- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈసీ చేతులెవరు కట్టేశారు? మునుగోడులో జరుగుతుందేంటి?
మునుగోడులో జరుగుతున్న విచ్చలవిడితనంపై పుంఖానుపుంఖాలుగా మీడియా కథనాలు వస్తున్నాయి. మీడియాతో పాటు మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్), తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జన సమితి ఇలా ఎందరో ఉల్లంఘనలను ఎన్నికల సంఘం దృష్టికి తెస్తున్నారు. వాటన్నిటిని పరిశీలించి, సాక్ష్యాధారాలు నమోదు చేసి, మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియను వాయిదా వేయడమో, రద్దు చేయడమో సముచితం. చట్టబద్ద గడువుకు తగినంత సమయం ఉంది. ఆ తర్వాత క్షేత్ర పరిస్థితులు చక్కదిద్ది, వాతావరణం మెరుగుపరచి, తగు ముందస్తు జాగ్రత్తలతో ఉప ఎన్నిక సజావుగా నిర్వహించవచ్చు.
స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఎన్నికలు జరిపించడం ఎన్నికల సంఘం అధికారమే కాదు, బాధ్యత కూడా. చట్టం-న్యాయం, నీతీ-నియమం అన్నీ తప్పి అభ్యర్థులు, పార్టీలు దురాగతాలకు పాల్పడుతున్నపుడు ఎన్నికల సంఘం ఉపేక్షించకూడదు. 'కళ్ల ముందర ఉల్లంఘనలు జరుగుతుంటే, నిర్దిష్టంగా చట్టాలలో స్పష్టత కొరవడినా, ఎన్నికల సంఘం చొరవ తీసుకొని వాటిని అడ్డుకోవాలి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా జరిగేట్టు ఎన్నికల ప్రక్రియను ముందుకు నడిపించాలి. అంతే తప్ప, ఏ దైవిక అతీంద్రియ శక్తో వచ్చి, పరిస్థితిని చక్కదిద్దేలా తనకు బలం ఇవ్వాలని, అధికారం కల్పించి తన చేతులను బలోపేతం చేయాలని ప్రధాన ఎన్నికల అధికారి చేతులు ముడుచుకొని నిలబడవద్దు' అని ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. అందుకు అవసరమైన అధికారాన్ని రాజ్యాంగ అధికరణం 324 ద్వారా పొందాలనీ సూచించింది. ఎన్నికల కమిషన్‌కు ఆ అధికారాన్ని అపారంగా అందించే 'అధికారాల రిజర్వాయర్' సదరు అధికరణమని 'మహిందర్ సింగ్ గిల్ వర్సెస్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్స్' కేసులో సుప్రీంకోర్టు ఎంతో విస్పష్టంగా చెప్పింది.
మరి, ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతున్న 'మునుగోడు'లో అడ్డూ, అదుపూ లేని ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం, ధనవ్యయం, విచ్చలవిడితనం రాజ్యమేలుతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తున్నట్టు? తనకు తాను (సుమోటో) గా కల్పించుకొని ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు? చేష్టలుడిగి ఎందుకు చోద్యం చూస్తున్నట్టు? బాధ్యత కలిగిన పౌరుడిగా తెలంగాణ జన సమితి అదినేత ప్రొఫెసర్ కోదండరాం నిర్దిష్టంగా ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కూడా కదలిక లేకపోవడాన్ని ఎలా చూడాలి? ఒకరిని అడ్డుకుంటే, మరొకరినో, ఇద్దరినో, అందరినో అడ్డుకోవాల్సి వస్తుందన్న మొహమాటం ఎన్నికల సంఘానికి అడ్డొస్తుందనుకోవాలా? రాజ్యాంగం ద్వారా తమకు సంక్రమించిన స్వయంప్రతిపత్తిని ఎవరి రాజకీయ ప్రయోజనాలకో ఎన్నికల సంఘం తాకట్టుపెట్టినట్టు భావించాలా? ఇది అందరూ లేవనెత్తాల్సిన ప్రశ్న.
పంతాల వల్లే పతన పంథా
ఒక ఉప ఎన్నిక ఇంతగా ప్రజల దృష్టి మళ్లించిన సందర్భం ఇంతకు ముందెప్పుడూ చూసి ఉండం. ఇది కేవలం రాజకీయాల కోసమో, పోటీ తీవ్రతతోనో జరుగుతున్నది కాదు. అనేక చిత్ర`విచిత్రాలు చోటుచేసుకోవడం వలన అందరి దృష్టీ అటు మళ్లింది అనుకోవాలి. మొత్తం మంత్రిమండలి, పాలకపక్ష ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మోహరించారు. పాలన అంతా అక్కడికే తరలింది. స్కీమ్‌లన్నీ అక్కడి నుంచే ఆపరేట్ అవుతున్నాయి. ఏది జరగాలన్నా అక్కడే ముందు. ప్రత్యర్థి పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు నిరంతరం వచ్చీపోతున్నారు. రాష్ట్ర పాలకపక్షానికి ఏమాత్రం తగ్గని జోరు, హోరు ఆ పార్టీది. టీఆర్‌ఎస్ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో బీజేపీ చేతిలో ఓటమి, హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలలో గణనీయ సంఖ్యలో కార్పొరేటర్ల గెలుపుతో బీజేపీ దూసుకువచ్చిన తీరు వారిని ఆ పరిస్థితులలోకి నెట్టింది.
