రాష్ట్ర ఉద్యమంలో వెయ్యి సార్ల కంటే ఎక్కువ అరెస్టయిన లీడర్ ఎవరో తెలుసా?

by Ravi |   ( Updated:2022-10-12 18:30:29.0  )
రాష్ట్ర ఉద్యమంలో వెయ్యి సార్ల కంటే ఎక్కువ అరెస్టయిన లీడర్ ఎవరో తెలుసా?
X

రాష్ట్రంలో నిస్వార్థ కమ్యూనిస్టు నేతగా పేరున్న గుండా మల్లేశ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు పీడిత ప్రజల వెంటే ఉంటాయి. 73 సంవత్సరాల వయసులో 13 అక్టోబర్ 2020న అనారోగ్యంతో గుండా మల్లేశ్ మరణించడంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా మూగబోయింది. పీడిత ప్రజల పక్షాన నిలబడి నిరంతరం ధిక్కరించే స్వరం లేకుండా పోయింది. లారీ డ్రైవర్‌ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం వ్యవసాయ కార్మికులు, రైతులు, అసంఘటిత కార్మికులు, సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడే నాయకుడి వరకు కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సీపీఐ కార్యదర్శి పదవి నుంచి రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడి వరకూ మల్లేశ్ ఎదిగారు.

పైసా కూడా సంపాదించుకోని నిజాయితీ గల నాయకుడిగా ఆయనకు మంచి పేరుంది. నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలిచిన మల్లేశ్ ఒకసారి సీపీఐ శాసనసభాపక్ష నేతగానూ వ్యవహరించారు. 1943 జూలై 14న రైతు కుటుంబంలో పుట్టారు. బెల్లంపల్లి పట్టణంతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. 1983లో ఎన్టీఆర్‌ కొత్తగా పార్టీ పెట్టిన సందర్భంలో సీపీఐ అభ్యర్థిగా ఆసిఫాబాద్‌ నుంచి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం 1985, 1994, 2009లో ఆయన విజయం సాధించారు. 2009లో బెల్లంపల్లి నుంచి గెలిచిన ఆయన సీపీఐ శాసనసభాపక్ష నేతగా కొనసాగారు. స్థానిక జడ్‌పీ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎస్‌సీ, పీయూసీ (12వ తరగతి) వరకు చదువుకున్నారు. తండ్రి గుండా పోష మల్లు స్వాతంత్ర సమరయోధుడు. సతీమణి సరోజ జిల్లా మహిళా సమాఖ్య నాయకురాలిగా కొనసాగారు.

Also read: అజ్ఞాత దాత నిజాం వెంకన్న

తెలంగాణ ఉద్యమంలోనూ

తెలంగాణ ఉద్యమంలో గుండా మల్లేశ్ కీలకపాత్ర పోషించారు. కేసీఆర్, జయశంకర్‌ సార్, అసదొద్దీన్‌ ఓవైసీ, సీపీఐ నారాయణలతో కలిసి శ్రీకృష్ణ కమిటీతో జరిగిన చర్చలలో పాల్గొన్నారు. పలుమార్లు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను కలిసిన బృందంలోనూ ఉన్నారు. తెలంగాణ జేఏసీ, సింగరేణి జేఏసీ, ప్రతిపక్ష పార్టీలు, జర్నలిస్టులతో కలిసి సింగరేణిలో నిర్వహించిన తెలంగాణ సాధన సభలు, ఉద్యమాలలో నేరుగా పాల్గొన్నారు. 1969 ఉద్యమంలోనూ కీలకంగా వ్యవహరించారు. కమిట్‌మెంట్‌ ఉన్న కమ్యూనిస్టు పార్టీ నాయకుడు. తన పెళ్లి రోజు ముహూర్తం దగ్గర పడుతున్నారని బంధువులు వెతుకుతుంటే, ఆయన మాత్రం బెల్లంపల్లి మార్కెట్‌లోని రామా టాకీసు ఎదుట తెలంగాణ సాధన కోసం కొనసాగుతున్న నిరహారదీక్షలో కూర్చొని ఉన్నారు. ప్రజా ఉద్యమాలలో వెయ్యిసార్ల కన్నా ఎక్కువగా అరెస్టయ్యారు.

1979 జనవరి 6న భూస్వాముల గూండాలు దాడులు జరిపినపుడు తీవ్రంగా గాయపడిన ఏఐటీయూసీ నాయకుడు వీటీ అబ్రహాం, జర్నలిస్ట్ మునీర్ తదితరులు చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతుండగా గుండా మల్లేశ్ నాయకత్వంలో పెద్ద ఎత్తున కార్మికులు సమ్మెకు దిగి, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పులలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ సంఘటనలో గుండా మల్లేశ్ తృటిలో తప్పించుకున్నారు. ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. సామాన్య ప్రజలను కలిసేవారు. గిరిపుత్రులకు పట్టాలు ఇవ్వాలని, భూమి హక్కు కల్పించాలని అసంబ్లీ వేదికగా డిమాండ్‌ చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కోసం ఎన్నో పోరాటాలలో పాల్గొన్నారు. 'పేదోడికి పట్టెడన్నం పెట్టే రైతన్న సంతోషంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉన్నట్లు లెక్క' అని నిరంతరం చెప్పేవారు.

(నేడు గుండా మల్లేశ్ ద్వితీయ వర్ధంతి)

Also read: అడవిని గెలిచిన యోధుడు


మయూర్ జానీ

మంచిర్యాల

99631 32631

Advertisement

Next Story