తలైకూతల్.. ఓ మెర్సీ కిల్లింగ్‌

by Ravi |   ( Updated:2023-09-30 00:46:08.0  )
తలైకూతల్.. ఓ మెర్సీ కిల్లింగ్‌
X

భారతదేశంలో సామాజిక కట్టుబాట్లు, కుల, మూఢ ఆచారాలు అనాదిగా ప్రజల్లో నాటుకొని ఉన్నవి. వీటిని పారద్రోలేందుకు చాలా మంది సంఘ సంస్కర్తలు, రచయితలు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కోసం పాటు పడ్డారు. బాల్యవివాహాలు, వితంతు వివాహాలపై గళం విప్పారు. గుడిపాటి వెంకటాచలం, కందుకూరి వీరేశలింగం పంతులు, తాపీ ధర్మారావు, గోరా లాంటి వారు ఈ కోవకు చెందినవారు. ప్రజలను చైతన్య పరచడానికి సినిమా ఒక మాధ్యమంగా వాడుకున్న వారిలో కె బి.తిలక్, బి.నారాయణ, బి.నరసింగరావు, మాదాల రంగారావు, టి.కృష్ణ ,ఆర్.నారాయణ మూర్తి, లాంటి వారు అతి తక్కువ మంది ఉన్నారు. అదే కన్నడంలో పుట్టన్న కనగల్, గిరీష్ కర్నాడ్, తమిళంలో కె.బాలచందర్, బాలు మహేంద్ర, భారతీ రాజా, వెట్రి మారన్ లాంటి వారు ఉన్నారు.

దక్షిణ తమిళనాడు ప్రాంతాల్లో తలైకూతల్ అనే సాంఘిక కట్టుబాటుపై తమిళ్‌లో 2018లో ‘బారం’, 2023 జనవరిలో ‘తలైకూతల్’ చిత్రాలు వచ్చాయి. తలై అంటే తల, కూతల్ అంటే స్నానం. వయస్సు మీద పడి ఇతరులపై ఆధారపడే ముసలి వారిని వాళ్ళ కుటుంబ సభ్యులే చంపే ఈ పద్ధతిని తలైకూతల్ అని పిలుస్తారు.ఈ ఆచారంలో కుటుంబ సభ్యులు తమ ఇంట్లో మంచాన పడ్డ ముసలి వాళ్లకు పొద్దున్నే నూనెతో తల మర్దన చేసి వారి చేత ఎక్కువ నీరు త్రాగించి, లేదా లేత కొబ్బరి నీరు త్రాగిస్తారు. దీనిద్వారా వారి మూత్ర పిండాలు చెడిపోయి ఆ వ్యక్తి నాలుగు గంటలు లేదా ఒక రోజులో మరణించడం జరుగుతుంది. ఇది ఒక మెర్సీ కిల్లింగ్ లాంటిదే.

తలైకూతల్‌ సినిమాలో..

