- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Joshimath crisis: తోటకూరనాడే వినకపోతినే...పరిరక్షకులకే పనిష్మెంట్
తోటకూరనాడే చెప్పకపోతివే..' అంటూ చెడుదారిలో వెళ్లిన విషయాన్ని గ్రహించిన కొడుకు తన తల్లితో చెప్పే సామెత గురించి మనం విన్నాం. ఇప్పుడు జోషిమఠ్ విషయంలోనూ అక్కడి జలవిద్యుత్ కేంద్రాల నిర్మాణంతో ప్రకృతికి జరుగుతున్న విధ్వంసాన్ని, పర్యావరణ సమతుల్యానికి జరుగుతున్న ప్రమాదం గురించి అక్కడి స్థానికులు కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. కానీ దురదృష్టవశాత్తూ పిటిషనర్ల ఆవేదనను పక్కన పెట్టిన నైనిటాల్ హైకోర్టు అభివృద్ధి వారిపై అభివృద్ధి నిరోధకులనే ముద్రవేసి జరిమానా విధించింది. చివరకు స్థానికులు చెప్పిందే నిజమైంది. జోషిమఠ్ ప్రమాదపుటంచుల్లోకి వెళ్ళింది. గతంలో ఆ తీర్పునిచ్చిన జడ్జీలు 'తోటకూరనాడే ఆలోచించకపోతిమి..' అని ఇప్పుడు పశ్చాత్తాపపడితే బాగుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
కంచే చేను మేస్తే కాపాడేదెవరు.. ఈ నానుడి మనం చాలా కాలంగా వింటున్నాం. ఇప్పుడు అది మరోసారి రిపీట్ అయింది. పర్యావరణాన్ని పరిరక్షించాలనుకున్న ప్రజలే దోషులయ్యారు. ప్రకృతిని కాపాడాలనుకుని పనిష్మెంట్‌ను ఎదుర్కొన్నారు. ప్రభుత్వాలు కనికరించడం లేదని కోర్టును ఆశ్రయిస్తే అక్కడా వారికి చేదు అనుభవమే ఎదురైంది. ఒక్కరి కోసం కాక వేలాది మంది ప్రజల భవిష్యత్తు కోసం, ప్రకృతి పరిరక్షణ కోసం చేసిన పోరాటం వ్యతిరేక ఫలితాలను ఇచ్చింది. న్యాయస్థానం దృష్టిలో వారు అభివృద్ధి నిరోధకులు. ప్రజా ప్రయోజనం వ్యాజ్యం వేసే అర్హతే వారికి లేదన్నది. ఇందుకోసం నైనిటాల్ (ఉత్తరాఖండ్) హైకోర్టు వారికి తలా రూ. 10 వేల చొప్పున ఫైన్ వేసింది. అయినా వారి ఆత్మస్థయిర్యం దెబ్బతినలేదు.
ప్రమాదాన్ని శంకిస్తే జరిమానా
పర్యావరణాన్ని, ప్రకృతిని ధ్వంసం చేస్తే జోషిమఠ్‌కు ప్రమాదం ఏర్పడుతుందని, దీన్ని ఇప్పుడే అడ్డుకోకపోతే అనుభవించాల్సి వస్తుందని అనేక స్వీయ అనుభవాలతో ఆ స్థానికులు రెండేండ్ల ముందే ఊహించారు. ప్రకృతిని కాపాడుకోడానికి నడుం బిగించారు. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో కోర్టును ఆశ్రయించారు. పిటిషన్ వేసినా ఆశించిన ఫలితం రాకపోగా అవమానానికి గురయ్యారు. హైకోర్టులో న్యాయానికి బదులు జరిమానా ఎదుర్కోవాల్సి వచ్చింది. అభివృద్ధి పేరుతో ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా ప్రకృతిని ధ్వంసం చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు మాత్రం లైన్ క్లియర్ అయింది. వారు ఏం అనుమానించారో ఇప్పుడు జోషిమఠ్‌లో అదే నిజమైంది.
1973లో చిప్కో ఉద్యమం జరిగిన రైని అనే గ్రామం నుంచే ఇప్పడు ప్రకృతి పరిరక్షణ కోసం పోరాటం మొదలుకావడం గమనార్హం. సరిగ్గా యాభై ఏళ్ళ తర్వాత కూడా ప్రకృతి పరిరక్షణ ఉద్యమం మరో రూపంలో రిపీట్ అవుతున్నది. ఆనాడు చిప్కో ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న గౌరాదేవి మనుమడు సోహన్‌సింగ్ ఇప్పుడు ఈ ప్రకృతి పరిరక్షణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఈయనతో పాటు రైని గ్రామ క్షేత్ర పంచాయత్ మాజీ సభ్యుడు సంగ్రామ్‌సింగ్, ఇదే పంచాయత్ గ్రామ్ సభ హెడ్ భావన్‌సింగ్ రాణా, జోషిమఠ్ గ్రామానికి చెందిన కమల్ రతూరి, అతుల్ సతి కూడా పిటిషనర్లుగా ఉన్నారు. వీరంతా సోషల్ యాక్టివిస్టులుగానే పనిచేస్తున్నారు.
