ఏజెన్సీలో తొలి కమ్యూనిస్టు..

by Ravi |   ( Updated:2023-09-29 00:31:09.0  )
ఏజెన్సీలో తొలి కమ్యూనిస్టు..
X

నైజాం కాలంలో తెలంగాణలోని షెడ్యూల్డ్ ఏజెన్సీ గిరిజన ప్రాంతాలు కమ్యూనిస్టుల పాలనలో మిళితమై ఉన్నాయి. ఆ సమయంలో ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాల్లో రజాకార్ల ఆగడాలను ఎదుర్కొన్న తొలి కమ్యూనిస్టు, ఆదివాసీ ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సువర్ణ పాక సుందరయ్య. ప్రత్యేకించి కోయ గిరిజనులకు ఆయన ప్రియతమ నాయకుడు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం రాజరిక నిరంకుశ పాలన సాగుతుండేది. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో మన దేశ కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగిపోవడంతో 1944లో నల్లగొండ జిల్లా భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభ పూర్తిగా కమ్యూనిస్టుల ఆధీనంలోకి వచ్చింది. ఆనాటి భూ పోరాటంలో కీలక భూమిక పోషించిన దొడ్డి కొమురయ్య దొరల చేతిలో బలి కావడంతో కమ్యూనిస్టు ఉద్యమం ఉత్తర తెలంగాణలో ఉదృత రూపం దాల్చింది. అందుకే 1946 నవంబరులో నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని తిరస్కరించినా, కామ్రేడ్ల సాయుధ పోరాటం రజాకార్ల వెట్టిచాకిరికి సమాధి కట్టింది. 1952 మొదటి సాధారణ ఎన్నికల్లో కమ్యూనిస్టులు అఖండ విజయం సాధించడమే అదనుగా తెలంగాణలో 'దున్నేవాడికే భూమి' అనే వివాదం పుట్టుకొచ్చింది.

కమ్యూనిస్టుల ప్రేరణతో...

కోయ తెగకు చెందిన సుందరయ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొత్తగూడెం మండలం మారుమూల మర్రిగూడెంలో జన్మించారు. ఆయన తమ్ముడు పుల్లయ్య, వారి భార్య రామక్కలు అప్పటికే ఒక అజ్ఞాత దళంలో పని చేస్తుండడంతో కమ్యూనిస్టు దళాలు తరచూ స్వగ్రామానికి వచ్చేవి. వారి ప్రేరణతో భార్య దూలమ్మతో కలిసి సుందరయ్య దళంలో చేరిపోయాడు. దళంలో ఆయన సీపీఐ(ఎం) కార్యకర్త స్థాయి నుంచి నర్సంపేట, ములుగు, పర్కాల తాలూకాల ఆర్గనైజర్ స్థాయికి ఎదిగాడు. 1947లో నిజాం సర్కార్ అక్రమ కేసులు పెట్టడంతో రావి నారాయణరెడ్డి, మద్దికాయల ఓంకార్ తో కలిసి 15 నెలలు జైలు జీవితం అనుభవించాడు.

సుందరయ్య తెలంగాణా ఏజెన్సీ ప్రాంతాల ఇన్చార్జిగా పని చేసే సమయంలో వీరు ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో గిరిజనులు, నిరుపేద రైతుల సమస్యలపై నిత్యం పోరాడేవారు. వీటిలో తునికాకు ప్రూనింగ్, తునికాకు సేకరణ, అటవీ ఉత్పత్తుల ధరలు, రైతు కూలీల గిట్టుబాటు ధరలు, దున్నేవాడికే భూమి వంటి ముఖ్య సమస్యలున్నాయి. అలాగే రజాకార్లు గిరిజన, గిరిజనేతర పేదవర్గాలపై అనేక పుల్లరి (శిస్తులు) వసూలు చేయడంతో పాటు గ్రామాల్లో వెట్టిచాకిరిని, అరాచకాలను సృష్టించేవారు దీంతో ఈయన దళం రజాకార్లతో పలుమార్లు ముఖాముఖి పోరాటానికి దిగింది. నైజాం పాలనలో అటవీ అధికారుల దోపిడీని తట్టుకోలేక కొన్ని ఏజెన్సీ గూడేల్లో వలసపోతే వారిని చైతన్యపరిచి వారి వలసలను నిరోధించడానికి పేదలకు కొంత భూమిని పంచుతూ, జంగ్లాతు వారి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు.

సుందరయ్య 1964 నుంచి 1986 వరకు శివారు వేలుబెల్లి గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. ఫెసా చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నది సుందరయ్య నాయకత్వంలోనే. ఆదివాసీ హక్కులు, చట్టాల అమలు కోసం 1974లో ‘కోయ దొరల సంఘం’ పేరుతో ఉద్యమించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకుడు, అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలోనూ ఇక్కడి రైతులు, కర్షకులు, ప్రత్యేకించి తునికాకు కూలీల సమస్యలపై దృష్టిసారించిన ఉద్యమ పిపాసి సుందరయ్యేనని కొనియాడారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో సుందరయ్యకు ఉన్న ఆదరణ చూసి కమ్యూనిస్టు నాయకులు ఆశ్చర్యపోయేవారు. ఇలా నిరంతరం గిరిజన ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ఉద్యమించిన సుందరయ్య 2004 సెప్టెంబర్ 30న అమరుడయ్యాడు. ఆయన వారసులు స్వస్థలంలో స్మారక స్థూపం నిర్మించి వర్ధంతులు నిర్వహిస్తున్నారు.

(రేపు సువర్ణ పాక సుందరయ్య వర్ధంతి)

గుమ్మడి లక్ష్మీ నారాయణ

ఆదివాసీ రచయితల వేదిక,

94913 18409

Advertisement

Next Story