ఇంతటి లోతైన విషయాన్ని ప్రపంచానికి తెలియజేశారు దర్శకుడు జయప్రకాష్ రాధా కృష్ణన్‌ను ఇందులో హీరో పజాని(సముద్ర ఖని). ఒక బ్యాంక్ ఎటిఎం దగ్గర వాచ్ మెన్‌గా పనిచేస్తాడు. ఇతనికి ఒక భార్య, హై స్కూల్ చదివే కూతురుతో పాటు అచేతనంగా మంచాన పడ్డ ముసలి తండ్రి వీరితో పాటు ఉంటారు. భార్య ఒక అగ్గిపెట్టెల కర్మాగారంలో కూలిగా పనిచేస్తుంది. సినిమా ప్రారంభంలోనే ముసలి తండ్రికి మల మూత్రాలు తీసి స్నానం చేయించి గొంతులోకి ఒక ప్లాస్టిక్ గొట్టం ద్వారా అతనికి ద్రవ పదార్థాలు అందజేయడం, ప్రతి రోజు తండ్రి కదలికలు గమనించడం దినచర్య. తండ్రి వైద్య సేవల నిమిత్తం హీరో ఇల్లు తాకట్టు పెట్టి అప్పు చేయడం, అప్పు ఇచ్చిన వాడు వడ్డీ చెల్లించమని భయపెట్టడం జరుగుతూ ఉంటుంది. భార్య తరఫున తండ్రి ఆమె సోదరుడు హీరో దగ్గరకు వచ్చి, ఎంత కాలం ఈ ముసలివాడికి సేవ చేయడం నిలదీయడం చేస్తూ ఉంటారు. సినిమా మధ్యలో ముత్తు(ముసలి తండ్రి) యవ్వనంలో ఉన్నప్పుడు ఒక రజక యువతిని ప్రేమించి రహస్యంగా పెండ్లి చేసుకోవడం అతనికి లీలగా గుర్తుకు వచ్చే సన్నివేశాలు చిత్రాన్ని ముందుకు తీసుకుని వెళుతాయి. తన తండ్రికి హీరో చేసే సేవలు, తన మోపెడ్‌పై ఒక కుర్చీ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లి డాక్టర్‌ను ప్రాధేయపడటం, గుడికి తీసుకొని వెళ్లి పూజలు చేయడంలో సముద్ర ఖని గొప్పగా నటించాడు.

సినిమా మధ్యమధ్యలో భార్య మూతి విరుపులు ఈసడింపులు బంధువుల సలహాలు, చివరికి భార్య 'నీ తండ్రికే సేవలు చేసుకో' అని మంగళ సూత్రాన్ని తెంపి విసిరి వేస్తుంది. ఇలా సినిమా చివరలో హీరోయిన్, తండ్రి సోదరుడు, ఊరి పెద్దల బలవంతం మేరకు తలైకూతల్ ఆచారం పాటిస్తారు. ఆ ఆచారం పాటించే రోజు ఆ ముసలి తండ్రికి ఆచారం ప్రకారం తలకు నూనె మర్దించి, లేత కొబ్బరి నీరు త్రాగించిన తర్వాత చావుకు ఎదురుచూస్తున్న వారికి ముదుసలి కాలి వేళ్ల కదలిక చూసి బంధువులు ఒక ప్రైవేటు వైద్యుని పిలిపించి ఇంజక్షన్ ఇప్పించి చంపి వేస్తారు. ఈ సన్నివేశాన్ని చూసిన ప్రేక్షకులకు గుండెలు బరువెక్కుతాయి. తండ్రి మరణించిన తరువాత ఇల్లు అమ్మివేసి భార్య పిల్లలతో పట్టణంకు తరలివెళ్లడం, తండ్రి చనిపోయిన తరువాత ఒక మొక్కను నాటడం, కొన్ని సంవత్సరాల తరువాత తన యుక్త వయస్సురాలైన కూతురుతో వచ్చి, పెరిగి వృక్షంగా మారిన మొక్కను సృజించడంతో సినిమా ముగుస్తుంది. ఈ చిత్రంలో తండ్రిపై కొడుకుకు ఉన్న ప్రేమ, బంధువుల మధ్యన హీరో నలిగే సన్నివేశాలు, ప్రేక్షకులకు కన్నీరు తెప్పిస్తాయి. ఈ సినిమా చూడాలనుకుంటే నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