తపోవన్-విష్ణుగఢ్ జల విద్యుత్ కేంద్రంతో పాటు, ఎన్టీపీసీ నిర్మిస్తున్న 13 మెగావాట్ల రిషి గంగ హైడ్రో పవర్ ప్రాజెక్టులతో వాటిల్లుతున్న ముప్పుపై గ్రామ సభ సమావేశమై ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రకృతిని ధ్వంసం చేస్తున్న పనులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించింది. గతంలోనూ రిషిగంగ భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వీరు పిటిషన్ వేశారు. 2021 ఫిబ్రవరిలో వచ్చిన వరదలు, దాని కారణంగా గ్రామం ముంపుకు గురైన విషయాన్ని పిటిషన్‌లో పేర్కొన్నారు. దానికి ముందు ఇలాంటి ప్రాజెక్టుల కారణంగా 2007లో సైతం చమోలీ ఫ్లడ్స్ వచ్చి 200 మందికి పైగా పైగా చనిపోయారని గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర పర్యావరణ సంస్థలు 2021 ఫిబ్రవరికి ముందు ఈ ప్రాజెక్టులకు ఇచ్చిన అన్ని రకాల పర్యావరణ అనుమతులను రద్దు చేయాలని కోరారు.
ఆరోజు వారన్నదే నేడు నిజమైంది
ప్రాజెక్టుల కారణంగా ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయని, కాళ్ల కింద నేల కదిలిపోతున్నదని, నిలువ నీడ లేకుండా పోతున్నదని, జీవితాలు ప్రశ్నార్ధకమవుతున్నాయని, పర్యావరణ సమతౌల్యం తప్పుతున్నదని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. దురదృష్టవశాత్తూ వారి ఆవేదన అరణ్యరోదనే అయింది. రిషిగంగ ప్రైవేటు సంస్థను, ఎన్టీపీసీని బ్లాక్ లిస్టులో పెట్టాలని కోరారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూగర్భ సొరంగాల నిర్మాణం, అటవీ భూముల స్వాధీనం, కొండలను పేల్చివేస్తుండడంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, భవిష్యత్తులో వైపరీత్యాలతో జోషిమఠ్ ఉనికి ప్రశ్నార్ధకమవుతుందని వాపోయారు. ఆ పిటిషన్‌లో వీరంతా తమను తాము సామాజిక కార్యకర్తలుగా ప్రకటించుకున్నారు.
పిటిషన్‌ను విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మలతో కూడిన బెంచ్ 2021 జూలైలో తీర్పును వెలువరించింది. పిటిషన్ వేసిన ఐదుగురు తాము సోషల్ యాక్టివిస్టులనే విషయాన్ని నిరూపించుకోలేకపోయారని, కొద్దిమంది వ్యక్తులు తెర వెనక ఉండి వీరితో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయించారని వ్యాఖ్యానించింది. గుర్తుతెలియని ఒక కీలుబొమ్మ చేతిలో వీరు పావులు అని కామెంట్ చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం స్ఫూర్తిని దుర్వినియోగం చేశారని వారిపై నిందలు మోపింది. తలా రూ. 10 వేల చొప్పున ఫైన్ కట్టాలని తీర్పులో పేర్కొన్నది. ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి తాము పిటిషన్ వేస్తే ఇలాంటి అవమానం హైకోర్టు నుంచి ఎదురవుతుందని ఊహించలేదని ఐదుగురిలో ఒకరైన పిటిషనర్ అతుల్ సతి వ్యాఖ్యానించారు.
