నివేదన:బతుకంతా వెట్టి చాకిరేనా!?

by Ravi |   ( Updated:2022-09-03 17:39:54.0  )
నివేదన:బతుకంతా వెట్టి చాకిరేనా!?
X

ఇప్పటికైనా ప్రభుత్వం జీఓ 180 ని సవరించి పాఠశాల స్వీపర్లందరికి నెలకు కనీస వేతనం రూ. 18000 ఇవ్వాలి. జీఓ 122, 212 లను సమీక్షించి స్వీపర్లను రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మరణించిన స్వీపర్ల స్థానంలో పని చేస్తున్న వారి వారసులకు నియామక పత్రం అందించాలి. వారు పని చేసిన కాలానికి వేతనాలు ఇవ్వాలి. 60 సంవత్సరాలు దాటిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి.

మైక్య రాష్ట్రంలో వారి బతుకంతా వెట్టి చాకిరే. స్వరాష్ట్రంలోనూ వారి ఆశలు చిగురించలేదు. ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఏకంగా దాదాపు 30 సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరు కనికరం చూపకపోతారా? అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో పారిశుద్ధ్య పనులు చేసే స్వీపర్ల బతుకులు దయనీయంగా ఉన్నాయి. కొందరు రూ.4000 కు, మరికొందరు రూ.1623కు, ఇంకొందరు ఎటువంటి వేతనం లేకుండా పని చేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 1983 కంటే ముందు ఐదు సంవత్సరాలు పనిచేసిన వారిని, 1993 కంటే పది సంవత్సరాలు ముందు పని చేసిన వారిని జీఓ నెం 122, 212 ద్వారా రెగ్యులరైజ్ చేసింది ఆనాటి ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతంలో ఉన్న స్వీపర్లను మాత్రం రెగ్యులరైజ్ చేయలేదు. దీంతో వారంతా తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్వీపర్ల సేవలనే క్రమబద్ధీకరిస్తామని, చేయకపోతే తెలంగాణ రానట్లేనని ఉద్యమకాలంలో తెలంగాణ పెద్దలు హామీ ఇచ్చారు. కానీ, అమలు కాలేదు.

'ఆసరా' కంటే అధ్వానం

రాష్ట్రం ఏర్పడిన తొలి రోజులలో జీఓ నెం 122, 212 ప్రకారం 360 మందిని రెగ్యులరైజ్ చేశారు. మిగిలినవాళ్లందరూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలను కలిసి ఎన్నో విన్నపాలు ఇచ్చినప్పటికీ, ఇప్పుడు అప్పుడు అంటూ కాలం గడుపుతున్నారు. కానీ, పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత 2016లో ప్రభుత్వం 180 జీఓను తెచ్చి 1993 కంటే ముందు నియామకం అయిన వారిని ఫుల్ టైం స్వీపర్లుగా, పార్ట్ టైం స్వీపర్లు గా విభజించింది.

ఫుల్ టైం వారికి రూ. ఐదు వేలు, పార్ట్ టైం వారికి రూ. నాలుగు వేలు వేతనం ఇవ్వాలని నిర్ణయించింది. 1993 తర్వాత నియమితులు అయిన వారి వేతనాలకు సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. దీంతో వారికి నెలకు రూ.1623 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. స్వరాష్ట్రంలోనూ వారి సర్వీస్ రెగ్యులరైజ్ కాకపోగా, వారిని రెండు, మూడు భాగాలుగా విభజించి వేతనాలలో వ్యత్యాసం చూపుతున్నారు. దీంతో ఆసరా పెన్షన్ కన్నా అధ్వానంగా మారాయి స్వీపర్ల బతుకులు.

కారుణ్య నియామకాలు ఏవీ?

ఆంధ్రప్రదేశ్‌లో స్వీపర్లు రూ. 18,000 కనీస వేతనంగా పొందుతున్నారు. తెలంగాణలో ఫుల్ టైం స్వీపర్లుగా 19 మంది, పార్ట్ టైం స్వీపర్లుగా రెండు వేల మంది పని చేస్తున్నారు. పార్ట్ టైం స్వీపర్లకు జీఓ 75 ప్రకారం రూ. 8000 ఇవ్వాల్సి ఉంది. ఈ జీఓ అమలులోకి రాలేదు. 2018 పీఆర్‌సీ ప్రకారం ఫుల్ టైం స్వీపర్లకు రూ.13000, పార్ట్ టైం స్వీపర్లకు రూ.10,400 ఇవ్వాల్సి ఉంది. పీఆర్‌సీ సైతం అమలుకు రాలేదు. 60 సంవత్సరాలు నిండినవారిని జీఓ 45 ద్వారా తొలగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్వీపర్ల సర్వీసు రెగ్యులరైజ్ కాకపోతే జీవితకాలం వారో, వారి వారసులో పని చేసేవారు. మన రాష్ట్రంలో 60 సంవత్సరాలు నిండితే చాలు రెగ్యులరైజేషన్‌తో సంబంధం లేకుండా తొలగిస్తున్నారు. ఉద్యోగ కాలంలో కొద్దో, గొప్పో జీతం వస్తుంది కాబట్టి కుటుంబం వారిని వృద్ధాప్యంలో పోషించేది. ఇపుడు వారిని సర్వీస్ నుంచి తొలగించడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, జీతం రాక వృద్ధాప్యంలో రోడ్డున పడుతున్నారు. రాష్ట్రంలో సుమారు వెయ్యి మంది వేతనం లేకుండా పది సంవత్సరాలుగా పని చేస్తున్నారు. వీరంతా స్వీపర్లు గా పనిచేస్తూ మరణించిన వారి వారసులు. చాలా శాఖలలో కారుణ్య నియామకాలు చేస్తున్న ప్రభుత్వం పాఠశాల స్వీపర్లను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నది.

అణగారిన వర్గాలవారే ఎక్కువ

పాఠశాలలో పారిశుధ్య పనులు చేస్తున్న స్వీపర్లలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీలాంటి అణచివేయబడిన వర్గాలకు చెందినవారే అధికంగా ఉన్నారు. వీరంతా అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారు. సంవత్సరాల తరబడి తీరని అన్యాయానికి గురి అవుతూనే ఉన్నారు. న్యాయం అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పటికైనా ప్రభుత్వం జీఓ 180 ని సవరించి పాఠశాల స్వీపర్లందరికి నెలకు కనీస వేతనం రూ. 18000 ఇవ్వాలి. జీఓ 122, 212 లను సమీక్షించి స్వీపర్లను రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. మరణించిన స్వీపర్ల స్థానంలో పని చేస్తున్న వారి వారసులకు నియామక పత్రం అందించాలి. వారు పని చేసిన కాలానికి వేతనాలు ఇవ్వాలి. 60 సంవత్సరాలు దాటిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వారి స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి.

జుర్రు నారాయణ యాదవ్

టీటీయూ అధ్యక్షుడు

మహబూబ్‌నగర్

94940 19270

Advertisement

Next Story

Most Viewed