‘బరువు’ (బారం) చిత్రంలో

ఈ చిత్రంలో ఈ ఆచారాన్నే బారం పేరుతో తీశారు. (బరువు అనే అర్థం). ప్రియా కృష్ణస్వామి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2019 లో జాతీయ అవార్డు గెలుచుకుంది. తలైకూతల్ పై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ మెర్సీ కిల్లింగ్ ముసుగులో ఈ తలైకూతల్ అనేది ఒక వ్యవస్థీకృత నేరంగా (organized crime) గా ఎలా రూపుదిద్దుకుంది అనేది ఈ సినిమాలో చూపించారు. యాక్సిడెంట్ అయి కాలి ఎముక విరిగి మంచం పట్టిన తండ్రికి ఆపరేషన్ చేస్తే తిరిగి నడుస్తాడు అని డాక్టర్ చెప్పినా అందుకు ఖర్చు అవుతుందని తలైకూతల్ ముసుగులో తండ్రిని చంపిస్తాడు సెంథిల్ అనే వ్యక్తి. ఆ హత్య గురించి చనిపోయిన ముసలాయన మేనల్లుడు బయటపెట్టిన తర్వాత ఏమి జరుగుతుంది అనేది ఈ సినిమా కథ.

ఈ సినిమా గురించి పక్కన పెడితే తలైకూతల్ చట్ట వ్యతిరేకమైన ఆచారం. కానీ దానికి అక్కడి సమాజ ఆమోదం ఉంది. మంచం పట్టిన వారిని చంపాలి అని కుటుంబం నిర్ణయం తీసుకున్న తర్వాత అందుకు 26 రకాల పద్ధతులున్నాయని చెబుతారు. తలకు నూనెతో మర్దన చేసి కొబ్బరి నీళ్ళు అధికంగా తాగించి దాని ద్వారా కిడ్నీలు పనిచేయకుండా చేసి రెండు రోజులలో మనిషి ప్రాణం తీసే పద్దతిని ఒక మహిళ ద్వారా ఈ సినిమాలో చెప్పించారు. దానిని ఆమె ఉచితంగా చేస్తానని దీనిని వారికి చేసే సేవగా భావిస్తానని చెప్పడం అక్కడి సమాజంలో ఈ ఆచారానికి ఎంత గౌరవం, మద్దతు ఉందో తెలియచేస్తుంది. తమను పెంచి పెద్ద చేసిన తల్లితండ్రులు మంచం పట్టి ఇక తేరుకోలేని బాధ పడుతుంటే చూడలేక ఈ ఆచారానికి శ్రీకారం చుట్టారని చెబుతారు. కానీ దాని ముసుగులో కోలుకునే అవకాశం ఉన్న వారిని కూడా ఎంత దారుణంగా సమాజ ఆమోదంతోనే హత్య చేస్తారు అనేది చూస్తుంటే ఎంత దుర్మార్గమైన సమాజంలో బతుకుతున్నాం మనం అని బాధ కలుగుతుంది.

ప్రపంచంలోనే ఎక్కడా లేని అతి గొప్ప కుటుంబ వ్యవస్థ మనది అని చెప్పుకునే దేశంలో... ప్రేమ పేరుతో, దయ పేరుతో కుటుంబమే చేసే హత్యలను ఏ జడ్జిమెంట్స్ లేకుండా ఉన్నది ఉన్నట్లుగా మన కళ్ళ ముందుకు తీసుకువచ్చిన సినిమా ఇది. ఏ నాటకీయత లేకుండా చాలా సహజమైన సన్నివేశాలు, సంభాషణలు నిజానికి ఒక డాక్యుమెంటరీ చూస్తున్న అనుభవాన్ని ఇస్తాయి. ఎటువంటి మనుషుల మధ్య ఉన్నాం మనం అని ఉలిక్కిపడేలా చేస్తాయి. దక్షిణ తమిళనాడులో ఈ ఆచారాన్ని పాటించే గ్రామాలలో ముసలివాళ్ళు కొందరు తలనొప్పి వచ్చినా మంచాన పడితే పిల్లలు ఎక్కడ చంపేస్తారో అనే భయంతో ఇంటినుండి పారిపోతారని విన్న తర్వాత ఇంత క్రూరత్వం నింపుకున్న సమూహంలోని మనుషులమేనా ప్రేమ, దయ, మానవత్వం వంటి విలువల గురించి సందేశాలిచ్చేది అని బాధ కలిగింది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు.

ఆళవందార్ వేణు మాధవ్

86860 51752

Advertisement

Next Story

Most Viewed