కోర్టే అవమానిస్తే న్యాయానికి తావెక్కడ
పిటిషన్‌లోని అభ్యర్థనను అప్రాధాన్యం చేస్తూ ఈ ఐదుగురు సోషల్ యాక్టివిస్టులేనా అనేదానిచుట్టే వాదనలు తిరిగాయి. తీర్పులో సైతం హైకోర్టు దాన్నే ప్రస్తావించింది. వారికి సామాజిక కార్యకర్త అనే అర్హత లేకపోవడంతో ఈ పిటిషన్ చెల్లదంటూ కొట్టివేసింది. కానీ పిటిషన్‌లోని వారి ఆవేదనను మాత్రం పక్కన పెట్టింది. ఐదుగురు స్థానికులు అప్పటివరకూ కళ్ళారా చూసిన అనుభవాలంతో ఏం జరగబోతున్నదని పసిగట్టారో ఇప్పుడు జోషిమఠ్‌లో అదే జరుగుతున్నది. కోర్టు ఆ రోజున వారి పిటిషన్‌లోని ఔచిత్యాన్ని గుర్తించి దానికి తగిన తీరులో స్పందించి ఉంటే ఇప్పుడు జోషిమఠ్‌లో ఈ ఉపద్రవం చోటుచేసుకుని ఉండక పోవచ్చు. కోర్టులో అవమానం పాలైన వీరికి రెండు గ్రామాల మహిళలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నీరుగారిపోవద్దంటూ ఉత్సాహం నింపారు.
1973లో చిప్కో ఉద్యమం జరగ్గా ఆ తర్వాత మూడేళ్లకు మహేశ్‌చంద్ర మిశ్రా నేతృత్వంలో కమిషన్ ఏర్పాటైంది. ఉత్తరాఖండ్‌లో ప్రాజెక్టుల ద్వారా పర్యావరణ పరిరక్షణకు జరుగుతున్న నష్టాన్ని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఆదేశించింది. కానీ ఆ కమిషన్ నివేదిక బుట్టదాఖలా అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకంతో ఇప్పుడు హిమాలయ పర్వత ప్రాంతంలోని ఉత్తరాఖండ్‌కు ముప్పు ఏర్పడింది. ప్రస్తుతం జోషిమఠ్‌కు మాత్రమే పరిమితమైన ఈ విధ్వంసం రానున్న కాలంలో నైనిటాల్‌కు సైతం ఎదురుకాదని చెప్పలేం. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రంగా జోషిమఠ్, పర్యాటక కేంద్రంగా నైనిటాల్ భవిష్యత్తులో చరిత్రలో ఎలా నిలిచిపోతాయన్నది కాలమే తేలుస్తుంది.
'అసలు'ను వదిలేసి 'కొసరు'ను పట్టుకుని
అభివృద్ధి పేరుతో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదనే చర్చ దాదాపు పాతికేళ్లుగా దేశంలో జరుగుతున్నది. వాతావరణ మార్పులతో ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయనే భావనతో కేంద్ర ప్రభుత్వం అటవీ మంత్రిత్వశాఖ పేరులో క్లైమేట్ చేంజ్ అనే పదాన్ని చేర్చింది. కానీ ఆచరణలో మాత్రం ఈ మార్పుతో ఒరిగిందేమీ లేదు. ఇప్పుడు ఉత్తరాఖండ్‌లో చూస్తున్న ప్రకృతి విధ్వంసమే అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నది. ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు స్పందించే కోర్టులు కూడా 'అసలు'ను వదిలేసి 'కొసరు'ను పట్టుకుని తీర్పునివ్వడం ఊహించని పరిణామం. 'తోటకూరనాడే వినకపోతినే' అనే తీరులో రెండేండ్ల క్రితం వెలువడిన హైకోర్టు తీర్పు తాజాగా జోషిమఠ్‌లో నెలకొన్న దయనీయ పరిస్థితులతో తెరపైకి వచ్చింది.
వృక్షో రక్షతి రక్షితః అని తిరుమల తిరుపతి దేవస్థానం లేదా రాష్ట్రాల అటవీశాఖలు నినదిస్తున్నా, హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి ఎన్ని ప్రోగ్రామ్‌లు వచ్చినా అడవుల ధ్వంసం, ప్రకృతి వనరుల విధ్వంసం ఆగకపోతే చివరికి బలయ్యేది మానవ సమాజమే. తీర్పునిచ్చిన జడ్జీలు సైతం ఆ సమాజంలో భాగమే. పిటిషన్‌లోని ప్రేయర్‌ను పక్కనపెట్టి పిటిషనర్లకు రకరకాల నిందలను, అపోహలను ఆపాదించడం దురదృష్టకరం. తెరవెనక ఉన్న కీలుబొమ్మ ఎవరో చెప్పకుండా వీరిని పావులుగా వాడుకున్నారనే కంక్లూజన్ ఇవ్వడం కూడా న్యాయవాదులకే మింగుడుపడలేదు. రెండేండ్ల క్రితం ఆ ఐదుగురు అనుమానించిందే నిజమైంది. జడ్జీలు పేర్కొన్న తీర్పు ప్రశ్నార్థకంగా మారింది.
ఎన్. విశ్వనాథ్
99714 82403
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read....