- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వంటింటి పురాగాథ... ది గ్రేట్ ఇండియన్ కిచెన్
చాలా ఆలస్యంగా ఈ సినిమా గత రాత్రి చూశాను. వంటిట్లో ఐశ్వర్య రాజేష్ కాదు మా అమ్మ కనిపించింది.. అంటూ పెద్దగా ఎమోషన్లకు గురికాని, స్పందించని మా టీమ్ మేట్ ఆఫీసుకు వచ్చి చెప్పిన మొదటి మాట ఇది. ఐశ్వర్య పాత్రలో తన కన్న తల్లిని గుర్తు చేసుకునేంతలా ఉద్వేగం తెప్పించిన ఆ సినిమా ప్రత్యేకత ఏమిటో చూద్దాం.
ఆమె కూరగాయలు తరుగుతుంది. పోపులో ముక్కలు వేయిస్తుంది. వంట వండుతుంది. బట్టలు ఉతుకుతుంది. నేల తుడుస్తుంది. చెత్త తోస్తుంది. వంటింటిని, ఇంటిని ప్రతిరోజూ అద్దంలా ఉంచుతుంది. ఆమె భర్త ఏమో, బ్రేక్ ఫాస్ట్ చేసి ఆఫీసుకు వెళ్లడానికి ముందు రోజూ యోగా చేస్తాడు. ఆ యింటిలో మరోవైపు ఆమె మామ తన టూత్ బ్రష్‌కి పేస్ట్ పెట్టి అందించే కోడలి కోసం వేచి చూస్తూ, వార్త పత్రిక చదువుతూ రిలాక్స్ అవుతుంటాడు. ఇంట్లో భర్త, మామ.. ఇలా మగవాళ్లందరు తమ శరీరాలను, మనస్సులను వ్యాయామం ద్వారా రంజింప చేసుకుంటుంటారు. ఆమె మాత్రం ఆ మగాళ్లు నిద్రలేవగానే పక్కలు సర్దడం మొదలుకొని ఇంటిలో వారు పోగు చేసే చెత్త నంతటినీ బయట కుప్పలో పోయడం వరకు ప్రతి పనిలో నిమగ్నమవుతుంటుంది. ప్రతి రోజూ చెత్తను బయటపారేసే పని ఆమెదే. రోజూ దీపం వెలిగిస్తుంది. ఇంట్లో అందరికంటే ముందు నిద్రలేస్తుంది. అందరికంటే ఆలస్యంగా నిద్రపోతుంది. ఒళ్లు హూనమై అలసిపోయి పక్కచేరిన క్షణంలో కూడా సామాజికంగా, చట్టబద్ధంగా తనను పెళ్లాడిన భర్త చేతిలో 'అత్యాచారాని'కి గురవుతుంటుంది.
ఇంట్లో మధ్యతరగతి స్త్రీ రోజువారీ జీవితంలోని ప్రతి సన్నివేశానికి ఎవరైనా దృశ్య రూపం ఇస్తే అప్పుడది 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్' అవుతుంది. అది పితృస్వామ్యం, మతం కలిసి తిష్టవేసిన వంటింటి మహా సామ్రాజ్యం. రచయిత, దర్శకుడు జో బాబీ మళయాలంలో తీసిన ది గ్రేట్ ఇండియన్ సినిమా ఇప్పటికే తమిళం, తెలుగు, కన్నడం, హిందీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రదర్శితమై వీక్షకులను దిగ్భ్రాంతిపర్చింది. రోజువారీ భారతీయ జీవితంలో ప్రత్యేకించి మధ్యతరగతి వంటిళ్లలో జరుగుతుండే భయానక వాస్తవాలను అత్యంత నిర్దిష్టంగా చూపించిన మేటి చిత్రం ఇది. లక్షలాది భారతీయ వంటిళ్లలో జరుగుతున్న రోజువారీ ఘటనలను అద్దంలాగా ప్రతిబింబించిన సినిమా. మలయాళంలో ఉన్నా, ఇతర భాషల్లో ఉన్నా.. పితృస్వామ్యానికి భాషా భేదాలు, ప్రాంతీయ భేదాలు లేవని ఈ సినిమా టైటిల్ చాటి చెబుతుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ సినిమాలో పాత్రలకు పేర్లుండవు. ఎందుకంటే దీంట్లోని ప్రతిపాత్రలోనూ నువ్వూ నేనూ, వీరు వారూ ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట కనబడుతూనే ఉంటారు.
