- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లేఖ:భాషాపండితులను కరుణించండి
తెలంగాణ రాష్ట్రంలో భాషాపండితుల పరిస్థితి విచిత్రంగా ఉంది. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లు, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ, అధికారుల అలసత్వం వలన అమలు కాకుండా పోతున్నది. ఒకే రకమైన విద్యార్హతలు ఉండి, ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌తో సమానంగా సేవలందిస్తూ, శ్రమ దోపిడీకి గురవుతూ ఎస్జీటీ కేడరుగా లెక్కించబడుతున్న భాషాపండితుల పరిస్థితి మరీ దారుణం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
కానీ, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులకు ఇది వర్తింప చేయలేదు. హైస్కూల్లో పని చేస్తూ ప్రాథమిక పాఠశాల స్థాయి జీతాలు తీసుకుంటూ భాషా పండితులు వెట్టిచాకిరికి గురవుతున్నారు. ఇది వారికి 30 సంవత్సరాల నుండి తీరని సమస్య.
ప్రభుత్వ ఉద్యోగం అంటే సర్వీసులో చేరాక ప్రమోషన్లు తప్పనిసరి. కానీ, భాషా పండితుల విషయంలో ఇది అమలు కావడం లేదు. ఎప్పుడో భాషా పండితులు గా నియమితులై, ఎలాంటి పదోన్నతులు పొందకుండా పదవీ విరమణ చేస్తున్నారు. ఇది వారికి శరాఘాతం. ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికల సందర్భంగా వారికి ప్రమోషన్లు ఇస్తున్నట్లు హడావుడిగా జీఓలు ఇప్పించి, తీరా ఎన్నికలలో లబ్ధి పొందిన తర్వాత 'ఎక్కడి గొంగళి అక్కడే' అన్నట్టుగా ఉంది. అయితే, దీనిపై కోర్టు కెక్కిన తర్వాత స్టే తీసుకురావడం పరిపాటి అయింది. 2017లో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి సమక్షంలో ముఖ్యమంత్రి గారు భాషా పండితులకు 15 రోజులలో ప్రమోషన్లు ఇచ్చి వారి సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రకటించి మాతృభాష పైన వారికి ఉన్న మమకారాన్ని చాటుకున్నారు.ఈ ప్రకటన భాషాపండితులకు ఎంతో సంతోషాన్ని నింపింది.
ఈ ప్రకటన వచ్చి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు గడిచినా పండితులకు పదోన్నతులు మాత్రం రాలేదు. ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇస్తామని ప్రకటించిన సందర్భంగా భాషా పండితులు, పీఈటీల ఆశలు మళ్లీ చిగురించాయి. వారి చిరకాల స్వప్నమైన పదోన్నతులు ఇచ్చినట్లయితే జీవితాంతం వారికి పండితులు రుణపడి ఉంటారు. ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులుగా ప్రమోషన్లు ఇస్తున్న సందర్భంగా, తప్పనిసరిగా భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్‌గా ఉన్నతీకరణ చేసి సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ మొదలు పెట్టినట్లయితే భాషాపండితుల కల సాకారం అవుతుంది.
యాడవరం చంద్రకాంత్ గౌడ్
94417 62105