- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంత ప్రేమను భరించడం ఎలా?
'తన కొడుకు శవాన్ని చూసేందుకు కూడా భయపడే ఆ కన్న తండ్రిని చూసి నేను అసహ్యించుకుంటాను' అంటూ 1980ల చివరలో సృజన పత్రికలో వరవరరావు గారు అనువదించిన పెద్ద కవితను నా విద్యార్థి జీవితంలోనే చదివాను. ప్రముఖ హిందీ కవి సర్వేశ్వర్ దయాల్ సక్సేనా అనే హిందీ ప్రగతిశీల కవి రాసిన కవితకు వీవీ చేసిన గొప్ప అనువాదం అది. ఆ వాక్యం చాలా కాలం వెంటాడింది మమ్మల్ని.
ఇన్నేళ్లకు ఓ వాట్సాప్ గ్రూపులో ఒక కథనం కంటబడింది. కుటుంబానికి ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కసితో బతికుండగానే కూతురు చావు ప్లెక్సీ కొట్టించిన ఒక తండ్రి నిర్వాకంపై సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ రాసిన చిన్న కథనం ఇది. ‘ఈ దేశంలోని మనుషులంతా ముఖ్యంగా మగజాతి, మగబుద్దిగల స్త్రీజాతి మొత్తంగా స్త్రీకి చెందిన రహస్య అవయవం చుట్టూ కాపలాగా కూర్చుంది. అన్ని విలువలూ, తిట్లూ, మర్యాదలూ ఈ అవయవం నుండే మొదలవుతాయి.' ఇంత శక్తివంతమైన ప్రకటనను ఇటీవలి కాలంలో నేను చూడలేదు. కన్న తండ్రి దౌష్ట్యంపై ఇంత పటుత్వంతో ఈ చిన్న కథనంలో రచయిత ప్రకటించిన ఆ ధర్మాగ్రహానికి జేజేలు చెప్పాలి.
మనదేశంలో ఏముంది గొప్పతనం..
''ప్రతి సమాజంలో ఇలాంటి మూర్ఖపు తండ్రి వుంటాడు. అతడిని సమర్థించే మూర్ఖులుంటారు కాబట్టి ధైర్యంగా ఇలా ప్రవర్తిస్తాడు. నేను నా బిడ్డ శరీరాన్ని కన్నాను, కాబట్టి దాన్ని ఎవరివద్ద పడుకోబెట్టాలో నేనే నిర్ణయిస్తాననే కనీస నీతిలేని తనం ఇలాంటి వారికి ఉంటుంది. దొరికితే మచ్చుకత్తులతో నరికేయడం, బాత్రూముల్లో ఉరేయడం, నిద్రలో గొంతు పిసికి చంపడం వీళ్లకు అలవాటు. దొరకకపోతే ఇలా పిండప్రదానాలు చేయడం రివాజు. చిత్రమేమంటే ఇదే పని కూతురు కాకుండా కొడుకు చేస్తే ఏ తండ్రి చంపడు. పిండప్రదానాలు చేయడు. నిజానికి పెళ్ళిచేసుకోవడవం వల్ల భారం కొడుకుమీదనే పడుతుందని తెలిసినా.. విషాదం ఏమిటంటే.. ఇలాంటి వారిని అభినందించే చదువుకున్న మూర్ఖులుంటారు, వీళ్లకు సంఘాలూ వుంటాయి. ఇక్కడ సమస్య మారుతీరావులదే కాదు కుల ప్రాతిపదికన ఏర్పడిన సంస్థలది కూడా. సొంత శరీరం హక్కుల గురించి మాట్లాడని వీరంతా ఇతరుల శరీరాల మీద పెత్తనాలని తండ్రి పేరుతో హక్కులుగా రుద్దుతుంటారు.'' ఇది ఆ కథనం సారాంశం.