భర్త ఇంటినుంచి బయటకు వెళ్లేటప్పుడు అతడి చెప్పులు కూడా తీసి సిద్ధం చేయడం ఇంట్లోని స్రీ బాధ్యతే. (వందేళ్లక్రితం శరత్ చంద్ర చటోపాధ్యాయ్ వంటి బెంగాలీ లెజెండరీ రచయితల నవలల్లో భర్త పాదధూళిని తలపై పెట్టుకుని భార్య పాత్ర తరిస్తుంటుంది. రాసింది శరత్ పేరుగల మగాడే కదా మరి). పురుషుడు పొరపాటున వంట చేస్తే అతడు పారవేసే చెత్త అంతటినీ క్లీన్ చేయాల్సిన బాధ్యత కూడా స్త్రీదే. పైగా ఆ పనిచేసినందుకు ఆ మగాడికెంత గర్వం అంటే ఇంటి ఆడదానికి ఒక పూట విరామం కలిగించినందుకు చంకలు గుద్దుకుంటూ గర్వంగా చెప్పుకుంటాడు. ఇవి ఈ సినిమాలో మాత్రమే కనిపించే కాల్పనిక పాత్రలు కావు. మన ఇంట్లో, లేదా మనం సందర్శించే బంధువుల ఇంట్లో, మిత్రుల ఇంట్లో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు 21వ శతాబ్దం ప్రథమార్థంలో కూడా దర్శనమిస్తూనే ఉంటాయి. పైగా మహిళ అనుభవించే సమస్త శ్రమల భారాన్ని.. కుటుంబం కోసం ఎంత కష్టమైనా భరించే దేవతలాగా పొగుడుతుంటాం. రాస్తుంటా, తీస్తుంటాం. కాస్త స్వేచ్ఛకోసం, కాస్త తీరుబడి కోసం అలమటించే మహిళను దేవతగా వర్ణిస్తూంటాం. గంట 40 నిమిషాల పాటు సాగే ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమా మనందరి జీవితాల్లోని లేకితనాన్ని, అమానుషత్వాన్ని చాలా సహజంగా చూపించింది.
నేటికాలంలో ఇంట్లో పని విషయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉద్యోగాలకు వెళ్తున్న ఎంతోమంది జంటలున్నారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు కూడా.. కానీ వంటిపని, ఇంటి పని మహిళకు చెందిందే అనే భావజాలం మాత్రం ఇప్పటికీ భారతీయ కుటుంబాల్లో బలంగా పాతుకుపోయి ఉంది. దాని విశ్వరూపాన్ని చూపించిన చిత్రమిది. వంట మనిషిగా, క్లీనర్‌గా, సమస్త ఇంటి పనులు చేసే పనిమనిషిగా, మగాడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు సెక్స్ కోరికలు తీర్చే సెక్స్ బానిసగా... భారతీయ స్త్రీ వంటింటి జీవిత చిత్రణను అసాధారణంగా చూపించిన అరుదైన చిత్రమిది.
ఉద్యోగాలు చేయడం మగవాళ్ల బాధ్యత ఇంటిని చక్కదిద్దడం ఆడవాళ్ల పని అంటూ సమాజంలో పేరుకుపోయిన పురాతన కట్టుబాట్లు సంప్రదాయాల కారణంగా మహిళలు ఎలాంటి వివక్షను ఎదుర్కొంటున్నారో ఈ సినిమాలో ఆలోచనాత్మకంగా చూపించారు. కాలం మారుతోన్న కొందరు మాత్రం ఇప్పటికీ ఈ కట్టుబాట్ల పేరుతో మహిళల కలల్ని ఎలా కాలరాస్తున్నారో సందేశాత్మకంగా ఆవిష్కరించారు. వంటగది నుంచే మహిళలపై వివక్ష మొదలవుతుందనే పాయింట్‌ను చర్చిస్తూ సినిమాను రూపొందించారు. కాలం చెల్లిన భర్త ఆలోచన విధానాల వల్ల ఐశ్వర్యరాజేష్ ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నది? భర్త, మామలకు ఆమె ఎలా బుద్దిచెప్పింది? తన కలల సాకారం కోసం ఐశ్వర్య రాజేష్ తీసుకున్న నిర్ణయమేమిటన్నదే ది గ్రేట్ ఇండియన్ కిచెన్ కథ.
పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన ఐశ్వర్యరాజేష్ భర్త తో పాటు మామకు వండిపెడుతూ వంటింటికే ఎలా పరిమితమైందన్నది చూపిస్తూ కథను ముందుకు నడిపించారు దర్శకుడు. చివరకు కలలో కూడా వంటిల్లే కనిపించేంతగా అదే ఆమె లోకంగా ఎలా మారిపోయిందో వాస్తవికంగా చూపించారు. వంటింటి బందిఖానా నుంచి బయటపడటానికి దారితీసిన సన్నివేశాల్ని వాస్తవిక కోణంలో స్క్రీన్‌పై ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లతో పాటు మిగిలిన పాత్రలకు పేర్లు పెట్టలేదు డైరెక్టర్. మలయాళ సినిమాను సీన్ టూ సీన్ కాపీ చేయడం వల్ల కమర్షియాలిటీ దూరంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ సినిమాలో చర్చించిన అంశం మాత్రం ఆలోచనను రేకెత్తిస్తుంది. చిన్న చిన్న అంశాలను తీసుకుని సినిమాను హృద్యంగా మలచడంలో మలయాళ చిత్ర పరిశ్రమ ముందుంటుంది. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’. అదే పేరుతో ఈ సినిమాను తమిళ్‌లోనూ తీర్చిదిద్దారు. గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
'నీకు వంట చేయడం ఇష్టమా', 'నాకు వంట ఎలా చేయాలో తెలుసు..', 'నాకు తినడం ఇష్టం'. ఈ మూడు పదబంధాలు భారతీయ వంటింటిలో ఎవరి పాత్ర ఏదో తెలిపే మంత్ర వ్యాక్యాలుగా నిలిచిపోయాయి. వంటింటిలో మాత్రమే సాగిన ఈ సినిమా డాక్యుమెంటరీ ఛాయలను కలిగి ఉన్నా, కమర్షియల్ వాసనలకు దూరంగా కనువిందు చేయడం కాదు. కనువిప్పు కలిగించేదిగా ఉంది. ఓటీటీలోనే కాదు. యూట్యూబ్ లోనూ వివిధ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా మన కథ. మన వంటింటికథ. ఆ వంటిట్లో మగ్గిపోయే మహిళల కథ.
సోవియట్ యూనియన్ నిర్మాత వీఐ లెనిన్ చెప్పినట్లు స్త్రీ జీవితాన్ని నిస్సారం, నిర్వీర్యం చేసే వంటింటికి సంబంధించిన కథ ఇది. విడివిడి వంటిళ్లకు బదులు సామూహిక కిచెన్‍లు ఏర్పాటు చేసి స్తీలను మొత్తంగా ఉత్పత్తి కార్యకలాపాల్లోకి దింపాలని, ఇంటిపనిని, వంటపనినీ సామాజీకరించాలని, మహిళల పనిని విలువ ఆధారిత ఉత్పాదక శ్రమగా మార్చాలని లెనిన్ వందేళ్లక్రితం చెప్పిన మాట ఇప్పటికీ యావత్ సమాజ స్వప్నంలాగా మిగిలిపోవడం వేరే విషయం. ఈ స్వప్నాన్ని అలా ఉంచి, గత వందేళ్లుగా మారని మన వంటింటి శ్రమ సంస్కృతిలోని చీకటికోణాన్ని చూడాలంటే ప్రతి ఒక్కరూ ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమా చూసి తీరాల్సిందే. ఇక చివరగా మా టీమ్‌మేట్ అవివాహితుడు అయినా, ఈ సినిమా చూసి నాకు చెప్పిన మాట ‘నా జీవితంలోకి వచ్చిన భాగస్వామిని ఇలా మాత్రం చూడను’ అని. ఈ సినిమా చూడటానికి అంతకు మించి గొప్ప మాటేముంటుంది.
కె. రాజశేఖర్ రాజు
73964 94557