దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

by Ravi |   ( Updated:2022-10-22 18:30:42.0  )
దీపావళి ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
X

చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. అందరి ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ నిర్వహించుకునే పర్వదినం. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు ఈ పర్వదినం వస్తుంది. హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది. ఆశ్వయుజ బహుళ త్రయోదశినే ధన త్రయోదశిగా జరుపుకుంటారు. పాత సామానులను తొలగించి ఇంటిని శుభ్రం చేస్తారు. కొత్తగా కొనుగోలు చేసిన వెండి, బంగారు ఆభరణాలు ఈ రోజున పూజలో పెడితే ధనలక్ష్మి అష్టయిశ్వర్యాలను ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు.

ధన త్రయోదశి రోజు ఏ వస్తువు కొనుగోలు చేసినా శుభం జరుగుతుందంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు దీపావళి జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. నూతన వస్త్రాల రెపరెపలు, పిండి వంటల ఘుమఘుమలు, పటాకుల చప్పుళ్లు, ఈ దివ్య దీపావళి సోయగాలు. దీపాల పండుగకు ముందు రోజు నరక చతుర్దశి జరుపుకుంటారు.

ఆ పేరు కలకాలం నిలిచేలా

అమావాస్య నాడు జరుపుకునే పండుగలు రెండు ఉన్నాయి. మహాలయ అమావాస్య, దీపావళి. దీపావళి రోజు సంధ్యా సమయంలో గోగు కర్రలకు గుడ్డ పీలికలతో కాగడాలు కట్టి, వెలిగించి, గుమ్మాలలో నేల మీద కొడుతూ 'దిబ్బి దిబ్బి దీపావళి, మళ్ళీ వచ్చే నాగులచవితి, పుట్ట మీద జొన్న కర్ర, పుటుక్కు దెబ్బ' అని పాడతారు. గోగు కర్రలను ఎవరూ తొక్కని చోట వేసి, వెనక్కి తిరిగి చూడకుండా కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లి శుభానికి మిఠాయి తింటారు. ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారని నమ్మకం. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మి దేవి పూజ చేస్తారు. ఈ పూజ తో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు.

ద్వాపరయుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామ గా జన్మిస్తుంది. నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మ అకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామను ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారు వేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినం గా మారింది.

(రేపు దీపావళి)


యాడవరం చంద్రకాంత్ గౌడ్

సిద్దిపేట,

94417 62105

Advertisement

Next Story