నిత్య శ్రామికుడు చంద్రబాబు!

by Ravi |   ( Updated:2024-04-20 00:45:17.0  )
నిత్య శ్రామికుడు చంద్రబాబు!
X

సంక్షోభాల నుంచి అవకాశాలు వెతకడం, ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంగా మలచుకోవడం చంద్రబాబు నైజం. రాజకీయాలు ప్రజా శ్రేయస్సు కోసమే తప్ప అందులో స్వార్థ ప్రయోజనాలు కనిపించవు. సామాజిక, రాజకీయ, ఆర్థిక స్థితిగతులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా తాను మారుతూ, ప్రజలను మారుస్తూ.. నేటికి 74 వసంతాలు పూర్తిచేసుకున్నారు.

రాజకీయరంగంలో అరుదైన లక్షణాలు కలిగిన వ్యక్తిగా చంద్రబాబును మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి కొనియాడారు. అభ్యుదయ సమాజం కోసం ఆర్థిక, సామాజిక రంగాల్లో ప్రపంచ రూపురేఖల్ని మార్చగలిగిన కొద్దిమంది వ్యక్తుల్ని వరల్డ్ ఎకానమీ ఫోరం గుర్తించింది. వరల్డ్ డ్రీమ్ కేబినెట్‌కు 14 మందిని ఎంపిక చేసింది. అందులో చంద్రబాబుకు స్థానం లభించడం తెలుగువారికి దక్కిన అరుదైన గౌరవం. భారత రాజకీయ చరిత్రలో తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. కఠోర శ్రమ, క్రమశిక్షణ, విలువలతో కూడిన నియమబద్ధమైన జీవన శైలి ఆయనది. సరికొత్త విధానాలతో నవ్య చరిత్రకు నాంది పలికి దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. ప్రపంచ రాజకీయ యవనికపై స్పష్టమైన ప్రణాళిక, దార్శనికత కలిగిన అతికొద్ది మంది నాయకుల్లో చంద్రబాబునాయుడు ఒకరు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో జయాపజయాలు.. మరెన్నో ఆటుపోట్లు చవిచూశారు. అయినా చెక్కు చెదరని గుండె నిబ్బరం, మనోధైర్యం, నిరాశచెందని తత్వం, అలసట ఎరుగని ధీరత్వం ఆయనది.

ప్రజలతోనే.. ప్రజల్లోనే..!

ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీవ్రమైన ఎండలను సైతం వెన్నెల్లా భావిస్తూ 74 ఏళ్ల వయసులో రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం శ్రమిస్తున్న నిత్యకృషీవలుడు. తుఫాన్లు, భూకంపాలు, విపత్తులు అవి ఏవైనా, ఎక్కడ జరిగినా తానే ముందుంటారు. భిన్నమైన పాలన అందించి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. నవ్యాంధ్రను అభివృద్ధి చేయడంలో తనకు ఎదురైన అనేక సవాళ్లు, సమస్యలు అధిగమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ను శిథిలం నుంచి శిఖరం వైపు నడిపించారు. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో 1950, ఏప్రిల్ 20న జన్మించిన ఆయన క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల తన జీవన మంత్రంగా పాటించారు. చంద్రబాబు చిన్న వయస్సులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టి నూతన కార్యక్రమాలకు నాంది పలికారు. 1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. జన్మభూమి, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన తదితర కార్యక్రమాలతో నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ప్రజలతోనే.. ప్రజల్లోనే ఉంటారనే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌గా చంద్రబాబు వ్యవహరించి దేశ ప్రధానులను, రాష్ట్రపతులను చేయడంలో కీలక భూమిక పోషించారు. ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశానికి పరిచయం చేశారు.

