విలువ కోల్పోయిన ఉపాధ్యాయుల జీవితాలు..

by Ravi |   ( Updated:2024-12-08 01:16:11.0  )
విలువ కోల్పోయిన ఉపాధ్యాయుల జీవితాలు..
X

ఉపాధ్యాయులు భావితరాల నిర్దేశకులు.. ఉత్తమ సమాజ రూపశిల్పులు.. పిల్లల జీవితాల్లో వెలు గులు నింపేందుకు కొవ్వొత్తిలా కరిగిపోయే నిస్వా ర్థ సేవకులు.. విజ్ఞానంతో మనిషికి నగిషీలు దిద్దే కార్ఖానాలో కార్మికులు.. అయితే, ఆ మనుషుల కు కష్టమొచ్చింది. కష్టమంటే కష్టం మాత్రమే కాదు. ఆపద సైతం వచ్చింది. జీతం కోసం వెలకట్టలేని సేవలకు విలువ కోల్పోయి తమ జీవితా లను పోగొట్టుకొనే ఆపత్కాలం దాపురించింది. ఓ సినిమా హీరో జాతి సంపదను కొల్లగొడుతూ అడవులను నరికి కోట్లకు అధిపతి అయితే, ఆ నేరస్తుడిని అభిమాన హీరోగా చూసిన యువత, పిల్లలు ఊహించుకుంటే ఎలా ఆలోచిస్తారు?

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇటీవల ఉపాధ్యాయుడిపై విద్యార్థులు కిరాతకంగా దాడి చేయడం, ఆయన పాఠశాల ప్రాంగణంలో అసువులు బాయడంతో ఒక్కసారిగా సమాజం ఉలిక్కిపడింది. విద్యార్థులలో అల్లరిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన ఆయన ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థుల అసహజ ప్రవర్తనను ఖండించాల్సిన సహ ఉపాధ్యాయులు సంఘటనను తప్పుదారి పట్టించేందుకు యత్నించడం చూస్తే ఈ సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావ ట్లేదు. పిల్లల్లో నానాటికి పెరుగుతున్న నేర ప్రవృత్తిని అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు సమిష్టిగా ఆలోచించకపోతే వారి భవిష్యత్తు అంధకారమవుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. ఈ సంఘటన సమాజంలో ప్రబలుతున్న ప్రమాదకర సంకేతాలు చెరవేశాయి. ఈ ఘటన ద్వారా ఉపాధ్యాయుడికి విద్యార్థికి మధ్య ఉండాల్సిన ఒక సున్నితమైన పొరను చెరిగిపోవడాన్ని ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి. వారి మధ్య ఉండాల్సిన వాత్సల్య పూరిత అవినాభావ సంబంధం బీటలు వారి నేర ప్రవృత్తి తిష్ట వేయడం ఇబ్బందికరమైన పరిణామంగానే చూడాలి. సామాజిక కాలుష్యాన్ని ఎండగట్టడానికి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన సమయం ఇది.

విద్యార్థుల్లో ప్రతీకార చర్యలా..?

విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలను అందిపుచ్చుకోవాల్సిన దశలో ప్రతీకార చర్యలు ఇబ్బందికరంగా మారాయి. విద్యార్థుల ఆగ్రహం సమకాలీన సమాజానికి ఏ మాత్రం వాంఛనీయం కాదు. ఉపాధ్యాయులపై భౌతిక దాడులు చేయడం ప్రతి ఒక్కరిని వేదనకు గురి చేస్తోంది. అందువల్ల విద్యార్థులలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తరచూ కొంత సమయం కేటాయించి సంభాషిస్తూ ఉండడం అవసరం. విద్యార్థుల మధ్య వైయుక్తిక భేదాలను గమనించడం కూడా అవసరమే. ఎప్పటికప్పుడు వారిలో పరివర్తన తేవడానికి అస్థిర ఆలోచనలను తొలగించడానికి కృషి నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉంది.

దెబ్బతింటున్న సయోధ్య!