ఇదే ఏ పాకిస్తాన్‌లోనూ, ఇతర ముస్లిం దేశాల్లోనూ జరిగి ఇక్కడ వార్తగా వస్తే ‘చీ.. వాళ్ల బతుకే అంత’ అని పుంఖాను పుంఖాలుగా ఆ దేశాల గురించి కామెంట్లు చేస్తుంటాం. ఇలాంటి కథనాలు చదివాక మనదేశంలో కూడా ఏం గొప్పతనం ఏడ్చిందనిపిస్తుంది. ఈ దేశంలో ఇప్పటికే అగ్రవర్ణాల చదువుల బాట పట్టి కులాంతర, మతాంతర వివాహాలే కాదు ఖండాతర వివాహాలు కూడా చేసుకుంటూ.. ఇప్పటికే సంకరమైపోయారు. గత 40 ఏళ్ల కాలంలో మారిన మా ఊరే దీనికి నిదర్శనం. ఉన్నత చదువులు, ఉన్నతోద్యోగాలు, ఉన్నత జీవితం ప్రాతిపదికన ఇతర కులాలతో పెళ్లి సంబంధాలు చేసుకోవడానికి అగ్రకులాల కుటుంబాలు ఏమాత్రం వెనుకాడటం లేదిప్పుడు.
అప్పుడే దేశంలో మార్పు
అయితే, సామాజిక నిచ్చెన మెట్ల కిందే జీవిస్తున్న వెనుకబడిన కులాలు ఇప్పటికీ మేలుకోలేదు. అదే ఫ్యూడల్ కంపుతో, దమ్మిడికి పనికిరాని అదే స్వకుల అభిజాత్యపు ఊబిలో కొట్టుమిట్టులాడుతూ.. ఇష్టపడిన వాడిని చేసుకుని ఇల్లు వదిలిన కన్నకూతురుని దొరికితే చంపేస్తూ.. తగలబెడుతూ.. అదీ సాధ్యం కాకపోతే ఇలా బతికుండగానే చావు ప్లెక్సీలు కడుతూ లేని పరువును ఇలా వీధుల్లోకి తీసుకొస్తున్నారు. ఆడపిల్లల మర్మాంగం చుట్టూ కాపలా కూర్చున్న ఘనమైన దేశమా.. ఇలాగే వర్ధిల్లు నువ్వు.. అంబేడ్కర్ రాసిన 'కులనిర్మూలన' అనే ఆ మహగ్రంథంలో పేర్కొన్నట్లుగా వర్ణాంతర వివాహాలే ఈ దేశంలో నిజమైన విప్లవం అని చెప్పాలి. ప్రధానంగా వెనుకబడిన కులాల్లో వివాహ సంబంధాల్లో ఈ మార్పు ఎప్పుడు సాధ్యపడుతుందో అప్పుడే ఈ దేశం ముందుకెళుతుంది. అంతవరకు ఆడపిల్లల అవయవాలకు కావిలి కాస్తూ, ఘనమైన సంస్కృతి గురించి ఉపదేశాలు ఇచ్చుకుంటూ బతికేస్తుంటాం.
ఇష్టపూర్వకంగా యువతీయువకులు చేసుకుంటున్న వివాహ సంబంధాలు.. కులపరంగా ఘనీభవించిపోయిన భారతీయ సమాజంలో చోటుచేసుకుంటున్న కొంగ్రొత్త మార్పుకు తిరుగులేని చిహ్నాలనే చెప్పాలి. అదే సమయంలో కులం గడ్డకట్టించిన పాత ఆలోచనలతో, భయాలతోనే జీవితాలు వెళ్లదీస్తున్న పాతతరం తల్లితండ్రుల ఆలోచనలపై ఒకరకంగా జాలి పడాల్సిందే. ఆడపిల్లల ఇష్టాఇష్టాలకు వ్యతిరేకంగా ఎన్ని పరువు హత్యలు చేసినా, అడ్డంగా నరికేసినా, అవయవాల చుట్టూ కావిలి కాసినా నేడు, రేపు, భవిష్యత్తులో కూడా స్త్రీపురుషుల సంబంధాల్లో రావలసిన మార్పు ఇలాగే జరుగుతుంటుంది. రేపు గెలిచేదీ, యావత్ సమాజం ఆమోదం పొందేది కూడా ఈ మహత్తరమైన మార్పే.. అందుకే ఇష్టంతో పెళ్లి చేసుకున్న ఆ యువ దంపతులను కొనియాడుతూ వారు ఎక్కడున్నా చల్లగా ఉండాలని ఆశీర్వదిద్దాం..
-కె. రాజశేఖర రాజు
73964 94557
- Tags
- honor killings