మునుగోడులో ఓడిపోతే. ఏడాది తిరక్కుండానే వచ్చే సాధారణ ఎన్నికలకు ముందు ఇదొక చెడు సంకేతం అవుతుందని భయం. అందుకే, ఏం చేసైనా గెలిచితీరాలనే పట్టుదల వారితో ఇవన్నీ చేయిస్తోందేమో! ఇక్కడ ప్రధాన పోటీదారు, కేంద్రంలో పాలకపక్షంగా ఉన్న బీజేపీదీ ఈ ఎన్నిక గెలిచితీరాలన్న పట్టుదలే. ఎందుకంటే, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి. ఆయన విసిరిన సవాల్ వలననే ఈ ఉప ఎన్నిక ముంచుకువచ్చింది. ఇక్కడ ఓడిపోతే 'టీఆర్‌ఎస్ పని అయిపోయిందని, తెలంగాణలో తాము అధికారం చేపట్టేంతగా ఎదుగుతున్నామని' బీజేపీ చేస్తున్న వాదనకు గండి పడుతుంది. 'ఇప్పటి వరకు లభించిన విజయాలు బలుపు కాదు, వాపు' అని ప్రత్యర్థి ప్రచారం చేసే ప్రమాదం ఉంది. కనుక, ఎట్లయినా గెలిచి తీరాలన్నది బీజేపీ పట్టుదల. ఇటువంటి సంకట పరిస్థితే కాంగ్రెస్‌ది. వరుస ఓటముల క్రమంలో మునుగోడు ఎన్నిక కూడా ఓడిపోతే, వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికలలో ఉనికికే ప్రమాదమని, తనకు స్థానం ఉండదని, బీజేపీ దాన్ని అక్రమించేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ భయం. వచ్చే ఎన్నికలలో మనుగడ కోసమైనా మునుగోడు ఉప ఎన్నిక గెలిచితీరాలన్నది వారి ఆశ.
Also read: మరోకోణం: మునుగోడులో ఏం జరగబోతుంది? దిశ ఎడిటర్ గ్రౌండ్ రిపోర్ట్
మరుగున ఏదీ జరుగుత లేదు
ఇదివరకు ఎన్నికలలో చిన్నాచితకా ఉల్లంఘనలు లోపల్లోపల జరిగేది. బహిరంగంగా జరిగినా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇస్తారనే భయం ఉండేది. ఇప్పుడా భయం ఏ పక్షానికీ ఉన్నట్టు లేదు. నియమావళి అమలులో ఉన్న నియోజకవర్గంలో యథేచ్చగా డబ్బు, మద్యం పంపిణీ జరుగుతోంది. ఓటర్లకు బంతి భోజనం ఏర్పాటు చేసి, ఒక మంత్రి స్వయంగా గ్లాసులలో మద్యం పోస్తూ కేళీ వినోదం పంచుతున్నారు. ఆ వీడియోలు వైరల్ అయినా, భయపడటం సంగతలా ఉంచి, కనీసం సిగ్గు కూడా పడడం లేదు. పైగా, 'అందులో తప్పేముంది?' అని వాదిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే బస్సులు బాడుగకు తీసుకొని మునుగోడు ఓటర్లను ఆధ్యాత్మిక యాత్రకు, ఓ పెద్ద గుడికి తీసుకుపోయారు. తమకే ఓటేసేలా దేవుని ముందు, వారితో ప్రమాణం చేయించారనీ ప్రచారం జరిగింది. నిజమెంతో తెలీదు కానీ, దాన్నెవరూ ఖండించలే!