చిన్న చిన్న కారణాలను సాకుగా చూపి తల్లిదండ్రులు చివరకు విద్యార్థులు కూడా ఉపాధ్యాయులపై పోలీసు కేసులు పెట్టడం సామాజిక వ్యవస్థల పతన స్థాయిని సూచిస్తుంది. ఉపాధ్యాయులకు బహుళ కార్యక్రమాలు అప్పగించడం వల్ల, బోధన కంటే ఇతరత్రా పనుల్లో నిమగ్నం కావడం వల్ల విద్యార్థుల్లో అసహనం పెల్లుబికి వారి మధ్య సయోధ్య దెబ్బతింటుంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులతో తగిన స్థాయిలో మమేకం కావాల్సిన అవసరం ఉంది. విద్యార్థులను బోధన వైపు మళ్లిం‌చుకోవడంలో చాలాచోట్ల ఉపాధ్యాయులు సఫలీకృతం కాలేక పోతున్నారు. కారణం పాఠ్యాంశాల్లో ఆసక్తికర అంశాల స్థానే అనవసర విషయాలు చొప్పించడం. కొందరి అసమర్థ బోధన, విద్యార్థుల్లో అభ్యాసనంపై అనాసక్తి వెరసి ఈ అగాధానికి కారణం కావచ్చు.

చిన్న కారణాలతో టీచర్లపై బెదిరింపులు..

విద్యారంగంలో సంస్కరణలు అవసరం. హింసను ప్రేరేపించే సీరియల్స్, సినిమాలపై సెన్సార్ విధించాలి. విద్యార్థుల్లో నేర ప్రవర్తనను తొలగించడానికి క్రమశిక్షణ కలిగినటువంటి విద్య అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పాఠశాలల పని వేళల్లో స్వల్ప కారణాలను సాకుగా చూపి కొందరు ఆకతాయిలు ఉపాధ్యాయులను బెదిరిస్తున్నారు. తమ రాజకీయ కార్యకలాపాలకు సహకరించలేదని ఈర్ష్యతో మరికొందరు ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారు. దాడులకు తెగబడుతున్నారు. విధి లేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించిన కనీసం ఎఫ్‌ఐ‌ఆర్ నమోదు కావడం లేదు.

కార్పొరేట్ శిక్షలను తగ్గించాలి..!

విద్యార్థికి నిత్యజీవితంలో ఎదురయ్యేటువంటి అనేక సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించుకునే విధంగా వారిలో ఆలోచన రేకెత్తించాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడినప్పుడు విషాదకర సంఘటనలు తటస్తించినప్పుడు యాజమాన్యాలు పక్షపాత రహితంగా వ్యవహరించాలి. విద్యార్థులను కొట్టడం గానీ అవమానించడం కానీ తీవ్రమైనటువంటి నేరమని 1973లో తొలిసారిగా ఢిల్లీ హైకోర్టు చెప్పిన తీర్పును ఈ సందర్భంగా స్ఫురణకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కార్పొరేట్ శిక్షలను తగ్గించడం కూడా అవసరమే. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల భౌతిక హింసకు పాల్పడినటువంటి సందర్భంలో, మహిళా ఉపాధ్యాయుల పట్ల లైంగిక దాడులు చేసినటువంటి సందర్భంలో కఠిన చర్యలు తీసుకోవడం కూడా అవసరమే. ఉపాధ్యాయుడు తరగతిని డైనమిక్‌గా మార్చేటువంటి స్వేచ్ఛ ఉండాలి. వారి ప్రవర్తనలో పరివర్తన తేవడం ఒక్క ఉపాధ్యాయుడి వల్లే సాధ్యం. లేకపోతే భవిష్యత్తులో భారతదేశం ఒక జువైనల్ కేంద్రంగా బాల నేరస్తులకు నిలయం అయ్యే అవకాశం ఉంది.

మోహన్ దాస్,

ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకులు

94908 09909

Advertisement

Next Story

Most Viewed