజయాన్ని ఆశిస్తారు. ఈ వరుసలోకి వచ్చే ఫార్ములా ‘దొంగ’ పాత్రలు. 1950 నుంచి గమనించి చూస్తే ‘దొంగ’ పాత్రలను తీసి ప్రముఖ హీరోలు, దర్శక నిర్మాతలు ప్రేక్షకుల నుంచి కాసుల వర్షం కురిపించుకున్నారు. నాటి రాజు- పేద నుంచి కూడా ఈ ‘దొంగ’ పాత్ర విజయవంతమైన సినీ సూత్రమే. నాటి నుంచి నేటి వరకు ‘దొంగ’ పాత్రలు అద్భుతంగా చిత్రించిన దర్శకులు ఎందరో ఎందరెందరో బి. ఏ. సుబ్బారావు, ఆదుర్తి సుబ్భారావు, వి. మధుసూధనరావు, కె.ఎస్. ప్రకాశరావుల నుంచి నేటి రాజమౌళి వరకు ఈ జాబితా కొనసాగుతూ వస్తున్నది.
పాత్రలో నాటకీయత ఉండటంతో..
రాఘవేంద్రరావు ‘గజదొంగ’లో ఎన్టీఆర్ ‘గోల్డ్ మ్యాన్’గా చిత్రించారు. ఓ పాట కూడా చిత్రించారు. ఒకానొక దశలో ‘దొంగ’ పేరుతో వరుసగా సినిమాలు. ‘దొంగ రాముడు’, ‘టక్కరి దొంగ’ ‘బందిపోటు దొంగలు’, ‘దొంగలుకు దొంగ’, ‘జేబు దొంగ’, ‘ అడవి దొంగ’... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే నాటి ఎన్టీఆర్ నుంచి నేటి ఎన్టీఆర్ వరకు ‘దొంగ’ పాత్రలు పోషించి విజయం సాధించుకున్నారు. కలక్షన్‌లను దోచుకున్నారు. ‘భలే తమ్ముడు’ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. అందులో ఒకటి ‘దొంగ’ పాత్ర. మధుసూదనరావు ‘అక్కాచెల్లెలు ‘చిత్రంలో ‘దొంగ’ పాత్రలో (నాగేశ్వరరావు) కథను మలుపు తిప్పుతారు. ఇందులో నాగేశ్వరరావు డ్యూయల్ రోల్ వేశారు. రాజసులోచన, విజయశాంతి, విజయ లలిత తదితరులు ‘దొంగ’ స్త్రీ పాత్రలు ధరించి ధర్మ సంరక్షణ చేసేవిగా పేరు సంపాదించుకున్నారు. ఇది తరతరాల ‘దొంగ’ చిత్రాల విజయ గాథ. ‘దొంగ’ పాత్రలతో కథను అల్లుకొనేవారు. తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో ఎక్కువగా ఉంటారు. ఆంగ్లంలో రాబిన్ హుడ్ కథలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి.. వస్తున్నాయి. ‘దొంగ’ కథలకు కావలసినంత కాన్వాసు ఉంటుంది. సెంటిమెంట్, ప్రేమ, డ్రామా, నాటకీయత వంటివి అద్భుతంగా పండుతాయి. ‘దొంగరాముడు’ చిత్రంలో ఏఎన్నార్, జగ్గయ్య, జమునల మధ్య నడచిన సన్నివేశాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సెంటిమెంట్ గీతం కూడా చిత్రిస్తారు. ఇదో మాస్, కమర్షియల్ ఎలిమెంట్ గీతం కూడా చిత్రిస్తారు. ఇదో మాస్, కమర్షియల్ ఎలిమెంట్‌గా చిత్ర పరిశ్రమ భావిస్తుంది.
చిత్రసీమకు విజయ కేతనాలుగా..
వర్తమానానికొస్తే... దొంగపాత్రల ఆహార వ్యవహారాలు మారాయి. బుగ్గన చుక్క, గళ్ళ లుంగీ, గళ్ళ చొక్కా, పెద్ద బెల్ట్, మెడలో కర్చీఫ్ పాత ఆహార్యం. కానీ... నేటి చిత్రాలలో ఖరీదయిన, అత్యంత సహజమైన సంభాషణలలో ‘సైలెంట్’గా తడిగుడ్డలతో గొంతులు కోసే ‘మాఫియా డాన్’లు ‘దొంగ’ పాత్రలుగా చలామణి అవుతున్నారు. మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ ఈ ఒరవడికి శ్రీకారం చుట్టారని చెప్పాలి. కమలహాసన్, రజనీకాంత్‌ల దగ్గర నుంచి రవితేజ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్(జూ), అల్లు అర్జున్, కార్తి, విష్ణు, విష్వక్ సేన్ వంటి ప్రముఖులు కూడా ఈ తరహా పాత్రలను పోషించారు. రఫ్‌గా ఉండే దొంగ పాత్రలతో (పుష్ప1, 2) వంటి చిత్రాలతో పాటు కామెడీ ‘దొంగలు’ పాత్రలు నాటి రాజనాల గుండమ్మ కథ, నేటి రవితేజ విక్రమార్కుడు, ఎన్టీఆర్ యమదొంగ వంటి వారున్నారు. ‘దొంగ’ పాత్రలను విజయవంతం చేసిన హీరోల సినిమాలు సీక్వెల్స్‌గా కూడా వస్తున్నాయి. శ్రీ విష్ణు నటించిన ‘రాజరాజ చోర’, అల్లు అర్జున్ నటించిన పుష్ప, కెజిఎఫ్ రెండుభాగాలు వంటివి కొన్ని ఉన్నాయి. ‘సర్దార్’ ‘పొన్నియన్ సెల్వన్’లతో విజయాలందుకొన్న కార్తి ‘జపాన్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయన ‘బంగారు దొంగ’ అని సినీ వర్గాల టాక్. దీనికి రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’, రవితేజ నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి జీవిత కథలు తెర మీద సందడి చేయబోతున్నాయి. ‘దొంగ’ పాత్రలు చిత్రసీమకు విజయ కేతనాలు. దర్శక నిర్మాతలకు ఆదాయ మార్గాలు. హిట్ గ్యారంటి అని చెప్పగల చిత్రాలు. ప్రేక్షకులను అలరించే వినోదాలు. కనుకనే ‘దొంగ’ పాత్రలు తెర మీద గొప్ప ‘హీరోలు’.
- భమిడిపాటి గౌరీశంకర్
94928 58395