సాంకేతిక విద్యలో గొప్ప మార్పులు

ఆంధ్రప్రదేశ్‌ను ఆధునీకరించి గ్లోబల్ ఎకానమీకి అనుసంధానం చేసిన ప్రధాన చోదకుడిగా చంద్రబాబును న్యూయార్క్ టైమ్స్ అభివర్ణించింది. ఐటీ రంగాన్ని ఉమ్మడి రాష్ట్రానికి తీసుకువచ్చి హైటెక్ సిటీ నిర్మించి, సైబరాబాద్ నగర నిర్మాణానికి రూపకల్పన చేశారు. సాంకేతిక విద్యా రంగంలో ఆయన తెచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఎందరో రైతు బిడ్డలను మట్టిలో మాణిక్యాలుగా మార్చాయి. మారుమూల గ్రామాలకు కూడా ఐటీ రంగాన్ని పరిచయం చేశారు. అధికారపక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల పక్షాన నిలిచారు. నవ్యాంధ్ర అభివృద్దికి బాటలు పడతాయని 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు పట్టం కట్టారు. ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, మరోవైపు రాజధాని లేదు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పటికీ మొక్కవోని దీక్షతో బస్సులో నుంచే పాలన సాగించారు. భూసమీకరణ ద్వారా 33 వేల ఎకరాలు సేకరించి రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన కృషి చేశారు. పోలవరాన్ని 72% నిర్మించారు. పట్టిసీమ ద్వారా వేల కోట్ల విలువైన పంటలను కాపాడారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా ఉపశమనం, పరిశ్రమల స్థాపన ఫైబర్‌గ్రిడ్‌, అన్న క్యాంటీన్లు వంటి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి.

పార్టీని మహావృక్షంగా మల్చి...

సిద్ధాంతపరంగా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ బీజాలు వేస్తే, చంద్రబాబు దానిని మహావృక్షంగా పెంచారు. దాని నీడన ముఖ్యమంత్రులు, మంత్రులు, వివిధ హోదాల్లో ఉన్న అనేకమంది సేవ తీర్చుకున్నారు. సమస్యలు లేకుండా విజయం సాధిస్తే అది విక్టరీ. కష్టాలు ఎదుర్కొని విజయం సాధిస్తే అది హిస్టరీ అవుతుంది. అలాంటి చరిత్రలను ఎన్టీఆర్, చంద్రబాబు సృష్టించారు. చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయవిచారణల పేరుతో ఇబ్బంది పెట్టాలని చూసినా ఏ ఒక్కటి రుజువు కాలేదు. తిరిగి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై వేధింపులు తీవ్రతరం చేసి అక్రమ కేసుల పరంపర కొనసాగించింది. రాజకీయపరంగా చంద్రబాబును ఎదుర్కోలేక సీఐడీ పేరుతో ఆయనపై అనేక అక్రమ కేసులు నమోదు చేసి 53 రోజుల పాటు నిర్బంధించినప్పటికి ఆయనలో మనోధైర్యం చెక్కు చెదరలేదు. పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున లెగిసి ముందుకు సాగారు. ఆయన జైలులో వున్నప్పటికి ప్రజా శ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధి కోసమే తపించారు.

ఏడు పదుల వయస్సులోనూ..

ఏడు పదులు దాటిన వయస్సులోనూ అభివృద్ధి నా కర్తవ్యం, సంస్కరణలు నా మార్గం, సుపరిపాలన నా ధ్యేయం అంటూ నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తున్నారు. సమైక్య రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పరిపాలించి, నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రానికి పదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి చరిత్ర సృష్టించారు. అన్ని రికార్డులు ఆయన సొంతం. నవ్యాంధ్ర ఐదేళ్ల పాలనలో ఎక్కడా ఆందోళనలు, ఉద్యమాలు, హింసాత్మక సంఘటనలు, అక్రమ కేసులు, అరెస్టులు, అణచివేతలు, ధర్నాలు, సమ్మెలు లేవు. వాతలు, కోతలు, ఆర్థిక ఇబ్బందులు అంతకంటే లేవు. నేడు 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న చంద్రబాబుని ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చూడాలని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

(నేడు చంద్రబాబు 75వ జన్మదినం సందర్భంగా)

మన్నవ సుబ్బారావు

99497 77727

Advertisement

Next Story