మరో మంత్రి నిస్సిగ్గుగా, ఈ ఎన్నికలలో తాము ఓడిపోతే, జనానికి మేలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు ఆగిపోతాయని బహిరంగంగా ప్రకటించారు. ఇంకా ఎన్నెన్ని జరుగుతున్నాయో! మాంసం, చికెన్, మందు ఒక కవరులో పెట్టి చేతికిస్తున్నారు. చోటా మోటా కార్యకర్తల నుంచి పెద్ద స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధుల వరకు అవతలి పక్షం నుంచి కొనుగోలు చేస్తున్నారు. అలా అమ్ముడుపోయిన వారిని, పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి తిరిగి తెచ్చుకుంటున్నారు. వివిధ జనసమూహాల, సంఘాల నేతలను, వార్డుల ముఖ్యులను, కుటుంబ పెద్దలను మచ్చిక చేసుకునేందుకు మరెంత డబ్బు వెచ్చిస్తారో? ఇందుకు చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. 'ఓటుకింత' అంటూ ఓటరును మభ్యపెట్టే ప్రక్రియ తారస్థాయికి చేరుతోంది. ఇప్పటికే వేర్వేరు సంఘటనలలో సుమారు పది కోట్ల రూపాయలకు పైగా నగదు పట్టుబడింది. ఈ వ్యవహారాలన్నిటినీ కలిపితే దేశంలోనే అతి ఖరీదైన, ఖర్చు అయిన ఎన్నికగా మునుగోడు రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈసీ ఎన్నోసార్లు చర్య తీసుకుంది
ప్రజాస్వామ్యంలో పౌరులు స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఓటు వేసే వాతావరణం ఉండాలి. పోటీలో ఉన్నవారు కటిక నిరుపేదలైనా, ఆగర్బ శ్రీమంతులైనా తేడా లేకుండా ఓటరు మద్దతు కోరే సమాన స్థాయిని కల్పించడానికే చాలా నిబంధనలు, నియమాలూ ఉన్నాయి. అభ్యర్థులో, వారి మద్దతుదారులో, ఆయా పార్టీలో, డబ్బుతోనో, మద్యంతోనో, కానుకలతోనో ఓటర్లను ప్రలోభ పెట్టకూడదనే, వ్యయం మీద పరిమితులున్నాయి. పరిమితికి దాటి డబ్బు ఖర్చు చేయడాన్ని, ప్రజాప్రాతినిధ్య చట్టం. సెక్షన్ 123 (1) కింద అవినీతి చర్యగా పరిగణిస్తారు. ఇది శిక్షార్హమైన నేరం. ఇలా చేస్తే సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా అదే చట్టం సెక్షన్ 8(1) కింద ఆరేళ్లపాటు తదుపరి ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు.సెక్షన్ 77ని అనుసరించి, ప్రతి అభ్యర్థి ఇందుకోసం ప్రత్యేక ఖాతా నిర్వహించి ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. అలా చేయకున్నా సెక్షన్ 10(ఎ) కింద, మూడేళ్ల పాటు నిషేధం విధించే అధికారాలు ఎన్నికల సంఘానికున్నాయి.
నియమావళి ఉల్లంఘనకు పాల్పడటం, అరాచకం సృష్టించడం వంటివాటిని భారత శిక్షా స్మృతి (సెక్షన్ 171 బి ఐపీసీ) కింద కూడా నేరంగా పరిగణిస్తారు. ప్రభుత్వం తన అధికారాన్ని, వ్యవస్థలను ఎన్నికలలో దుర్వినియోగపరచకూడదు. విచ్చలవిడి ఖర్చుతో ఎన్నికల వాతావరణం పాడు చేస్తున్నారని లోగడ తమిళనాడులో ఆర్కేపురం అసెంబ్లీ ఎన్నికను ఎన్నికల సంఘం అర్ధంతరంగా వాయిదా వేసింది. నియమావళి ఉల్లంఘన కారణంగానే లోగడ విశాఖపట్నం అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరిగిన తర్వాత రద్దు చేసింది. పలు సందర్భాలలో ఫిర్యాదులకు స్పందించో, అధికారుల నివేదికలను బట్టో, కోర్డుల ఆదేశాలు పాటించో చర్యలు తీసుకుంది.
Also read: ఉన్నది ఉన్నట్టు: ఉపఎన్నికలు ఎవరికోసం వస్తున్నాయి?
ఇంత జరుగుతున్నా
మునుగోడులో జరుగుతున్న విచ్చలవిడితనంపై పుంఖానుపుంఖాలుగా మీడియా కథనాలు వస్తున్నాయి. మీడియాతో పాటు మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్), తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జన సమితి ఇలా ఎందరో ఉల్లంఘనలను ఎన్నికల సంఘం దృష్టికి తెస్తున్నారు. వాటన్నిటిని పరిశీలించి, సాక్ష్యాధారాలు నమోదు చేసి, మునుగోడు ఉప ఎన్నిక ప్రక్రియను వాయిదా వేయడమో, రద్దు చేయడమో సముచితం. చట్టబద్ద గడువుకు తగినంత సమయం ఉంది. ఆ తర్వాత క్షేత్ర పరిస్థితులు చక్కదిద్ది, వాతావరణం మెరుగుపరచి, తగు ముందస్తు జాగ్రత్తలతో ఉప ఎన్నిక సజావుగా నిర్వహించవచ్చు.
దిలీప్‌రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
పీపుల్స్‌పల్స్ రీసెర్చ్ సంస్థ
9949099802